Wednesday, January 4, 2012

శాంతినివాసం



1960 లో శ్రీ పిక్చర్స్ బానర్ లో , సుందర్ లాల్ నహతా ,ట్. అశ్వద్దనారాయణ ,సి. యస్ రావు దర్శకత్వంలో నిర్మించిన కుటుంబకథా చిత్రం " శాంతి నివాసం " . ఇంటి ఇల్లాలు గయ్యాళిదైతే , యజమాని నెమ్మదస్తుడైతే , ఇల్లు నరకం గా మారుతుంది . భర్త ఎంతసేపూ పైవాడి దయ అంటూ వుంటాడు . భార్యేమో కోడళ్ళ ను రాచి రంపాన పెడుతూవుంటుంది . ఆడపడుచు అత్తింటి కి వెళ్ళకుండా పుట్టింట్లో నే వుంటూ అందరి మద్యలో పుల్లలు పెడుతూవుంటుంది . భర్త చనిపోయిన పెద్ద కోడలు , ఇద్దరు కొడుకులతో అత్తింట చాకిరీ చేస్తూ వుంటుంది . రెండో కోడలు సాత్వికం గా వుంటూ అందరినీ కలుపుకుపోతూ వుంటుంది . అలాంటి అశాంతినిలయమైన ఇంటికి పెళ్ళి చేసుకొని భార్యను తీసుకు రాదలుచుకోడు మూడో కొడుకు గోపి . కాని రాధ ను భార్యగా తీసుకు రావలసి వస్తుంది . చివరికి ఆ అశాంతినిలయం , శాంతినిలయం గా ఎలా మారుతుందో సినిమా చూడాల్సిందే :)
గయ్యాళి అత్తగా ఇంకెవరు సూర్యకాంతమే వంకపెట్టలేకుండా నటించింది . నెమ్మదస్తుడైన తండ్రిగా నాగయ్య , రెండో కొడుకు కోడలు గా కాంతారావు , దేవిక , మూడో కొడుకు కోడలు గా నాగేశ్వర రావు , రాజసులోచన , పెద్ద కోడలు గా హేమలత , కాంతారావు స్నేహితురాలు రాణి గా కృష్ణకుమారి నటించారు .
ఈ సినిమాలో సూర్యకాంతం గయ్యళితనం లాగే రాజసులోచన జడ కూడా హైలైట్ ! బహుషా ఈ సినిమా వచ్చినప్పుడే అనుకుంటా రాజసులోచన డాన్స్ ప్రోగ్రాం ఇచ్చింది . మా స్కూల్ పిల్లలందరినీ పొలోమంటూ తీసుకెళ్ళి ముందు వరస లో కూర్చోబెట్టారు .

పాటలన్నీ సముద్రాల జూనియర్ రాశారు . ఘంటసాల సంగీతం సమకూర్చారు .

శ్రీరఘురాం , జయరఘురాం . ఈ పాట పాడినది , పి.బి శ్రీనివాస్ , పి. సుశీల , బృందం .



రాగాలా సరాగాలా .ఈ పాట చాలా బాగుంటుంది కాని ఇందులో దేవిక భర్తకు చేసే సేవలను చూస్తే కళ్ళు గిర్రున తిరిగిపోతాయి :) ఈ పాట పాడినది , పి. సుశీల , ఘంటసాల .

రావే రాధా రాణీ రావే .ఈ పాట పాడినది , ఘంటసాల , జిక్కి .



కం కం కంగారు నీకేలనే ఈ రెండు పాటలల్లో బృందావనం గార్డెన్ బాగా చూపిస్తారు . ఈ పాట పాడింది ఘంటసాల , జిక్కి .
ఈ తుషార శీతల సరోవరాన
అనంత నీరవ నిశీధిలోనా ఈ కలువ నిరీక్షణ ,
నీ కొరకే రాజా వెన్నెల రాజా . . .
నా కిష్టమైన పాటలలో ఇది కూడా వకటి :)