Showing posts with label జీవనతరంగాలు. Show all posts
Showing posts with label జీవనతరంగాలు. Show all posts

Monday, October 5, 2009

మంగళ హారతి గొను రామా

నీలవర్ణ శ్రీరామ నిను వర్ణించతరమా
నిత్య మంగళ హారతి గొను రామా శ్రీ రామా
1. ముని యాగమును గాచి రాతిని నాతిగ చేసి -2
జానకీని పెళ్ళాడి జయముగొను రామ జయము గొను - నీల -
2. వైకుంఠమందు నీవు వటపత్రసాయివై -2
వరలక్ష్మి తో గూడి జయము గొను రామా జయము గొను -నీల -
3.బాలికలందరము గూడి పచ్చాల హారతి -2
మురళి కృష్ణ గొను ముత్యాల హారతి
ఇదే రామ హారతి ఇదే

జీవితం ఏమిటి ?????

జీవితం ఏమిటి ?????
జీవనతరంగాలు-13

పాపాయి గా అమ్మ నాన్నల ముద్దుమురిపాలనందుకొని, చదువుల తల్లిగా తీర్చిద్దిదుకొని , పదవారువన్నెల ప్రాయాన్ని సంతరించుకొని , పుత్తడి బొమ్మగా రూపు దిద్దుకొని , కళ్యాణ జానకిగా పూలరధం లో అత్తవారింట అడుగిడి, కొత్తబంగారు లోకం లో విహరించి, గాజులందుకొని, పచ్చని సంసారం గా వర్ధిల్లుతూ,కదిలేకాలమా కాసేపు ఆగవమ్మా అని వేడుకుంటూ అబ్బా. . .   జీవితం ఎన్ని మలుపులు తిరిగింది! ఎన్నెన్ని అనుభవాలు అనుభవాలు,ఎన్నెన్ని అనుభూతులు,ఎన్ని బంధాలూ,ఎన్నెన్ని అనుబంధాలు !నిద్రపట్టని జానకి అనుభూతులను కలబోసుకుంటూ,వివాహబంధంతో తనతో పెనవేసుకొని,భర్తగానే కాకుండా,తండ్రిలా,సోదరుడిలా,హితుడిలా,స్నేహితుడిలా అన్నివిధాల తనకు తోడూనీడై నిలిచిన,గాడ నిద్రలో ఉన్న విభుడిని మురిపెంగా చూసుకుంది.
ఉపచారాలే చేసానో ? అపచారాలే చేసానో ?
ప్రభూ ! ఇక అలసి పోయాను , మీ చల్లని వొడిలో సేద తీరనీయండి అనుకుంటూ రామయ్య మీద చేయి వేసింది జానకి.చల్లగా తగిలిన రామయ్య ను చూసి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది.ఇదేమిటీ అనుకుంటూ ఏమండీ ఏమండీ అని గాభరగా పిలిచింది.చలనం లేని రామయ్యను చూస్తూ నిస్తేజంగా కూర్చుండిపోయింది.
ఎవరొచ్చారో ,ఎవరెళ్ళారో,ఏమి జరుగుతోందో ,పిల్లలతో కలిసి అమెరికా ఎట్లా వెళ్ళిందో ఏమీ తెలియటం లేదు.ఎక్కడ ఎన్నిరోజులున్నా తన గూటికి చేరుకోవాలిగా!చిన్నగా మెట్లెక్కి వచ్చి,నీళ్ళు నిండిన కళ్ళతో
రెక్కలు తెగిపోయి, చెదిరిపోయిన గూడు,
వానలకు వాలిపోయిన రాధామాధవం,
తడిసి ముడుచుకున్న మామిడి,
ఆకులు నల్లబడ్డ నాగిని
ముందే ఎండలకు మోడైన తెల్ల సంపెంగి
వచ్చావా అని దీనంగా చూసాయి.
హడావిడిగా కరెంట్ తీగ మీద వంటరిగా
పరుగులు పెడుతున్న ఉడత ఒక్క నిమిషం ఆగి
నువ్వూ నాలాగే తోడు కోల్పోయావా అని విచారంగా అంది.
ఎంతసేపు బయట నిలబడతావు
లోపలికి రా అని జాలిగా స్వాగతించింది
శూన్యమైన గూడు.
ఇదేనా జీవితం? ఈ జీవనతరంగాలలో ఈ బంధాలూ ,అనుబంధాలూ ఎంతవరకు ?

https://www.youtube.com/watch?v=PCyj0NmU9hA

Wednesday, September 23, 2009

కదిలేకాలమా!

జీవనతరంగాలు-12

"ఏమిటీ జానకీ?పొద్దూనే ఎవరిమీదో గొణుగుతున్నావు పనిమనిషి రానన్నదా ఏమీటీ?" పిల్లల ఫోటోలను తుడుస్తూ తనలో తాను గొణుక్కుంటున్న జానకిని అడిగాడు రామయ్య.
"పనిమనిషి వస్తే ఎంతా రాకపోతే ఎంత ?ఒక్కపూట పని చేసుకోలేనా ఏమిటి?ఐనా ఎప్పుడూ పనిమనిషి గోలేనా ?"అంది విసురుగా జానకి.
"ఐతే ఎవరిని?నన్నైతే కాదుకదా?" కాస్త భయపడుతున్నట్లు నటిస్తూ జోక్ గా అన్నాడు రామయ్య.
"హుం నన్ను చూస్తే మీకు జోక్ గానే ఉంటుంది.కాలం చూడండి అంత కొంపలు మునిగిపోతున్నట్లు హడావిడిగా పరిగెత్తటం ఎందుకుట? నిదానంగా వెళితే ఏమవుతుంది? ఈ బుజ్జిగాడు చూడండి అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడో!వాడి కొడుకు కాలేజ్ లో చేరాలిట.ఇందాక  ఫొన్ చేసినప్పుడు వాషింగ్ టన్ వెళ్ళి కాలేజ్ చూసొచ్చామమ్మా అన్నాడు"అంది కొడుకు చిన్నప్పటి ఫొటోని చూస్తూ.
"బాగుంది నీ బుజ్జిగాడెప్పటికీ బుజ్జిగాడుగానే, నా బంగారం ఎప్పటికీ గుడియాగానే ఉండిపోతారా? కాలం పరిగెత్తక నీకోసం ఎట్లా ఆగుతుంది?ఆగుతే నీ మునిమాణిక్యాలు ఎట్లా వచ్చేవారు?"నవ్వాడు రామయ్య.
"ఏమో నండి పిల్లలంతా ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు.ఇల్లంతా ఎంత శూన్యం గా ఉంది చూడండి.ఇలా ఉంటే అమెరికావాళ్ళు"ఎంప్టీ నెస్ట్"అంటారుట."
"బాగుంది వ్యవహారం.రెక్కలు వచ్చిన పిట్టలు ఎగిరిపోకుండా ఉంటాయా?ఎంప్టీ నెస్ట్ అని ఎందుకనుకుంటావు? నీకు నేను నాకు నువ్వు మలివయసులో ఒకరికొకరం.ఇన్ని రోజులూ బాద్యతల్లో ఉన్నాము.ఇప్పుడు భాద్యతలు తీరి, నేను రిటైర్ అయ్యి ఫ్రీగా ఉన్నాము.పద హాయిగా ఏ గోవానో సింగపూర్ నో తిరిగొద్దాము.చాయిస్ ఈజ్ యువర్స్ .చీరప్ బేబీ."ఉషారు గా అన్నాడు.
"అంతొద్దులెండి.నా కోరిక ఒకటి ఉంది తీర్చండి చాలు."అంది జానకి.
"అడుగు మేడం. ఇంతవరకు ఎప్పుడూ ఏది అడగని నువ్వు అడుగుతున్నావు.నీ ఇష్టం ఏదైనా ఇచేస్తాను. ఐ ఆం ఆల్ వేస్ ఎట్ యువర్ సర్వీస్ "అభయమిచ్చాడు.

https://www.youtube.com/watch?v=BCzplttGVEU

Friday, September 11, 2009

పచ్చని సంసారం



జీవనతరంగాలు -11

కొమ్మ కొమ్మ కో సన్నాయి ,కోటిరాగాలు పలికాయి . పచ్చని చెట్టు విరగ కాసి ,పండిన పచ్చ పచ్చని పనసతొనల్లా , మాణిక్యాలాంటి ,ముచ్చటైన పాప ,బాబు .రామయ్య కు గారాలపట్టి స్వాతైతే, జానకమ్మ ముద్దుల కొడుకు నేతాజీ. ప్రేమానురాగాలతో అల్లుకున్న చక్కని పొదరిల్లు.
కాలం కమ్మగా కరిగిపోతోంది.

జీవన తరంగాల పై ఆహ్లాదముగా సాగిపోతున్న జానకి బంగరు నావలోకి రామయ్య పాదము మోపటము తో మొదలయ్యి ఒకరొకరుగా కూతురు ,కొడుకు , అల్లుడు , కోడలు , మనవళ్ళు , మనవరాళ్ళూ వచ్చి చేరారు. చిన్న మనవడి రాక తో తన మెడ లో నవరతనాల మాల వేసుకున్నంతగా సంతోష పడింది జానకి. మనవరాళ్ళకి , ఆషాడ మాసములో చుట్టుపక్కల పిల్లలని పిలిచి గోరంటాకు పండగలు చేస్తూ , మనవళ్ళ తో గాలిపటాలెగరేస్తూ, కథలు చెపుతూ వాళ్ళేమి చెప్పినా తనకేమీ తెలీదు అన్నట్లుగా వింటూ సంబరపడి పోతున్న జానకి తో
"జానకీ ,పిల్లలతో అంతలా అనుబంధం పెంచుకోకు."అని హెచ్చరించాడు రామయ్య .
"అయ్యో అదేమిటండి ? వాళ్ళు నా పిల్లలు."విలవిల్లాడింది జానకి.
"కాని వాళ్ళు నీ పిల్లల పిల్లలు. వీళ్ళమీద అంత ఆశలు పెంచుకోవటము మంచిదికాదు."అన్నాడు.
"మరి మీరూ ,ఇంటి కి ఎవరైనా రావటము ఆలశ్యం మీ మనవడి తో లాప్ టాప్ తెప్పించి వాడి ప్రావీణ్యం చూపించి ,బోర్ కొట్టిస్తారు. మనవరాలి గొప్పలు చెపుతారు ."మూతి ముడిచింది జానకి.
"నిజమే ! కాని నేను వాళ్ళే లొకముగా లేను. మన హద్దుల్లో మనం వుండాలి."
అలవోకగా చిరునవ్వు నవ్వేసి,తనకిష్టమైన రాధామాధవం,మధుమాలతి,పారిజాతం, గులాబీ, మల్లెల తీగలతో, పిల్లల ఆటపాటలు , ముద్దుమురిపాలతో పచ్చగా అల్లుకున్న తన గూటిని మురిపెంగా చూసుకుంది జానకి.

https://www.youtube.com/watch?v=IYx3V3REHbY


Monday, September 7, 2009

సీమంతం

సీమంతం

జీవనతరంగాలు - 10
హాయిహాయిగా సాగిపోతున్న కొత్తబంగారులోకం లోకి కొత్త మెంబర్ నేనున్నానంటూ వచ్చేస్తొంది .కొత్తన్ మెంబర్ రాకకు సంతోష్పడిపోతూ , ఆనందంగా ఆహ్వానిస్తూనే ,ఏడవ నెలలోనే నిండుగా ,భారంగా , నడుస్తున్న జానకి ని చూస్తే రాముడి మనసు రెప రెప లాడి పోతోంది.జానకి ని జాలిగా చూస్తున్నాడు. అందుకే అంటారు అపురూపమైనది ఆడజన్మ ,ఇంకో ప్రాణిని సృష్టించటానికి తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ మాతృదేవత గా మారుతుంది అని.ఆమెకు ఏ కష్టం కలుగకుండా ఉల్లాసంగా ఉంచుతూ ,తన శాయశక్తులా సంతోష పెడుతున్నాడు. చిన్నిపాపాయిలా లా కాలు కదపనీకుండా గారాబం చేస్తున్నాడు.
అమ్మ నాన్నా ,అన్నా, వదినా వచ్చి సీమంతం చేసి ,తీసుకెళుతామనగానే బిక్క మొహం వేసిన భర్తనుచూసి పక్కుమంది జానకి.అమ్మను ఒప్పించి,అమ్మనే తన దగ్గర వుంచుకుంది.

జో లాలీ లాలీ

https://www.youtube.com/watch?v=wElquKDDCWg&feature=emb_title

https://kammatikala.blogspot.com/2009/09/seemantam.html


Saturday, September 5, 2009

కొత్తబంగారులోకం

కొత్తబంగారులోకం 

జీవనతరంగాలు-9

అడుగులో అడుగులేస్తూ తనవెంట వచ్చిన జానకి మోములోని అమాయకత్వము , ముగ్ధత్వమూ , జానకి సౌశీల్యమూ చూసి మురిపోయాడు రామయ్య. జానకి చేతిని అందుకొని కొత్తబంగారులోకం లోకి నడిపించాడు.తన జీవితం లోకి వివాహబంధం తో ప్రవేశించి,భర్తగా,హితుడిగా,సోదరుడిగా,తండ్రిగా తనను అన్నివిధాల చూసుకుంటున్న రామ్మయ్య అంటే జానకికి ఎనలేని ప్రేమ ,గౌరవం.ఆఫీస్ నుంచి రావటం ఒక్క క్షణం ఆలశ్యమైనా గాభరా పడిపోతూ ఎదురుచూస్తూవుంటుంది.మురిపాలూ ముచ్చట్లూ ,చిరుచిరు అలకలూ ,వచ్చిరాని వంటల ప్రయోగాలూ ,ఆనందాల తో కొత్త కాపురం ముద్దు ముద్దుగా సాగిపోతోంది.

https://kammatikala.blogspot.com/2009/09/blog-post_05.html
https://www.youtube.com/watch?v=ZXt-a_kK1qI











Wednesday, September 2, 2009

అత్తవారిల్లు


అత్తవారిల్లు

జీవనతరంగాలు - 8

రాముడి అడుగులో అడుగేస్తూ వస్తున్న జానకిని, ఆగు వదినా అంటూ ఆడపడుచులు ఆపారు. ఏమిటి అన్నట్లుగా కళ్ళెత్తి చూసింది జానకి.
"అలా వెళ్ళిపోదామనే అన్నయ్య పేరు చెప్పు"అన్నారు.సిగ్గులమొగ్గ ఐంది జానకి. చిన్నగా "రామారావు" అంది .
"ఏమిటీ వినపడలే "
"పోనీ నేను చెప్పనా ?"
"అబ్బో అప్పుడే పెళ్ళాన్ని వెవకేసుకొస్తున్నాడు .ఆగరా అబ్బాయ్ నీ పని తరువాత "పెద్ద మేనత్త ఆర్డర్.
సిగ్గు సిగ్గు గా "నేనూ ,మావారు రామారావు గారూ వచ్చాము తలుపు తీయండి "అంది జానకి.
"అప్పుడేనా ? ఆడపడుచు కట్నం ఏదీ ?"
అక్క చూడకుండా నాన్న ఇచ్చ్చిన 116 రూపాయలూ మంగళ హారతి పళ్ళెం లో వేసాడు రామారావు.
"నాలుగు తరాల ఆడపడుచులం వున్నాము అంతేనా ?"
"చాలులే అత్తయ్యా" అక్క మాట.
"ఎలా ? పసుపు దంపుడు పాటనుంచీ పాడుతున్నాను, అప్పగింతల పాటా పాడాను ,రేపు సత్యనారాయణ వ్రతం పాటా పాడాలి ,మరి నాకు పట్టుచీర లేదా ?"
ఇంకో 116 రుపాయలు అత్తయ్య పట్టు చీర కోసం ఇచ్చాడు.పుట్టింటి నుంచి పసుపుకుంకుమే చాలు ఆడపడుచులకు.పావలాకాసైనా పదివేలు.ఐనా తమ్ముడిని దబాయించటం అదో సరదా!
ఇక చాలు లెండర్రా అంటూ అత్తగారు జానకి బుజం చుట్టూ చేతులు వేసి ఆప్యాయం గా ఇంట్లో కి తీసుకెళ్ళారు.
అత్తగారి ఏడుగజాల పట్టుచీర కాస పోసి కట్టుకొని ,భర్తతో కలిసి వ్రతం చేసుకొని కాళ్ళకు దండం పెడుతున్న జానకి ని కళ్ళ నిండుగా తృప్తి గా చూసుకున్నారు అమ్మ ,నాన్న .
సీతమ్మా వచ్చింది అత్తింటికి
https://www.youtube.com/watch?v=33GNkLt3x1M&list=RD33GNkLt3x1M&start_radio=1&t=0

(https://kammatikala.blogspot.com/2009/09/blog-post.html)


Saturday, August 29, 2009

పూలరధం

పూలరధం

జీవనతరంగాలు - 7

కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అమ్మ దొంగా నిను చూడకుంటే, నాకు బెంగా అనుకుంటూ జానకి చిన్నప్పటి ముచ్చటలు తలుచుకుంటూ జానకి కి వడిబియ్యం కడుతోంది అమ్మ.బామ్మ , అమ్మమ్మ,అత్త, పిన్ని అందరూ "జానకి కి అత్తవారింట్లో ఎలా మెలగాలో చెబుతున్నారు.ఇంతలో బాబాయ్ వడి వడి గా వచ్చేసి ,అమ్మాయ్ జానకి అత్తవారింట్లో జాగ్రత్తగా వుండమ్మా ,ఎవరేమన్ననూ ఎదురాడబోకు,మగడేమన్ననూ మారాడబోకూ" అని చెప్పటము మొదలు పెట్టగానే అందరూ పక్కున నవ్వి మీకూ తెలుసా ఇవన్నీ అంటూ వేళాకోళాలు మొదలు పెట్టారు. భారం గా వున్న వతావరణం కొంచం తేలికైంది.
వధూవరులను ఎదురెదుగా కూర్చోబెట్టి దంపత తాంబూలాలు ఇప్పించారు.ఆడపడుచు అన్న కండువాలో వసంతం వేసి,ఓ చెక్కబొమ్మను పెట్టి, అన్నవాదినల వడిలో వసంతం పడేట్టుగా కాసేపు ఉయ్యాలలా ఊపి సందడి చేసింది.ఆ తరువత అసలైన ఘట్టం మనసు భారంగా మొదలైంది.
పాలలో చేతులు ముంచి అల్లుడికి అత్త మామలకు ,ఆడపడుచులకూ పేరు పేరు నా అందరికీ అప్పగించారు అమ్మా నాన్న.
అమ్మ పెట్టిన పెరుగన్నం తిని బయిలుదేరుతున్న జానకి కి చాటుగా అమ్మమ్మ 10 రుపాయలిచ్చింది.ఎందుకమ్ముమ్మా అంటే "పిచ్చి తల్లీ వుండనీయమ్మా ,అమ్మ కి కార్డ్ ముక్క రాయాలన్న ,నువ్వు చటాకు పూలు కొనాలన్నా వుంటాయి"అంది ఆప్యాయం గా .అమ్మ్ముమ్మ సరదా అని తీసుకొని అమ్మకు అందరు పెద్దల కాళ్ళకు దండం పెట్టి,సెలవు తీసుకొని,భారమైన మనసుతో కళ్ళనీళ్ళ ను కనిపించనీయకుండా అమ్మా ,నాన్నా ,పుట్టింటి ఆత్మీయులను వదిలి పతి చేయి అందుకొని పూల రధం లా అలంకరించిన పడవంత కారు లో అత్తింటికి బయిలుదేరింది జానకి.

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_29.html

https://www.youtube.com/watch?time_continue=2&v=qGRjGvW0AdM&feature=emb_title









Friday, August 28, 2009

కళ్యాణం కమనీయం

కళ్యాణం కమనీయం
జీవన తరంగాలు -6
వివాహ నిర్ణయం కాగానే ఇల్లంతా సందడి సందడి.బామ్మ ఆధ్వర్యం లో అప్పడాలు వత్తించటం,వడియాలు పెట్టించటం,పిండివంటలు చేయటం చకచకా జరిగిపోతుంటే,ఇంకో పక్క షాపింగ్ పనులు.అత్తయ్య వారం ముందు నుంచే మేనకోడలు నలుగుపెట్టి స్నానం చేయిస్తోంది.అవును మరి పెళ్ళికూతురు కళకళలాడాలిగా.అత్త స్నానం చేయించేలోపల పిన్ని అన్నం కంచంలో కలుపుకొచ్చి ముద్దలు చేసి తినిపిస్తోంది పెళ్ళికూతురు..ఆ పైన హాయిగా పాటలు వింటూ నేస్తాలతో కబుర్లు చెప్పుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది.మస్తాను కోసుకొచ్చి కాచువేసి రుబ్బిన గోరంటాకు చక్కని డిజైన్లతో చేతికి, కాళ్ళకు పారాణిలా పెట్టారు.అరచేతులు గోరంటాకు సువాసనతో ఎర్రగా పండి ఎంత ముద్దొస్తున్నాయో.
పెళ్ళిరోజు రానే వచ్చింది.ఆజాంబాహుడు అందాల రామయ్య బంధు మితృలతో తరలి వచ్చాడు.
ఆకాశమంత పందిరి వేసి ,భూదేవంత పీఠం వేసి రంగ రంగ వైభోగంగా జానకీ ,రామారావుల కళ్యాణం జరిపించారు నాన్న.
విందు భోజనం లో అప్పడాలు లేవు ఇదిఏమి విందు భొజనం అని పాటెత్తుకుంది, వరుడి మేనత్త.అయ్యో వేయటము మర్చిపోయినట్లున్నాము అంటూ హడావిడిగా అప్పడాలేసింది వధువు పిన్ని.అప్పడాలే మరిచారు, అమ్మాయినంపటమూ మరుస్తారేమో మరో పాట వచ్చేసింది.వధూవరులు బంతిభోజనం చేస్తుంటే తాతయ్య వచ్చి మురిపెంగా చూసుకున్నారు.పాటల సరదాల మధ్య విందు తరువాత, సిగ్గూ పూబంతీ విసిరే సీతా మాలక్ష్మీ అని పాటలు పాడుతూ బంతులాటలాడించారు.ఆటపాటల తో నునుసిగ్గుల జానకి కళ్యాణము కమనీయం గా జరిగింది.
సీతారాముల కళ్యాణము చూతము రారండీ.

https://www.youtube.com/watch?v=EO3JWdSL1mk

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_28.html

Thursday, August 27, 2009

పుత్తడి బొమ్మ

పుత్తడి బొమ్మ

జీవనతరంగాలు -5

"అత్తయ్యా !"

"ఏమిటమ్మాయ్ ?"

"ఈ రోజు జానకిని చూసుకోవటానికి పెళ్ళివారొస్తామని కబురు చేసారు.ఎట్లా జరుగుతుందో  ఏమిటో అత్తయ్యా ! నాకు గాభరాగా వుంది."

"గాభరా ఎందుకే ?  నీకు గాభరా అయితే ,పెద్దవాళ్ళం నేనూ మీ మామగారు ఏర్పాట్లు చూసుకుంటాములే .పెళ్ళిచూపులు ప్రతి అమ్మాయికీ తప్పవు.పెళ్ళివారు రావటం,వారికి ఏర్పాట్లు చూడటం అమ్మానాన్నల కు తప్పవు.అదీ ఒక వేడుకలా మలుచుకోవాలి. అమ్మాయికి ఒక అపురూపంగా నిలిచిపోవాలి.పరవాలేదు అంతా సవ్యంగా నే జరుగుతుందిలే భయపడకు.మన పుత్తడిబొమ్మను కాదనేదెవరు? ఫొటో చూసాముగా కోదండరామయ్య లా ఉన్నాడు."
కోదండరాముడంట అమ్మలారా బామ్మ కూనిరాగాలు విన్న జానకి బుగ్గల్లో గులాబీలు పూసాయి.మనసు ఎటో వెళ్ళిపోయింది.

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_27.html

https://www.youtube.com/watch?v=90wq0bfhIzg&list=RD90wq0bfhIzg&start_radio=1&t=108

Wednesday, August 26, 2009

ప్రాయం



జీవన తరంగాలు 3

జానకీ

ఈ రాధామాధవ పూల సువాసన ఎంత బాగుందో కదా !
అవును ,దానికి తగ్గట్టే ఈ కవిత చూడు ,
ఆకులో ఆకునై పూవులో పూవు నై
ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే నిలిచి పోనా
జీవితమంటే నెచ్చలి తో చక్కని కవితల కబురులు, రాధా మాధవపూవుల సువాసన, లోకమంతా మంచివారితో నే నిండివుందనే అమాయకత్వం , కన్నెప్రాయపు కళ్ళ లో కమ్మటి కలలు , మదిలో మధురభావాలూ అలా . . . అలా . . .

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ



ఏ దివిలో విరిసిన పారిజాతమో









అల్లి బిల్లి అమ్మాయికి

చదువుల తల్లి

చదువుల తల్లి

జీవనతరంగాలు -3

"వొరేయ్ అబ్బాయ్"
"ఏంటమ్మా ?"
"ఇంకా జానకి పెళ్ళి ఎప్పుడు చేస్తావురా ?:
"అప్పుడే తొందరేమిటమ్మా ? చదువు కానీ ."
"అదేమైనా ఉద్యోగాలు చేయా లా ? ఊళ్ళేలా ? గుండెల మీద కుంపటి లా ఎన్ని రోజులుంచుతావు ?"
"అమ్మా ! ఆడపిల్లంటే గుండెలమీద కుంపటి అనే రోజులు మారుతున్నాయి. అమ్మాయి ఇంట్లో నే వుండే పరిస్తుతులు లేవు. అవసరమైతే ఉద్యొగము చేసి భర్త కు చేదోడు వాదోడుగా ఉండాలి. తనపిల్లలకు చదువు లో సాయం చేసి ఉన్నతులుగా తీర్చిదిద్దాలి.చదువు తో విజ్ఞానము పెరుగుతుంది. బయట ప్రపంచము ఎలా వుందో తెలుస్తుంది . మనము ఇచ్చే ఆస్తి పాస్తులు ఎవరైనా దోచుకు పోవచ్చు కాని మనము చదివించటము వలన కలిగే జ్ఞాన సంపదను ఎవరూ దోచుకోలేరు. డిగ్రీ అయ్యేవరకూ పెళ్ళి ప్రతిపాదన లేదు."
బామ్మ తో ఖరాఖండీ గా నాన్న చెప్పటం విని ఎంత మంచి నాన్న అని గౌరవంగా నాన్నను చూసుకుంది జానకి.నాన్న మాటను నిలబెట్టాలని జానకి శ్ర్ద్దగా చదివి కాలేజ్ టాపర్ గా నిలిచింది.చదువుతో పాటు కాలేజీ జీవితము లో ఎన్నెన్ని సరదాలూ,సంతోషాలు.

"తియ తీయని తేనేల మాటల తో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు.
తెలియని చీకటి తొలిగించి వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు.
దొంగల చేతికి దొరకనిదీ ,దానము చేసిన తరగనిది
పదుగురి లోనా పేరును నిలిపే పెన్నిదది."


https://www.youtube.com/watch?v=pmeiyk3OfPQ&feature=emb_title




Saturday, August 22, 2009

ముద్దు మురిపాలు



# జీవన తరంగాలు - 2 #


పాపాయి అందరికీ గారమే ! అత్త ,తాత, అమ్మమ్మ,బామ్మ అందరికీ ముద్దే . ముచ్చటైన పాపాయికి, సీతాదేవి అంత సౌజన్య మూర్తి ,వినయశీలి కావాలని నాన్న జానకి అని పిలుచుకున్నారు.

సన్నజాజీ పూవులూ చందమామ కాంతులు అందాలపాపా నవ్వులూ,
మా యింటి వెలుగు ,మా కంటి వెలుగు మా చిన్ని పాపా నవ్వులే !
తాతయ్య మీసాల ఉయ్యాల లూగేనూ,అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను.
అని అమ్మమ్మా ,తాతయ్య సంబరాలు పోతే,


బంగారు ప్రాయమిది పవళించవె తల్లి,
ఈ రోజు దాటితే నిదురేది మళ్ళీ అని పిన్ని సుద్దులు చెప్పింది.

అత్తవడి పూవువలే మెత్తనమ్మా అంటూ అత్త ముద్దు చేసింది.

పాపాయి కి అత్తమీద అంత ప్రేమే .ఈ బంధాలు అనుభంధాలే కదా మధురమైనవి

https://www.youtube.com/watch?v=GBwm8qEAZrs&list=RDGBwm8qEAZrs&start_radio=1&t=0



Friday, August 21, 2009

పాపాయి



ఉయ్యాలలో కళ్ళు ముసుకొని, రెండు చేతులు గుప్పిట్లు ముసుకొని ,గడ్డం కిందకు చేర్చి , ముద్దు ముద్దు గా నిద్దరోతున్న >పాపాయిని తదేకంగా ముచ్చట గా చూసుకుంటూ మురిసిపోతున్న నాన్న ని చూసి ,అమ్మ అంతగా చూడకండి పాపాయికి దిష్టి తగులుతుంది అంది.
నాన్న పట్టుబడ్డ దొంగలా సిగ్గును కప్పి పుచ్చుకుంటూ నాతల్లి కి నాదిష్టేమీ తగలదులే అయినా నువ్వు చూడకుండా నేను చూసేస్తున్నానని కుళ్ళుకుంటున్నావు కదూ ! మురిపంగా మూతి తిప్పింది అమ్మ .మరి మీరొక్కరే చూడక పోతే నాకూ చూపించొచ్చుగా !
పొత్తిళ్ళలో పాపాయిని చూసి అరే ఈ బుజ్జి కన్న నేనా ఇన్నిరోజులు నాబొజ్జలో వుంది ఆశ్చర్యపోయింది అమ్మ.