Wednesday, September 23, 2009

కదిలేకాలమా!

జీవనతరంగాలు-12

"ఏమిటీ జానకీ?పొద్దూనే ఎవరిమీదో గొణుగుతున్నావు పనిమనిషి రానన్నదా ఏమీటీ?" పిల్లల ఫోటోలను తుడుస్తూ తనలో తాను గొణుక్కుంటున్న జానకిని అడిగాడు రామయ్య.
"పనిమనిషి వస్తే ఎంతా రాకపోతే ఎంత ?ఒక్కపూట పని చేసుకోలేనా ఏమిటి?ఐనా ఎప్పుడూ పనిమనిషి గోలేనా ?"అంది విసురుగా జానకి.
"ఐతే ఎవరిని?నన్నైతే కాదుకదా?" కాస్త భయపడుతున్నట్లు నటిస్తూ జోక్ గా అన్నాడు రామయ్య.
"హుం నన్ను చూస్తే మీకు జోక్ గానే ఉంటుంది.కాలం చూడండి అంత కొంపలు మునిగిపోతున్నట్లు హడావిడిగా పరిగెత్తటం ఎందుకుట? నిదానంగా వెళితే ఏమవుతుంది? ఈ బుజ్జిగాడు చూడండి అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడో!వాడి కొడుకు కాలేజ్ లో చేరాలిట.ఇందాక  ఫొన్ చేసినప్పుడు వాషింగ్ టన్ వెళ్ళి కాలేజ్ చూసొచ్చామమ్మా అన్నాడు"అంది కొడుకు చిన్నప్పటి ఫొటోని చూస్తూ.
"బాగుంది నీ బుజ్జిగాడెప్పటికీ బుజ్జిగాడుగానే, నా బంగారం ఎప్పటికీ గుడియాగానే ఉండిపోతారా? కాలం పరిగెత్తక నీకోసం ఎట్లా ఆగుతుంది?ఆగుతే నీ మునిమాణిక్యాలు ఎట్లా వచ్చేవారు?"నవ్వాడు రామయ్య.
"ఏమో నండి పిల్లలంతా ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు.ఇల్లంతా ఎంత శూన్యం గా ఉంది చూడండి.ఇలా ఉంటే అమెరికావాళ్ళు"ఎంప్టీ నెస్ట్"అంటారుట."
"బాగుంది వ్యవహారం.రెక్కలు వచ్చిన పిట్టలు ఎగిరిపోకుండా ఉంటాయా?ఎంప్టీ నెస్ట్ అని ఎందుకనుకుంటావు? నీకు నేను నాకు నువ్వు మలివయసులో ఒకరికొకరం.ఇన్ని రోజులూ బాద్యతల్లో ఉన్నాము.ఇప్పుడు భాద్యతలు తీరి, నేను రిటైర్ అయ్యి ఫ్రీగా ఉన్నాము.పద హాయిగా ఏ గోవానో సింగపూర్ నో తిరిగొద్దాము.చాయిస్ ఈజ్ యువర్స్ .చీరప్ బేబీ."ఉషారు గా అన్నాడు.
"అంతొద్దులెండి.నా కోరిక ఒకటి ఉంది తీర్చండి చాలు."అంది జానకి.
"అడుగు మేడం. ఇంతవరకు ఎప్పుడూ ఏది అడగని నువ్వు అడుగుతున్నావు.నీ ఇష్టం ఏదైనా ఇచేస్తాను. ఐ ఆం ఆల్ వేస్ ఎట్ యువర్ సర్వీస్ "అభయమిచ్చాడు.

https://www.youtube.com/watch?v=BCzplttGVEU

Friday, September 11, 2009

పచ్చని సంసారం



జీవనతరంగాలు -11

కొమ్మ కొమ్మ కో సన్నాయి ,కోటిరాగాలు పలికాయి . పచ్చని చెట్టు విరగ కాసి ,పండిన పచ్చ పచ్చని పనసతొనల్లా , మాణిక్యాలాంటి ,ముచ్చటైన పాప ,బాబు .రామయ్య కు గారాలపట్టి స్వాతైతే, జానకమ్మ ముద్దుల కొడుకు నేతాజీ. ప్రేమానురాగాలతో అల్లుకున్న చక్కని పొదరిల్లు.
కాలం కమ్మగా కరిగిపోతోంది.

జీవన తరంగాల పై ఆహ్లాదముగా సాగిపోతున్న జానకి బంగరు నావలోకి రామయ్య పాదము మోపటము తో మొదలయ్యి ఒకరొకరుగా కూతురు ,కొడుకు , అల్లుడు , కోడలు , మనవళ్ళు , మనవరాళ్ళూ వచ్చి చేరారు. చిన్న మనవడి రాక తో తన మెడ లో నవరతనాల మాల వేసుకున్నంతగా సంతోష పడింది జానకి. మనవరాళ్ళకి , ఆషాడ మాసములో చుట్టుపక్కల పిల్లలని పిలిచి గోరంటాకు పండగలు చేస్తూ , మనవళ్ళ తో గాలిపటాలెగరేస్తూ, కథలు చెపుతూ వాళ్ళేమి చెప్పినా తనకేమీ తెలీదు అన్నట్లుగా వింటూ సంబరపడి పోతున్న జానకి తో
"జానకీ ,పిల్లలతో అంతలా అనుబంధం పెంచుకోకు."అని హెచ్చరించాడు రామయ్య .
"అయ్యో అదేమిటండి ? వాళ్ళు నా పిల్లలు."విలవిల్లాడింది జానకి.
"కాని వాళ్ళు నీ పిల్లల పిల్లలు. వీళ్ళమీద అంత ఆశలు పెంచుకోవటము మంచిదికాదు."అన్నాడు.
"మరి మీరూ ,ఇంటి కి ఎవరైనా రావటము ఆలశ్యం మీ మనవడి తో లాప్ టాప్ తెప్పించి వాడి ప్రావీణ్యం చూపించి ,బోర్ కొట్టిస్తారు. మనవరాలి గొప్పలు చెపుతారు ."మూతి ముడిచింది జానకి.
"నిజమే ! కాని నేను వాళ్ళే లొకముగా లేను. మన హద్దుల్లో మనం వుండాలి."
అలవోకగా చిరునవ్వు నవ్వేసి,తనకిష్టమైన రాధామాధవం,మధుమాలతి,పారిజాతం, గులాబీ, మల్లెల తీగలతో, పిల్లల ఆటపాటలు , ముద్దుమురిపాలతో పచ్చగా అల్లుకున్న తన గూటిని మురిపెంగా చూసుకుంది జానకి.

https://www.youtube.com/watch?v=IYx3V3REHbY


Monday, September 7, 2009

సీమంతం

సీమంతం

జీవనతరంగాలు - 10
హాయిహాయిగా సాగిపోతున్న కొత్తబంగారులోకం లోకి కొత్త మెంబర్ నేనున్నానంటూ వచ్చేస్తొంది .కొత్తన్ మెంబర్ రాకకు సంతోష్పడిపోతూ , ఆనందంగా ఆహ్వానిస్తూనే ,ఏడవ నెలలోనే నిండుగా ,భారంగా , నడుస్తున్న జానకి ని చూస్తే రాముడి మనసు రెప రెప లాడి పోతోంది.జానకి ని జాలిగా చూస్తున్నాడు. అందుకే అంటారు అపురూపమైనది ఆడజన్మ ,ఇంకో ప్రాణిని సృష్టించటానికి తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ మాతృదేవత గా మారుతుంది అని.ఆమెకు ఏ కష్టం కలుగకుండా ఉల్లాసంగా ఉంచుతూ ,తన శాయశక్తులా సంతోష పెడుతున్నాడు. చిన్నిపాపాయిలా లా కాలు కదపనీకుండా గారాబం చేస్తున్నాడు.
అమ్మ నాన్నా ,అన్నా, వదినా వచ్చి సీమంతం చేసి ,తీసుకెళుతామనగానే బిక్క మొహం వేసిన భర్తనుచూసి పక్కుమంది జానకి.అమ్మను ఒప్పించి,అమ్మనే తన దగ్గర వుంచుకుంది.

జో లాలీ లాలీ

https://www.youtube.com/watch?v=wElquKDDCWg&feature=emb_title

https://kammatikala.blogspot.com/2009/09/seemantam.html


Saturday, September 5, 2009

కొత్తబంగారులోకం

కొత్తబంగారులోకం 

జీవనతరంగాలు-9

అడుగులో అడుగులేస్తూ తనవెంట వచ్చిన జానకి మోములోని అమాయకత్వము , ముగ్ధత్వమూ , జానకి సౌశీల్యమూ చూసి మురిపోయాడు రామయ్య. జానకి చేతిని అందుకొని కొత్తబంగారులోకం లోకి నడిపించాడు.తన జీవితం లోకి వివాహబంధం తో ప్రవేశించి,భర్తగా,హితుడిగా,సోదరుడిగా,తండ్రిగా తనను అన్నివిధాల చూసుకుంటున్న రామ్మయ్య అంటే జానకికి ఎనలేని ప్రేమ ,గౌరవం.ఆఫీస్ నుంచి రావటం ఒక్క క్షణం ఆలశ్యమైనా గాభరా పడిపోతూ ఎదురుచూస్తూవుంటుంది.మురిపాలూ ముచ్చట్లూ ,చిరుచిరు అలకలూ ,వచ్చిరాని వంటల ప్రయోగాలూ ,ఆనందాల తో కొత్త కాపురం ముద్దు ముద్దుగా సాగిపోతోంది.

https://kammatikala.blogspot.com/2009/09/blog-post_05.html
https://www.youtube.com/watch?v=ZXt-a_kK1qI











Wednesday, September 2, 2009

అత్తవారిల్లు


అత్తవారిల్లు

జీవనతరంగాలు - 8

రాముడి అడుగులో అడుగేస్తూ వస్తున్న జానకిని, ఆగు వదినా అంటూ ఆడపడుచులు ఆపారు. ఏమిటి అన్నట్లుగా కళ్ళెత్తి చూసింది జానకి.
"అలా వెళ్ళిపోదామనే అన్నయ్య పేరు చెప్పు"అన్నారు.సిగ్గులమొగ్గ ఐంది జానకి. చిన్నగా "రామారావు" అంది .
"ఏమిటీ వినపడలే "
"పోనీ నేను చెప్పనా ?"
"అబ్బో అప్పుడే పెళ్ళాన్ని వెవకేసుకొస్తున్నాడు .ఆగరా అబ్బాయ్ నీ పని తరువాత "పెద్ద మేనత్త ఆర్డర్.
సిగ్గు సిగ్గు గా "నేనూ ,మావారు రామారావు గారూ వచ్చాము తలుపు తీయండి "అంది జానకి.
"అప్పుడేనా ? ఆడపడుచు కట్నం ఏదీ ?"
అక్క చూడకుండా నాన్న ఇచ్చ్చిన 116 రూపాయలూ మంగళ హారతి పళ్ళెం లో వేసాడు రామారావు.
"నాలుగు తరాల ఆడపడుచులం వున్నాము అంతేనా ?"
"చాలులే అత్తయ్యా" అక్క మాట.
"ఎలా ? పసుపు దంపుడు పాటనుంచీ పాడుతున్నాను, అప్పగింతల పాటా పాడాను ,రేపు సత్యనారాయణ వ్రతం పాటా పాడాలి ,మరి నాకు పట్టుచీర లేదా ?"
ఇంకో 116 రుపాయలు అత్తయ్య పట్టు చీర కోసం ఇచ్చాడు.పుట్టింటి నుంచి పసుపుకుంకుమే చాలు ఆడపడుచులకు.పావలాకాసైనా పదివేలు.ఐనా తమ్ముడిని దబాయించటం అదో సరదా!
ఇక చాలు లెండర్రా అంటూ అత్తగారు జానకి బుజం చుట్టూ చేతులు వేసి ఆప్యాయం గా ఇంట్లో కి తీసుకెళ్ళారు.
అత్తగారి ఏడుగజాల పట్టుచీర కాస పోసి కట్టుకొని ,భర్తతో కలిసి వ్రతం చేసుకొని కాళ్ళకు దండం పెడుతున్న జానకి ని కళ్ళ నిండుగా తృప్తి గా చూసుకున్నారు అమ్మ ,నాన్న .
సీతమ్మా వచ్చింది అత్తింటికి
https://www.youtube.com/watch?v=33GNkLt3x1M&list=RD33GNkLt3x1M&start_radio=1&t=0

(https://kammatikala.blogspot.com/2009/09/blog-post.html)