Saturday, August 29, 2009

పూలరధం

పూలరధం

జీవనతరంగాలు - 7

కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అమ్మ దొంగా నిను చూడకుంటే, నాకు బెంగా అనుకుంటూ జానకి చిన్నప్పటి ముచ్చటలు తలుచుకుంటూ జానకి కి వడిబియ్యం కడుతోంది అమ్మ.బామ్మ , అమ్మమ్మ,అత్త, పిన్ని అందరూ "జానకి కి అత్తవారింట్లో ఎలా మెలగాలో చెబుతున్నారు.ఇంతలో బాబాయ్ వడి వడి గా వచ్చేసి ,అమ్మాయ్ జానకి అత్తవారింట్లో జాగ్రత్తగా వుండమ్మా ,ఎవరేమన్ననూ ఎదురాడబోకు,మగడేమన్ననూ మారాడబోకూ" అని చెప్పటము మొదలు పెట్టగానే అందరూ పక్కున నవ్వి మీకూ తెలుసా ఇవన్నీ అంటూ వేళాకోళాలు మొదలు పెట్టారు. భారం గా వున్న వతావరణం కొంచం తేలికైంది.
వధూవరులను ఎదురెదుగా కూర్చోబెట్టి దంపత తాంబూలాలు ఇప్పించారు.ఆడపడుచు అన్న కండువాలో వసంతం వేసి,ఓ చెక్కబొమ్మను పెట్టి, అన్నవాదినల వడిలో వసంతం పడేట్టుగా కాసేపు ఉయ్యాలలా ఊపి సందడి చేసింది.ఆ తరువత అసలైన ఘట్టం మనసు భారంగా మొదలైంది.
పాలలో చేతులు ముంచి అల్లుడికి అత్త మామలకు ,ఆడపడుచులకూ పేరు పేరు నా అందరికీ అప్పగించారు అమ్మా నాన్న.
అమ్మ పెట్టిన పెరుగన్నం తిని బయిలుదేరుతున్న జానకి కి చాటుగా అమ్మమ్మ 10 రుపాయలిచ్చింది.ఎందుకమ్ముమ్మా అంటే "పిచ్చి తల్లీ వుండనీయమ్మా ,అమ్మ కి కార్డ్ ముక్క రాయాలన్న ,నువ్వు చటాకు పూలు కొనాలన్నా వుంటాయి"అంది ఆప్యాయం గా .అమ్మ్ముమ్మ సరదా అని తీసుకొని అమ్మకు అందరు పెద్దల కాళ్ళకు దండం పెట్టి,సెలవు తీసుకొని,భారమైన మనసుతో కళ్ళనీళ్ళ ను కనిపించనీయకుండా అమ్మా ,నాన్నా ,పుట్టింటి ఆత్మీయులను వదిలి పతి చేయి అందుకొని పూల రధం లా అలంకరించిన పడవంత కారు లో అత్తింటికి బయిలుదేరింది జానకి.

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_29.html

https://www.youtube.com/watch?time_continue=2&v=qGRjGvW0AdM&feature=emb_title









Friday, August 28, 2009

కళ్యాణం కమనీయం

కళ్యాణం కమనీయం
జీవన తరంగాలు -6
వివాహ నిర్ణయం కాగానే ఇల్లంతా సందడి సందడి.బామ్మ ఆధ్వర్యం లో అప్పడాలు వత్తించటం,వడియాలు పెట్టించటం,పిండివంటలు చేయటం చకచకా జరిగిపోతుంటే,ఇంకో పక్క షాపింగ్ పనులు.అత్తయ్య వారం ముందు నుంచే మేనకోడలు నలుగుపెట్టి స్నానం చేయిస్తోంది.అవును మరి పెళ్ళికూతురు కళకళలాడాలిగా.అత్త స్నానం చేయించేలోపల పిన్ని అన్నం కంచంలో కలుపుకొచ్చి ముద్దలు చేసి తినిపిస్తోంది పెళ్ళికూతురు..ఆ పైన హాయిగా పాటలు వింటూ నేస్తాలతో కబుర్లు చెప్పుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది.మస్తాను కోసుకొచ్చి కాచువేసి రుబ్బిన గోరంటాకు చక్కని డిజైన్లతో చేతికి, కాళ్ళకు పారాణిలా పెట్టారు.అరచేతులు గోరంటాకు సువాసనతో ఎర్రగా పండి ఎంత ముద్దొస్తున్నాయో.
పెళ్ళిరోజు రానే వచ్చింది.ఆజాంబాహుడు అందాల రామయ్య బంధు మితృలతో తరలి వచ్చాడు.
ఆకాశమంత పందిరి వేసి ,భూదేవంత పీఠం వేసి రంగ రంగ వైభోగంగా జానకీ ,రామారావుల కళ్యాణం జరిపించారు నాన్న.
విందు భోజనం లో అప్పడాలు లేవు ఇదిఏమి విందు భొజనం అని పాటెత్తుకుంది, వరుడి మేనత్త.అయ్యో వేయటము మర్చిపోయినట్లున్నాము అంటూ హడావిడిగా అప్పడాలేసింది వధువు పిన్ని.అప్పడాలే మరిచారు, అమ్మాయినంపటమూ మరుస్తారేమో మరో పాట వచ్చేసింది.వధూవరులు బంతిభోజనం చేస్తుంటే తాతయ్య వచ్చి మురిపెంగా చూసుకున్నారు.పాటల సరదాల మధ్య విందు తరువాత, సిగ్గూ పూబంతీ విసిరే సీతా మాలక్ష్మీ అని పాటలు పాడుతూ బంతులాటలాడించారు.ఆటపాటల తో నునుసిగ్గుల జానకి కళ్యాణము కమనీయం గా జరిగింది.
సీతారాముల కళ్యాణము చూతము రారండీ.

https://www.youtube.com/watch?v=EO3JWdSL1mk

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_28.html

Thursday, August 27, 2009

పుత్తడి బొమ్మ

పుత్తడి బొమ్మ

జీవనతరంగాలు -5

"అత్తయ్యా !"

"ఏమిటమ్మాయ్ ?"

"ఈ రోజు జానకిని చూసుకోవటానికి పెళ్ళివారొస్తామని కబురు చేసారు.ఎట్లా జరుగుతుందో  ఏమిటో అత్తయ్యా ! నాకు గాభరాగా వుంది."

"గాభరా ఎందుకే ?  నీకు గాభరా అయితే ,పెద్దవాళ్ళం నేనూ మీ మామగారు ఏర్పాట్లు చూసుకుంటాములే .పెళ్ళిచూపులు ప్రతి అమ్మాయికీ తప్పవు.పెళ్ళివారు రావటం,వారికి ఏర్పాట్లు చూడటం అమ్మానాన్నల కు తప్పవు.అదీ ఒక వేడుకలా మలుచుకోవాలి. అమ్మాయికి ఒక అపురూపంగా నిలిచిపోవాలి.పరవాలేదు అంతా సవ్యంగా నే జరుగుతుందిలే భయపడకు.మన పుత్తడిబొమ్మను కాదనేదెవరు? ఫొటో చూసాముగా కోదండరామయ్య లా ఉన్నాడు."
కోదండరాముడంట అమ్మలారా బామ్మ కూనిరాగాలు విన్న జానకి బుగ్గల్లో గులాబీలు పూసాయి.మనసు ఎటో వెళ్ళిపోయింది.

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_27.html

https://www.youtube.com/watch?v=90wq0bfhIzg&list=RD90wq0bfhIzg&start_radio=1&t=108