Friday, September 11, 2009

పచ్చని సంసారం



జీవనతరంగాలు -11

కొమ్మ కొమ్మ కో సన్నాయి ,కోటిరాగాలు పలికాయి . పచ్చని చెట్టు విరగ కాసి ,పండిన పచ్చ పచ్చని పనసతొనల్లా , మాణిక్యాలాంటి ,ముచ్చటైన పాప ,బాబు .రామయ్య కు గారాలపట్టి స్వాతైతే, జానకమ్మ ముద్దుల కొడుకు నేతాజీ. ప్రేమానురాగాలతో అల్లుకున్న చక్కని పొదరిల్లు.
కాలం కమ్మగా కరిగిపోతోంది.

జీవన తరంగాల పై ఆహ్లాదముగా సాగిపోతున్న జానకి బంగరు నావలోకి రామయ్య పాదము మోపటము తో మొదలయ్యి ఒకరొకరుగా కూతురు ,కొడుకు , అల్లుడు , కోడలు , మనవళ్ళు , మనవరాళ్ళూ వచ్చి చేరారు. చిన్న మనవడి రాక తో తన మెడ లో నవరతనాల మాల వేసుకున్నంతగా సంతోష పడింది జానకి. మనవరాళ్ళకి , ఆషాడ మాసములో చుట్టుపక్కల పిల్లలని పిలిచి గోరంటాకు పండగలు చేస్తూ , మనవళ్ళ తో గాలిపటాలెగరేస్తూ, కథలు చెపుతూ వాళ్ళేమి చెప్పినా తనకేమీ తెలీదు అన్నట్లుగా వింటూ సంబరపడి పోతున్న జానకి తో
"జానకీ ,పిల్లలతో అంతలా అనుబంధం పెంచుకోకు."అని హెచ్చరించాడు రామయ్య .
"అయ్యో అదేమిటండి ? వాళ్ళు నా పిల్లలు."విలవిల్లాడింది జానకి.
"కాని వాళ్ళు నీ పిల్లల పిల్లలు. వీళ్ళమీద అంత ఆశలు పెంచుకోవటము మంచిదికాదు."అన్నాడు.
"మరి మీరూ ,ఇంటి కి ఎవరైనా రావటము ఆలశ్యం మీ మనవడి తో లాప్ టాప్ తెప్పించి వాడి ప్రావీణ్యం చూపించి ,బోర్ కొట్టిస్తారు. మనవరాలి గొప్పలు చెపుతారు ."మూతి ముడిచింది జానకి.
"నిజమే ! కాని నేను వాళ్ళే లొకముగా లేను. మన హద్దుల్లో మనం వుండాలి."
అలవోకగా చిరునవ్వు నవ్వేసి,తనకిష్టమైన రాధామాధవం,మధుమాలతి,పారిజాతం, గులాబీ, మల్లెల తీగలతో, పిల్లల ఆటపాటలు , ముద్దుమురిపాలతో పచ్చగా అల్లుకున్న తన గూటిని మురిపెంగా చూసుకుంది జానకి.

https://www.youtube.com/watch?v=IYx3V3REHbY


4 comments:

మరువం ఉష said...

nice collection and compilation.

Anitha Velde said...

meeru raasina praasa chaala baagundi.

జయ said...

హాయమ్మ హాయి పాట చాలా రోజుల తరువాత విన్నాను. ఈ రచన పూర్తి అయినాక చక్కగా ప్రింట్ చేయిస్తే బాగుంటుందేమో ! చాలా బాగుంటోంది.

శ్రీలలిత said...

మాలాగారూ,

మీ పాటల సెలక్షన్ చాలా బాగుంది. ఎప్పటి పాటలో మంచి మంచివి మళ్ళీ గుర్తు చేసారు.