Tuesday, October 25, 2011

రాధాకృష్ణ



ఫ్రెండ్స్ తో కలిసి 'రాధాకృష్ణ ' సినిమా ను మొదటి సారిగా చూసాను . ఆ రోజు థియేటర్ లో అంతా స్టూడెంట్సే వున్నారు .సినిమా మొదలైన కొద్ది సేపటికే జయప్రద కనిపించగానే జాంపండూ అని , శోభన్ బాబు కనిపించగానే మొద్దబ్బాయ్ అని వకటే అరుపులు కేకలు . ఆపైన ఈలలు . సినిమా ఏమి చూసామో కాని ఈ అల్లరి అంతా ఎంజాయ్ చేసాము . మేమూ కాస్త అల్లరి చేసామనుకోండి :) ఏమిటో ఆ టైం అలాంటిది :) ఈ పరిచయం రాసేందుకు ఈ రోజు మళ్ళీ చూసాను .
షావుకారు కోదండరామయ్య గారి ఏకైక ముద్దుల కూతురు రాధ ( జయప్రద ) . ఆయన పాలేరు రంగయ్య కొడుకు కృష్ణ ( శోభన్ బాబు ) . చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు . కృష్ణ కు చదువంటే ఇష్టం లేదు . బడి కి వెళ్ళేందుకు చాలా గొడవచేసేవాడు . రాధ పుట్టినరోజున రాధను ఉయ్యాల వూపుతూ కింద పడేస్తాడు . భయము తో ఇంట్లో నుంచి పారిపోతాడు . బి.య.సి పాసై వూరికి తిరిగి వస్తాడు . డాక్టర్ చదువుకొని తన వూరిలోనే హాస్పెటల్ కట్టించాలి అని ఆశిస్తాడు . కృష్ణ చదువుకు కావలసిన ధన సహాయము చేస్తుంది రాధ . పాలేరు కొడుకు కు ఇచ్చి పెళ్ళిచేయటానికి ఇష్టపడని తండ్రి బలవంతము తో శివం ను పెళ్ళి చేసుకుంటుంది రాధ . అత్తవారింట్లో కష్టాలు పడుతుంది . ఇల్లు గడిచేందుకు డాన్స్ చేసి సంపాదిస్తూవుంటుంది . బందువుల కుతంత్రము తో భర్తను కోల్పోతుంది . కృష్ణ ఆమె ఇబ్బందులు చూడలేక తన చదువు కు ఇచ్చిన డబ్బును తిరిగి ఇస్తాడు . పై చదువులకై విదేశానికి వెళుతాడు . తిరిగి వచ్చేసరికి రాధ భర్త ను కోల్పోయి ఎక్కడవుందో తెలీదు . వూరిలో ఆసుపత్రి కట్టించి అక్కడకు వెళ్ళగ అక్కడ నర్సు గా రాధ కనిపిస్తుంది . ఆమెను పెళ్ళి చేసుకుంటాడు . క్లుప్తము గా కథ ఇది .
ఈ సినిమా అన్నపూర్ణావారు 1978 లో యద్దనపూడి నవల " రాధాకృష్ణ " అధారము గా నిర్మించారు . దీనికి దర్శకుడు కె. రాఘవేంద్రరావు . సినామా టైల్స్ వేసేటప్పుడు " వాతాపి గణపతిం భజే " అనే చక్కటి కీర్తనను బాక్ గ్రౌండ్ గా వినిపించారు . అది చాలా ఆహ్లాదముగా అనిపించింది . జయప్రద చాలా చక్కగా వుంది . డాన్స్ లు కూడా బాగా చేసింది . శోభన్ బాబు అందాల నటుడు . ఇక చెప్పేందుకు ఏముంది . కలవారి అమ్మాయికి కూడా కష్టాలు తప్పవా అనిపించింది . వంశ గౌరవమూ , ప్రతిష్ఠ అనే చక్రం లో బంధీలు పాపం . సినిమా అంతా చాలా నీట్ గా బాగుంది . కలర్ కాకుండా బ్లాక్ అండ్ వైట్ అవుతే ఇంకా బాగుండేదేమో !
ఇక సినిమా చూడండి ;

Tuesday, October 4, 2011

ప్రేమలేఖలు



కొంతమంది ఆడపిల్లలు ఏవో అందలాలు ఎక్కుదామని వూహలల్లుకుంటారు . తమ అందం మీద నమ్మకం తో , గర్వం తో జీవితాన్ని ఆటగా భావిస్తారు .స్వేచ్చ పేరిట సంకెళ్ళు తెంచుకున్నాం అనుకుంటారే తప్ప జీవించటానికి విలువైన ఆధారం వదిలేసుకుంటున్నాం అనుకోరు .చివరికి వీళ్ళు కోరుకున్న సుఖమూ దక్కదు , ఎవరి సానుభూతీ వుండదు . అలా తన జీవితాన్ని తెగినగాలిపటం లా చేసుకొని , నాశనం చేసుకున్న అమ్మాయి ప్రేమలత. తండ్రి గారాబము తో , ఇచ్చిన స్వేచ్చను దుర్వినియోగం చేసుకుంది . మదన్ చేతి లో కీలుబొమ్మగా మారింది . మదన్ సుజాత మీద మోజు పడుతున్నాడని అతని కి , తన ప్రాణ మిత్రురాలైన సుజాతను పరిచయం చేస్తుంది . అతని మాయ మాటలకు మోసపోయి , అతనిని ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకుంటుంది సుజాత . పెళ్ళి కి రెండురోజులు ముందుగా మదన్ అసలు స్వరూపం తెలుసుకొని , పెళ్ళిని వద్దనుకొని ధైర్యంగా అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది . అక్క సహాయం తో రవి ని పెళ్ళి చేసుకొని , తన జీవితాన్ని చక్కదిద్దుకుంటుంది సుజాత . ఈ ఇద్దరు అమ్మాయిల కథే యద్దనపూడి సులోచనా రాణి వ్రాసిన నవల కథ " ప్రేమలేఖలు ."
ఈ నవల ఆధారం గా అన్నపూర్ణా పిక్చర్స్ వారు 1977 అదేపేరు తో సినిమా తీసారు . ఇందులో సుజాత గా జయసుధ , ప్రేమలతగా దీప నటించారు . 'విచిత్రబంధం' . ' బంగారు కలలు ' సినిమాలని రంగులలో తీసినా ప్రేమలేఖలు బ్లాక్ అండ్ వైట్ లోనే తీసారు. నవల కథను , సంఘటనలను ఎక్కువగా మార్చలేదు . సెకండ్ ఆఫ్ లో కొద్దిగా మార్చారు . ఆ మార్చింది కూడా బాగుంది . ఇప్పటి వరకూ అన్నపూర్ణావారి సినిమాలలో హీరో గా నాగేశ్వరరావు వున్నా , ఇందులో మురళీమోహన్ హీరొ . హీరో , హీరోయిన్ గా మురళీమోహన్ , జయసుధ చక్కగా వున్నారు .అదికాదు విశేషం , మదన్ గా అనంతనాగ్ , ప్రేమలత గా దీప బాగా అమిరిపోయారు .సినిమా కూడా అన్నపూర్ణావారి స్టాండర్డ్ కు తగ్గట్లు నీట్ గా వుంది . ఈ సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు . ఈ సినిమా టైం కు హీరోయిన్ బొడ్డును చూపించటం ఇంకా మొదలుపెట్టనట్లున్నారు , అలాంటి సీనులేవీ లేవు :)
ఈ సినిమా పాటలు కూడా బాగున్నాయి . గీత రచయితలు , శ్రీశ్రీ , కొసరాజు , ఆరుద్ర , దాశరధి , గోపి .
సంగీతం - సత్యం ,
సహాయకులు శ్యాం .
గాయనీ గాయకులు ; పి. సుశీల ,
వాణీజయరాం ,
యస్. పి బాలసుబ్రమణ్యం
వి. రామకృష్ణ .
ఇది తీయని వెన్నెలరేయి , మది వెన్నెలకన్నా హాయి
నా వూహలు జాబిలి కురిపించెను ప్రేమలేఖలు .




విన్నానులే పొంచి విన్నానులే ,
ఏమని ?
ఒక అమ్మాయి అమ్మ అవుతుందని ఈ అబ్బాయి నాన్న అవుతాడని .



ఈ రోజు మంచి రోజు , మరుపురానిది , మధురమైనది
మంచి తనం వుదయించిన రోజు
ఈ రోజు మంచి రోజు , మరుపురానిది , మధురమైనది ,
ప్రేమ సుమం వికసించిన రోజు .


ఈ అందం , ఈ పరువం ,
నాలో దాచుకో , కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో .


ఆ కాలపు బొమ్మను కాను , ఈ కాలపు పిల్లను నేను ,
అన్యాయాన్ని ఎదిరిస్తాను . అనుకున్నది సాదిస్తాను .

ఈ నాటి విడరాని బంధం ,మనకేనాడో వేసాడు దైవం
ఈ నాటి విడరాని బంధం నేనాడో చేసిన పుణ్యం .