Monday, October 5, 2009

మంగళ హారతి గొను రామా

నీలవర్ణ శ్రీరామ నిను వర్ణించతరమా
నిత్య మంగళ హారతి గొను రామా శ్రీ రామా
1. ముని యాగమును గాచి రాతిని నాతిగ చేసి -2
జానకీని పెళ్ళాడి జయముగొను రామ జయము గొను - నీల -
2. వైకుంఠమందు నీవు వటపత్రసాయివై -2
వరలక్ష్మి తో గూడి జయము గొను రామా జయము గొను -నీల -
3.బాలికలందరము గూడి పచ్చాల హారతి -2
మురళి కృష్ణ గొను ముత్యాల హారతి
ఇదే రామ హారతి ఇదే

జీవితం ఏమిటి ?????

జీవితం ఏమిటి ?????
జీవనతరంగాలు-13

పాపాయి గా అమ్మ నాన్నల ముద్దుమురిపాలనందుకొని, చదువుల తల్లిగా తీర్చిద్దిదుకొని , పదవారువన్నెల ప్రాయాన్ని సంతరించుకొని , పుత్తడి బొమ్మగా రూపు దిద్దుకొని , కళ్యాణ జానకిగా పూలరధం లో అత్తవారింట అడుగిడి, కొత్తబంగారు లోకం లో విహరించి, గాజులందుకొని, పచ్చని సంసారం గా వర్ధిల్లుతూ,కదిలేకాలమా కాసేపు ఆగవమ్మా అని వేడుకుంటూ అబ్బా. . .   జీవితం ఎన్ని మలుపులు తిరిగింది! ఎన్నెన్ని అనుభవాలు అనుభవాలు,ఎన్నెన్ని అనుభూతులు,ఎన్ని బంధాలూ,ఎన్నెన్ని అనుబంధాలు !నిద్రపట్టని జానకి అనుభూతులను కలబోసుకుంటూ,వివాహబంధంతో తనతో పెనవేసుకొని,భర్తగానే కాకుండా,తండ్రిలా,సోదరుడిలా,హితుడిలా,స్నేహితుడిలా అన్నివిధాల తనకు తోడూనీడై నిలిచిన,గాడ నిద్రలో ఉన్న విభుడిని మురిపెంగా చూసుకుంది.
ఉపచారాలే చేసానో ? అపచారాలే చేసానో ?
ప్రభూ ! ఇక అలసి పోయాను , మీ చల్లని వొడిలో సేద తీరనీయండి అనుకుంటూ రామయ్య మీద చేయి వేసింది జానకి.చల్లగా తగిలిన రామయ్య ను చూసి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది.ఇదేమిటీ అనుకుంటూ ఏమండీ ఏమండీ అని గాభరగా పిలిచింది.చలనం లేని రామయ్యను చూస్తూ నిస్తేజంగా కూర్చుండిపోయింది.
ఎవరొచ్చారో ,ఎవరెళ్ళారో,ఏమి జరుగుతోందో ,పిల్లలతో కలిసి అమెరికా ఎట్లా వెళ్ళిందో ఏమీ తెలియటం లేదు.ఎక్కడ ఎన్నిరోజులున్నా తన గూటికి చేరుకోవాలిగా!చిన్నగా మెట్లెక్కి వచ్చి,నీళ్ళు నిండిన కళ్ళతో
రెక్కలు తెగిపోయి, చెదిరిపోయిన గూడు,
వానలకు వాలిపోయిన రాధామాధవం,
తడిసి ముడుచుకున్న మామిడి,
ఆకులు నల్లబడ్డ నాగిని
ముందే ఎండలకు మోడైన తెల్ల సంపెంగి
వచ్చావా అని దీనంగా చూసాయి.
హడావిడిగా కరెంట్ తీగ మీద వంటరిగా
పరుగులు పెడుతున్న ఉడత ఒక్క నిమిషం ఆగి
నువ్వూ నాలాగే తోడు కోల్పోయావా అని విచారంగా అంది.
ఎంతసేపు బయట నిలబడతావు
లోపలికి రా అని జాలిగా స్వాగతించింది
శూన్యమైన గూడు.
ఇదేనా జీవితం? ఈ జీవనతరంగాలలో ఈ బంధాలూ ,అనుబంధాలూ ఎంతవరకు ?

https://www.youtube.com/watch?v=PCyj0NmU9hA