Wednesday, June 29, 2011

మాంగల్య బలం



1958 లో అన్నపూర్ణా పిక్చర్స్ వారు నిర్మించిన కుటుంబ కథా చిత్రం " మాంగల్య బలం " . ఈ సినిమా నిర్మాత డి. మధుసూధనరావు . దర్శకత్వం వహించింది ఆదూర్తి . సుబ్బారావు . ఇందులో నాయిక నాయకులు గా ఏ. నాగేశ్వరరావు . సావిత్రి నటించారు . ఇంకా యస్. వి రంగారావు , సూర్యకాంతం , కన్నాంబ , రేలంగి , రాజసులోచన , రమణా రెడ్డి మొదలైన వారు నటించారు .

పాపారావు కు ఒక కొడుకు సూర్యం , కూతురు సరోజ . భార్య కాంతం మహా గయ్యాళిది . ఎప్పుడూ అత్తగారిని ఝాడించటమే పని . ఆమె నోటికి అంతా భయపడతారు . ఆడపడుచు సీత ఏమీ లేని పేదవాడిని ప్రేమించిపెళ్ళి చేసుకున్నదని ఆమె అంటే చులకన . ఏమైనా అంటే మీరూ మీరూ ఒకటి నేనేగా పరాయిదానిని అంటూవుంటుంది .

వూరి నుంచి పంతులు శిస్తు వసూలుచేసుకొని వస్తాడు . అతని ద్వారా సీతకు గుండెజబ్బు వచ్చిందని తెలుస్తుంది . ఆమె ను చూసేందుకు పార్వతమ్మ , సూర్య , సరోజలను వెంటపెట్టు కొని వూరు వెళుతుంది . అక్కడ చావు బతుకుల మద్య వున్న సీత కడసారి కోరిక తీర్చేందుకు సరోజకు , సీత కొడుకు చంద్రాని కి పెళ్ళి జరిపిస్తుంది . పెళ్ళి జరిగిన తరువాత వచ్చిన పాపారావు విషయము తెలుసుకొని తల్లిపై మండిపడి పిల్లలను తీసుకెళ్ళి పోతాడు . కాంతం జరిగిన సంగతి తెలుసుకొని సరోజ మెడలో నుంచి మాంగల్యం తెంపేస్తుంది . సూర్యం అది తీసి దాచిపెడతాడు . కాంతం కోర్టులో కేసువేసి వివాహ బంధం తెపేస్తుంది . జరిగింది తెలుసుకున్న పార్వతమ్మ పల్లెటూరిలోనే వుండిపోయి భరణం కోసం కొడుకు మీదా దావా వేసి , 10 ఎకరాలు పొందుతుంది .
చంద్రం కు పెళ్ళి సంబంధాలు చూడాలని తండ్రి అనుకున్నప్పుడు ,అమ్మమ్మ పార్వతమ్మ చిన్న తనములో సరోజ తో పెళ్ళైన సంగతి చెప్పి ఎలాగైనా సరోజ మనసు గెలుచుకొని మాంగల్య బంధాన్ని నిలపమని చెపుతుంది . చంద్రం తిరుపతి లో సరోజ ను కలుస్తాడు .ఆమె ప్రేమ నుపొందుతాడు . సరోజకు , తనకు చిన్న వయసులో పెళ్ళైన సంగతి అన్నయ్య ద్వారా తెలుస్తుంది . మాంగల్యాన్ని కాదనలేక , ప్రేమించిన వాడిని వదులుకోలేక విచారిస్తున్న సరోజకు పార్వతమ్మ ద్వారా ప్రేమించి శేఖరే తన భర్త చంద్రం అని తెలుస్తుంది . కొన్ని మలుపుల తరువాత సినిమా సుఖామంతమవుతుంది . అన్నీ సినిమాల్లో లాగే ఇందులోనూ యస్. వి . రంగారావు చివరలో సూర్యకాంతానికి గన్ చూపించి , మనమూ మనమూ ఒకటే అనిపిస్తాడు :)
పాటలన్నీ చాలా బాగున్నాయి . చిన్న పిల్లలు బొమ్మలపెళ్ళిలో పాడిన పాట " హాయిగా హాయిగా ఆలూమగలై కాలం గడపాలి " పాట , యాభై ఏళ్ళ క్రితమే కాదు ఈ కాలం లో నూ భార్యా భర్తలు ఇలాగా వుండాలి అని అనిపిస్తుంది .
" ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి ,
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి ,
శరీరాలు వేరే కాని మనసొకటై మసలాలి ,
సుఖ మైనా కష్టమైనా సగపాలుగా మెలగాలి . " ఇవి ఎంత నిజం .
" తెలియని ఆనందం నాలో విరిసినదీ వుదయం " పాటలో తిరుపతి అందాలు కనువిందు చేసాయి . నిజం తిరుపతి లో తెల్లవారుఝామున సుప్రభాత సేవకు వెళ్ళేటప్పుడు ఆ ప్రకృతి అలాగే వుంటుంది .
" ఆకాశ వీధిలో అందాల జాబిలి " పాటలో విజయావారి చందమామ తో పోటీపడ్డాడు . ఆ మేడ , ఆ జాబిల్లి ఎంత బాగున్నాయో !
" పెనుచీకటాయే లోకం " పాటలో మాంగల్యాన్ని కాదనలేక , ప్రేమించినవాడిని మరిచిపోలేక నలిగిపోయిన అమ్మాయిగా సావిత్రి హావభావాలు వర్ణిచలేనివి . అందుకే సావిత్రి ని "మహానటి" అన్నారు .
సినిమా పెళ్ళి విందు తో ముగుస్తుంది .
మనకు సినిమా విందు :-


































పాటల విందు :-




No comments: