
బాపు దర్శకత్వం లో ,యలమంచలి సాయిబాబు నిర్మించిన "శ్రీరామరాజ్యం" ను నేను ఈ మధ్యే చూసాను . అప్పటికే వూరువాడా అంతా ఈ సినిమా గురించే మోగిపోతోంది . ఈ మధ్య కాలం లో ఇలాంటి చూడతగ్గ సినిమా రాలేదు . మా మనవరాలిని , మనవడి ని కూడా తీసుకెళ్ళాను . వాళ్ళకు అందులోని బాలహనుమాన్ , లవకుశ లు తెగ నచ్చేసారు .నాకూ నచ్చారనుకోండి . సినిమా చూడక ముందు , శ్రీరాముడి గా బాలకృష్ణ బాగుంటాడనే అనుకున్నాను . సీతమ్మవారిగా నయనతారదే కొంచం డౌట్ గా వుండింది . కాకపోతే ఓసారి బాపూబొమ్మగా బాపూ చేతిలో ఢోకా వుండకపోవచ్చు అనుకున్నాను . అలగాగే 90 శాతం పరవాలేదు .కాకపోతే స్నేహ కాని , వేద కాని వున్నట్లైతే ఇంకా బాగుండేవారేమో అని అనిపించకపోలేదు . అలాగే బాలకృష్ణకు మేకప్ ఇంకొంచం బాగావేసి వుండవలిసింది అనిపించింది . పిల్లలు ముగ్గురే కాదు ఆశ్రమం లోని పిల్లలంతా చాలా ముద్దుగా వున్నారు . మిగితా నటీనటులు కూడా వారి వారి పాత్రలను బాగానే పోషించారు . మొత్తం మీద సినిమా బాగానే అనిపించింది .
మేము సినిమా చూసి బయటకు రాగానే అక్కడ బాలకృష్ణ , నయనతారల ఫొటోకు ఒకావిడ అగరొత్తులు వెలిగించి దండం పెట్టటం కనిపించింది . ఇహ మా అమ్మాయిని చూసుకోండి ఒహటే నవ్వు . తనను చూసి పిల్లలు నవ్వులే నవ్వులు .వాళ్ళను చూసి , నేను ,శ్రీలలితగారు , వారి చెల్లెలు నవ్వీ నవ్వీ అలిసిపోయాము . ఇప్పుడేమి చూసారమ్మా , "లవకుశ" వచ్చిన రోజులలో ఐతే అంజలీదేవికి ఆడవాళ్ళందరూ పడీ పడీ దండాలు పెట్టేవారు , యన్ టీఅర్ ను , అంజలిదేవిని సీతారాముల లాగానే కొలిచారు అని శ్రీలలితగారు మా అమ్మాయికిచెప్పారు . పిల్లలంతా ఓగాడ్ అంటూ నవ్వలేక అలిసిపోయారు :)
ఈ సినిమా రచయతలు బాపు . ముళ్ళపూడి వెంకటరమణ.
సినిమాటోగ్రాఫీ;పి.ఆర్.కె రాజు .
సంగీతం ; ఇళయరాజా .
గాయనీ గాయకులు ;
యస్.పి బాలాసుబ్రమణ్యం ,
శ్రేయాఘోష్ ,
శ్వేతామోహన్,
కెయస్ చిత్ర,
సురభిశ్రావణి ,
శ్రీరాం పార్థసారధి,
అనిత,
కీర్తన
Monday, February 27, 2012
శ్రీరామరాజ్యం
Posted by మాలా కుమార్ at 2/27/2012 03:57:00 PM 0 comments
Wednesday, January 4, 2012
శాంతినివాసం
1960 లో శ్రీ పిక్చర్స్ బానర్ లో , సుందర్ లాల్ నహతా ,ట్. అశ్వద్దనారాయణ ,సి. యస్ రావు దర్శకత్వంలో నిర్మించిన కుటుంబకథా చిత్రం " శాంతి నివాసం " . ఇంటి ఇల్లాలు గయ్యాళిదైతే , యజమాని నెమ్మదస్తుడైతే , ఇల్లు నరకం గా మారుతుంది . భర్త ఎంతసేపూ పైవాడి దయ అంటూ వుంటాడు . భార్యేమో కోడళ్ళ ను రాచి రంపాన పెడుతూవుంటుంది . ఆడపడుచు అత్తింటి కి వెళ్ళకుండా పుట్టింట్లో నే వుంటూ అందరి మద్యలో పుల్లలు పెడుతూవుంటుంది . భర్త చనిపోయిన పెద్ద కోడలు , ఇద్దరు కొడుకులతో అత్తింట చాకిరీ చేస్తూ వుంటుంది . రెండో కోడలు సాత్వికం గా వుంటూ అందరినీ కలుపుకుపోతూ వుంటుంది . అలాంటి అశాంతినిలయమైన ఇంటికి పెళ్ళి చేసుకొని భార్యను తీసుకు రాదలుచుకోడు మూడో కొడుకు గోపి . కాని రాధ ను భార్యగా తీసుకు రావలసి వస్తుంది . చివరికి ఆ అశాంతినిలయం , శాంతినిలయం గా ఎలా మారుతుందో సినిమా చూడాల్సిందే :)
గయ్యాళి అత్తగా ఇంకెవరు సూర్యకాంతమే వంకపెట్టలేకుండా నటించింది . నెమ్మదస్తుడైన తండ్రిగా నాగయ్య , రెండో కొడుకు కోడలు గా కాంతారావు , దేవిక , మూడో కొడుకు కోడలు గా నాగేశ్వర రావు , రాజసులోచన , పెద్ద కోడలు గా హేమలత , కాంతారావు స్నేహితురాలు రాణి గా కృష్ణకుమారి నటించారు .
ఈ సినిమాలో సూర్యకాంతం గయ్యళితనం లాగే రాజసులోచన జడ కూడా హైలైట్ ! బహుషా ఈ సినిమా వచ్చినప్పుడే అనుకుంటా రాజసులోచన డాన్స్ ప్రోగ్రాం ఇచ్చింది . మా స్కూల్ పిల్లలందరినీ పొలోమంటూ తీసుకెళ్ళి ముందు వరస లో కూర్చోబెట్టారు .
పాటలన్నీ సముద్రాల జూనియర్ రాశారు . ఘంటసాల సంగీతం సమకూర్చారు .
శ్రీరఘురాం , జయరఘురాం . ఈ పాట పాడినది , పి.బి శ్రీనివాస్ , పి. సుశీల , బృందం .
రాగాలా సరాగాలా .ఈ పాట చాలా బాగుంటుంది కాని ఇందులో దేవిక భర్తకు చేసే సేవలను చూస్తే కళ్ళు గిర్రున తిరిగిపోతాయి :) ఈ పాట పాడినది , పి. సుశీల , ఘంటసాల .
రావే రాధా రాణీ రావే .ఈ పాట పాడినది , ఘంటసాల , జిక్కి .
కం కం కంగారు నీకేలనే ఈ రెండు పాటలల్లో బృందావనం గార్డెన్ బాగా చూపిస్తారు . ఈ పాట పాడింది ఘంటసాల , జిక్కి .
ఈ తుషార శీతల సరోవరాన
అనంత నీరవ నిశీధిలోనా ఈ కలువ నిరీక్షణ ,
నీ కొరకే రాజా వెన్నెల రాజా . . .
నా కిష్టమైన పాటలలో ఇది కూడా వకటి :)
Posted by మాలా కుమార్ at 1/04/2012 06:17:00 PM 2 comments
Labels: ఆ పాత మధురాలు
Thursday, December 1, 2011
అమెరికా అబ్బాయి
అన్నపూర్ణా వారి సినిమాల లిస్ట్ లో చివరగా వుంది "అమెరికా అబ్బాయి ." దీని నిర్మాత డి . మధుసూధన రావు . డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు . రాధిక , అశ్విని , రాజశేఖర్ , చరణదాస్ మాస్టర్.శ్రావణ్ శంకర్ మొదలైన వారు నటీ నటులు . కథ. జీడిగుంట రామచంద్ర మూర్తి .
ఇహ కథేమిటంటే జ్యోత్స్న ( అశ్విని ) అమెరికా లో డాక్టర్ . ప్రాణ స్నేహితురాలు శారద ( రాధిక ) కొడుకును పెంచుకుంటూ వుంటుంది . శారద పెళ్ళి కాగానే భర్త మరణిస్తాడు . కొడుకును అశ్విని కి ఇచ్చి , చరణదాస్ ను మళ్ళీ పెళ్ళాడుతుంది . శారద తండ్రి రాజారావు ( గుమ్మడి ) ఆస్తంతా మనవడు రాజా పేరు మీద రాస్తాడు . రాజారావు ట్రీట్మెంట్ కొరకు అమెరికా వస్తారు . ఆ తరువాత కథేమిటంటే నాకు తెలియదు . ఎందుకంటే నా సి . డి ఆ తరువాత ఇహ పనిచేయనని మొరాయించింది !
ఈ చిత్రము లోని పాటలు పి. సుశీల . యస్.పి బాలసుబ్రమణ్యం పాడారు .
సంగీతం రాజేశ్వర రావు .
ఇందులోని పాటలు కూడా నెట్ లో ఎక్కడా దొరకలేదు :)
ఇదో ఈ పాట వక్కటే దొరికింది . విని , చూసి ఆనందించండి .
Posted by మాలా కుమార్ at 12/01/2011 11:30:00 AM 4 comments
Labels: అన్నపూర్ణ పిక్చర్స్