Tuesday, January 31, 2017

శతమానంభవతి

శతమానంభవతి మొదలు కావటమే  పచ్చ పచ్చగా పచ్చని చేలతో, పెంకుటిళ్ళతో ఉన్న అందమైన గ్రామం ఆత్రేయపురం తో మొదలవుతుంది.కన్నులపండుగ గా ఉన్న ఆ గ్రామాన్ని చూస్తే,ఎక్కడో మహారాష్ట్రలో పసిపాప గా జన్మించిన గోదారమ్మ,అందమైన నవయవ్వనిగా పెరిగి,సఖుని కౌగిలి చేరేందుకు కోనసీమకు వచ్చి, మెట్టినింటిని పండించింది.అంతేగా పసిపాపగా పుట్టినింట్లో అమ్మానాన్నల గారాబం తో పెరిగిన అమ్మాయికి తన సఖుని చేరగానే తన ప్రపంచం అంతా అతనే  ఐపోతాడు.తన ఆశలు , ఊహలు, కోరికలు అన్నీ అతని చుట్టే అల్లుకుంటుంది.భర్త క్షేమం కోసం,సంతోషం కోసం పాటుపడుతుంది.నీడగా మారిపోతుంది.అత్తింటి గౌరవం నిలిపేందుకు తనకు వీలైన సహాయం చేస్తుంది.తనే అతను, అతనే తను అన్నంత గా మమేకమైపోతుంది.అతని ప్రతిరూపంగా తనలో రూపుదిద్దుకున్న పిల్లల మీద పంచప్రాణాలు పెట్టుకుంటుంది.ఆ పిల్లలు దూరమవుతే భరించగలదా ? వాళ్ళ కోసం ప్రాణం లో ప్రాణమైన భర్తను వదులుకోగలదా? ఏదీ భరించలేదు!ఆ బంధం మీదే అందంగా అద్భుతంగా అల్లినదే ఈ " శతమానంభవతి"సినిమా.
సినిమా ఆరంభం నుంచి చివరివరకూ ఏమవుతుంది అని టెన్షన్ గా చూడక్కర లేదు.హాయిగా తాఫీ గా మన ఇంట్లో నే జరుగుతున్నట్లుగా కలిసిపోతాము.ఆ కుటుంబం లో మనమూ ఒకరమైపోతాము.అందులో ని పాత్రలూ పాత్రధారులూ చక్కగా ఉన్నాయి.పెద్ద దంపతులు రాఘవరాజు, జానకి గా ప్రకాష్ రాజు, జయసుధ బాగా ఇమిడిపోయారు.యు జంట శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ బాగున్నారు. అనుపమాపరమేశ్వరన్ ముద్దుగా ఉంది. ముఖ్యంగా పాతకాలం ప్రేమను చూపించే ఫ్లాష్ బాక్ ప్రేమకథలో మేకప్, డ్రసింగ్ బాగున్నాయి.పాటలూ, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. సినిమా కోసం కొన్ని ఎమొషన్స్ ఎక్కువగా , కొన్నిసీన్స్ అసహజం గా  ఉన్నా  చక్కని కుటుంబకథా చిత్రము.1 comment:

శ్రీలలిత said...


వెంటనే వెళ్ళి సినిమా చూసెయ్యాలన్నంత బాగా చెప్పారు..