Saturday, July 23, 2011

సుడిగుండాలు

1967లో అన్నపూర్ణా పిక్చర్స్ వారు నిర్మించిన సినిమా " సుడిగుండాలు " . ఇది పిల్లల మనస్తత్వం మీద తీసిన సినిమా . జడ్జీ చంద్రశేఖర్ రావు ( ఏ. నాగేశ్వర రావు ) భార్య పురిటిలో బాబును ప్రసవించి చనిపోతుంది . బాబును చాలా గారాబంగా క్రమశిక్షణ తో పెంచుతుంటాడు చంద్రశేఖర రావు . చంద్రశేఖర రావు చాలా దయార్ధహృదయుడు . తన వలన శిక్ష పడిన వారి కుటుంబాలను ఆదుకుంటూ వుంటాడు . రాజా స్కూల్ లో స్వాతంత్ర్యదినోత్సవం రోజున నృత్య నాటిక వేస్తారు . అందులో రాజా మహాత్మా గాంధీ వేషం వేసి మొదటి బహుమతి గెలుచుకుంటాడు .

రాజా పుట్టిన రోజున స్కూల్ పిల్లలందరినీ పార్టీ కి పిలుస్తారు . పిల్లలంతా వస్తారుకాని రాజా రాలేదు . రాత్రంతా వెతుకుతారు దొరకడు . పోలీస్ రిపోర్ట్ ఇస్తారు . ఐనా దొరకలేదు . మరి రాజా ఏమైనట్లు ? పొద్దున్నే హాస్పిటల్ లో వున్న ఆక్సిడెంట్ ఐన పిల్లవాడి ని చూడమని చంద్రశేఖర్ ను పిలుస్తారు . అతను వెళ్ళి , మా రాజా కాకూడదు అనుకుంటూ చూస్తాడు . కాని అది రాజానే ! పైగా రాజా ది ఆక్సిడెంట్ కాదని ఎవరో హత్య చేసారని చెపుతాడు ఇన్స్ పెక్టర్ . రాజా పసివాడు . అంత పసివాడిని ఎవరు హత్య చేసారు ? ఎందుకు చేసారు ?
ఏమో ఇదో సినిమా పెడుతున్నాను చూసి తెలుసుకోండి .
ఈ సినిమా నిర్మాత డి. మధుసూధనరావు ,
డైరెక్టర్స్ : ఆదుర్తి సుబ్బారావు , కె విశ్వనాథ్ ,
మ్యూజిక్ ; కె వి . మహదేవన్ ,
గాయనీ గాయకులు ; ఘంటసాల , పి. సుశీల
ఈ సినిమా నంది అవార్డ్ కూడా గెలుచుకుంది . ఇంకో విశేషం , దీనిలో అక్కినేని నాగార్జున కూడా నటించాడు . ఎక్కడో సినిమా చూసి కనిపెట్టండి :

Tuesday, July 19, 2011

ఆత్మ గౌరవం




అన్నపూర్ణా వారు 1965 లో కె .విశ్వనాథ్ దర్శకత్వం లో నిర్మించిన చిత్రం " ఆత్మ గౌరవం " . అప్పటి వరకు అన్నపూర్ణా వారి సినిమాలలో అసిస్టెంట్ డైరక్టర్ గా కనిపంచిన కె.విశ్వనాథ్ పేరు ఈ సినిమాలో డైరెక్టర్ గా కనిపించింది .మరి ఆయన డరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇదేనేమో నాకు తెలియదు :)ఈ సినిమా నిర్మాత డి . మధుసూధన రావు . హీరో ఇంకెవరు ? నాగేశ్వర రావే ! హీరోయిన్ మటుకు కాంచన . ఇంకో హీరోయిన్ రాజశ్రీ . సరే రేలంగి , రమణారెడ్డి , సూర్యకాంతం , అల్లురామలింగయ్య వుండనే వున్నారు . అన్నట్లు చలం కూడా వున్నాడు . మ్య్యుజిక్ డైరెక్టర్ సాళ్ళూరి రాజేశ్వర రావు . పాడింది , ఘంటసాల , పి. సుశీల , వసంత .
కథ విషయానికోస్తే :- జమీందార్ గారికి పిల్లలు లేరు . అందుకని వారి సతీమణి సంతాన లక్ష్మి తన చెల్లెలి కొడుకు వేణు ను పెంచుకుందామనుకుంటుంది . కాని జమీందార్ గారికి ఇష్టం వుండదు . వూరిలోని పొలాలు చూసుకోవటానికి వెళ్ళిన జమీందారు గారికి , ఆ పొలం కౌలుదారు రామయ్య తమ్ముడు శ్రీనివాస రావు చురుకుదనం చూసి ముచ్చటపడి దత్తత తీసుకుంటాడు . వాసు కు తోడుగా వేణు ను కూడా తెచ్చుకుంటారు . ఇద్దరినీ పట్నం లో వుంచి చదివిస్తారు . అక్కడ భజగోవిందం ( జమీందారు గారి ఫ్రెండ్ ) ఆయన కూతురు గీతను , వాసు కు ఇచ్చి పెళ్ళి జరిపిద్దామనుకుంటాడు . దానికి జమీందరు , సంతాన లక్ష్మి కూడా ఇష్టపడుతారు . వాసు మేనకోడలు సావిత్రి ని వాసుకు ఇచ్చి పెళ్ళి జరిపించాలని రామయ్య , అతని తల్లి పిల్లల చిన్నప్పటి నుంచే అనుకుంటారు . ఆ మాట వాసు ను దత్తుకు ఇచ్చే ముందే చెపుతారు . కాని జమీందారు భార్య వత్తిడి వల్లనూ , వాసు గీత ను ప్రేమిస్తున్నాడని పొరబడటం వల్లనూ సావిత్రి ని కోడలిగా చేసుకునేందుకు ఇష్టపడడు . రామయ్య భార్య పురిటిలో పిల్ల తో సహా చనిపోతుంది . ఎలాగు వాసు పెళ్ళి జరిగిపోతోంది కాబట్టి సావిత్రి కి వేరే సంబంధం ఖాయపరిచి ,ఆ సంభంధం కుదరాలంటే వారి పిచ్చి అమ్మాయిని రామయ్య పెళ్ళి చేసుకోవాలని షరుతు మీద ఆ పిచ్చి పిల్లను పెళ్ళి చేసుకుంటాడు . కాని అతని త్యాగాన్ని వేస్ట్ చేస్తు సావిత్రి చచ్చిపోతున్నానని ఉత్తరం రాసిపెట్టి , ఇంట్లోనుంచి వెళ్ళిపోతుంది . హూం . . . ఆ తరువాత సావిత్రి , గీత కార్ కింద పడటం , గీత ఆమెను రక్షించి సేవాసదనం లో చేర్చటం , గీత ఇంట్లో సావిత్రి ని చూసిన వాసు ఆమెను ప్రేమించటం , గీత సరళను అదేనండి సావిత్రి ని అపార్ధం చేసుకోవటం , వాసుకు నిజం చెప్పటం , మాయ మాట ల తో సావిత్రి ని వాసు ఇంట్లో చేర్చటం , జమీందార్ అండ్ కో ఆమెను గీత అని పొరబడటం , పెళ్ళి ఏర్పాట్లు చేయటం , ఆపైన నిజం తెలుసుకొని సావిత్రి ఇంట్లో నుంచి వెళ్ళ గొట్టటం అబ్బో ఇంకా చాలా కథ జరుగుతుంది .

సినిమా లో పాటలు పరవాలేదు బాగానే వున్నాయి . నటీ నటులూ బాగానే వున్నారు . కాని . . . . కథే మరీ . . . సాగతీతగా అనిపించింది . ఎంతసేపటికీ అవదు :) సావిత్రి రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం , సంతానలక్ష్మి చివరలో ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం పాపం . . . ప్రేక్షకుల అదృష్టం వల్ల వాళ్ళు బతికిపోయారు :) " బీదవారికి ధనం లేకపోయినా ఆత్మ గౌరవం వుంటుంది " అని రామయ్య తో ఓసారి , వాసుతో రెండు సార్లు అనిపించి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు :)
ఇంకా సినిమా గురించి ఏమి చెప్తాను కాని పాటలు వినేస్తే సరి ;

అందెను నేడే అందని జాబిల్లీ ,
రానని రాలేనని వూరకె అంటావు ,
ఒక పూల బాణం తగిలింది మదిలో



మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు మాఇంటి కోచ్చారు




ప్రేమించి పెళ్ళి చేసుకో



ప్రేమించనిదే పెళ్ళాడనని తెగ కోతలు కోసావులే

Thursday, July 14, 2011

డాక్టర్ . చక్రవర్తి



చక్కటి అమ్మాయి . ఆ అమ్మాయికి పతియే ప్రత్యక్ష దైవం . ఇల్లే స్వర్గం . సాహిత్యమంటే అభిరుచి . కథలు వ్రాసి పత్రికలకు పంపుతూ వుంటుంది . రుచిగా వంట చేసి భర్తకు వడ్డిస్తుంది . అందమైన పేంటింగ్స్ వేసి ఇంటిని అలంకరిస్తుంది . సాహిత్యమే కాదు సంగీతమన్నా ప్రేమే . మధురంగా పాడగలదు . ఇన్ని మంచి అలవాట్లున్న అమ్మాయంటే భర్త కు ప్రాణం కావాటం సహజమే కదా ! చల్ల చల్ల గా సాగిపోతున్న వారి జీవితాలలోకి అబ్బాయి స్నేహితుడు డాక్టర్ వస్తాడు . ఆ డాక్టర్ చనిపోయిన తన ప్రాణపదమైన చెల్లెలిని ఈ అమ్మాయిలో చూసుకొని మురిసిపోతూ వుంటాడు . ఇంకేముంది ఆ డాక్టర్ భార్య కు అసూయ భగ్గుమంటుంది . అతని చెల్లెలి చివరి కోరిక మీదే తనను పెళ్ళి చేసుకున్నాడని మర్చిపోతుంది . అంతే కాంప్ కు వెళ్ళిన అబ్బాయికి అతని భార్య డాక్టర్ తో ప్రేమ కలాపాలతో మునిగిపోయింది అని వుత్తరం రాస్తుంది . అంతే కాదు ఆ అమ్మాయి భర్త కోసమని రాసుకున్న పాటను డాక్టర్ కోసమని రాసుకుందని ఆ కాగితమూ పంపుతుంది . అంతగా ప్రేమించిన భార్యను ఆ ఒక్క వుత్తరం తోనే అనుమానిస్తాడు ఆ అబ్బాయి . భార్యను పుట్టింటికి పంపేసి , తాగుతూ వుంటాడు . స్చప్ . . .


ఏమిటిది అంటే ఇది , ఈ రోజు నేను చూసిన డాక్టర్. చక్రవర్తి సినిమా కథ . సినిమా అంతా నాకు నచ్చింది కాని , అంతగా ప్రేమించిన భార్యను ఒకే ఒక వుత్తరం తో అనుమానించటం నాకు నచ్చలేదు . సరే చక్రవర్తి అర్ధరాత్రి , మాధవిని చూసేందుకు వాళ్ళ ఇంటికి రావటము కూడా ఒక కారణం అనుకోండి . పాట మాధవి చేతి రాతతో వుండటమూ ఇంకో కారణం . కాని ఎన్ని కారణాలు చెప్పినా అది మగవాడిని అనే అహంభావం , అతని మూర్ఖత్వం అనిపించింది . ఇంకేదైనా బలమైన కారణం చూపించాల్సింది .

దీనిలో చక్రవర్తి ని చాలా ఉదాత్తం గా చూపించే ప్రయత్నం చేసారు . చెల్లెలి మీద ప్రేమ తో నిర్మలను వివాహం చేసుకోలేక , ప్రేమించిన శ్రీదేవిని వదులుకోలేక తల్లడిల్లే సమయం లో సవితి చెల్లెలి మీద ప్రేమ చాలా బాగా వ్యక్తీకరించాడు . అన్నయ్య చదివించి , ఆ చదువు మధ్యలో ఆగకూడదని తనకు వచ్చిన లంగ్ కాన్సర్ గురించి అన్నకు చెప్ప కుండా దాచటము , అన్నయ్య కోసం ఎదురు చూడటము అన్నీ ఆ అన్నా చెల్లెళ్ళ ప్రేమను బాగా చూపిస్తాయి . అన్నా చెల్లెళ్ళు అంటే ఇలా వుండాలి అనిపించేట్లుగా వుంది . అదే చెల్లెలి ని మాధవి లో చూసుకుంటూ భార్య అసూయను గ్రహించలేక పోతాడు . అదే అన్నిటి కీ మూలమైంది .

కోడూరి కౌసల్యా దేవి వ్రాసిన " చక్రభ్రమణం " నవల ఆధారం గా అన్నపూర్ణా పిక్చర్స్ లో , డి మధుసూధన రావు , ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం లో 1964 లో నిర్మించిన అన్నపూర్ణావారి మరో ఆణిముత్యం లాంటి సినిమా " డాక్టర్ . చక్రవర్తి " . ఇది అక్కినేని నాగేశ్వరరావు , జగ్గయ్య , సావిత్రి ల టీం తో వచ్చిన చక్కటి కుటుంబకథా చిత్రం ఇది . దీనిలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం , భార్యా భర్తల అనురాగం చక్కగా చూపించారు . చెల్లెళ్ళ మీద ప్రేమ తో తనను భర్త నిర్లక్షం చేసాడని నిర్మల అసూయపడటము సహజం గా నే అనిపించింది .

నవలను సినిమా అనుకరణ చేసింది గొల్లపూడి మారుతీ రావు . మాటలు వ్రాసింది ఆచార్య ఆత్రేయ . పాటలు వరాసింది ఆత్రేయ, దాశరధి , శ్రీశ్రీ , ఆరుద్ర. పాడింది పి. సుశీల , ఘంటసాల , జానకి , పి.బి శ్రీనివాస్ , మాధవపెద్ది , వసంత .
ఇందులోని పాటలన్నీ జాదరణ పొందాయి . మరి విందామా/ చూద్దామా !!!!!

ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక



పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా , నేనే పరవశించి పాడనా



పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా కృష్ణా పదుగురెదుట పాడనా





మనసున మనసై , బ్రతుకున బ్రతుకై తోడొకరుండి నా అదే భాగ్యమూ , అదే స్వర్గమూ
వహవా ఏమి పాట . ఆల్ టైం హిట్ .




నీవులేక వీణా పలుకలేనన్నదీ నీవు రాక రాధా నిలువలేనన్నదీ . . .
మా ఫ్రెండ్ కు ఈ పాట చాలా ఇష్టం :)




నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళా నీ కెలాగుంది ఈ వేళా




ఉంగరాల గుగురున్న రాజా నీ హంగు చూసి పొంగిపోనురా

Saturday, July 9, 2011

వెలుగునీడలు



" వెలుగు నీడలు " అన్నపూర్ణా వారి ఆణి ముత్యములలో వక ముత్యం . ఈ సినిమా నేను కాలేజీ లో వుండగా మారింగ్ షోలో వస్తే మా ఫ్రెండ్స్ అందరూ వళ్ళారు . నాకెందుకో ఈ సినిమా ఏడుగొట్టు సినిమా అన్న భావన వుండటం వల్ల నేను వెళ్ళ లేదు . నేను సినిమా చూసినా , నవల చదివినా చాలా లైట్ , కామిడీ వే చూస్తాను/ చదువుతాను . జీవితమన్నాక కష్టాలూ , కన్నీళ్ళూ తప్పవు అని తెలుసు . అవి సినిమాల్లో కూడా ఎందుకు చూడాలి అని నా ఫీలింగ్ :) సరే అన్నపూర్ణా వారి సినిమాలు చూసి వ్రాయటం మొదలుపెట్టాక ఆ, సీరీస్ లో వెలుగు నీడలు ఏం పాపం చేసుకుంది , దాన్నెందుకు వదిలేయాలి అని , అంతగా ఐతే కళ్ళు మూసుకొని చూద్దాములే అనుకొని ధైర్యం చేసి సి.డి పెట్టాను . కళ్ళు మూసుకునే అవసరం రాలేదు :)) అన్నపూర్ణా వారివి నేను ఇంతకు ముందు చూసిన సినిమ్మాలాగానే బాగుంది . కొంచం ఏడుపు వుందనుకోండి . ఐనా పరవాలేదు చూడవచ్చు .
రావుబహుద్దూర్ వెంకట్రామయ్య ( యస్.వి . రంగారావు ) , కనకదుర్గ ( సూర్యకాంతం ) ల కు పిల్లలు లేకపోతే సుగుణ ( చిన్నప్పుడు , బేబీ శశికళ , పెద్దయ్యాక సావిత్రి ) ని పెంచుకుంటారు . చాలా గారాబం గా చూసుకుంటూ వుంటారు . వెంకట్రామయ్య ప్రెస్ ను నడుపుతుంటాడు . అందులో మేనేజర్ వెంగళప్ప ( రేలంగి ) . ఇంతలో వాళ్ళ కో పాప పుడుతుంది . దాని తో అప్పటివరకు గారాబంగా చూసుకుంటున్న సుగుణ అంటే కనక దుర్గ కు సుగుణ మీద ఆపేక్ష పోయి , ఇంటి నుంచి వెళ్ళ గొడుదామనుకుంటుంది . అందుకని వెంకట్రామయ్య సుగుణను వెంగళ్ళప్పకు అప్పగిస్తాడు . సుగుణ పెద్దదై డాక్టర్ అవుతుంది . చదువుకునే రోజులలో పరిచయమైన చంద్రం ను ప్రేమిస్తుంది . కనకదుర్గ కూతురు వరలక్ష్మి ( గిరిజ ) కు చదువు అబ్బదు . సుగుణ ట్యూషన్ చెబుతున్న అబ్బాయి మేనమామ డాక్టర్ . రఘు ( జగ్గయ్య ) సుగుణ ను పెళ్ళి చేసుకుందామనుకుంటాడు . చంద్రం కు టి. బి అని తెలుస్తుంది . రఘు ను పెళ్ళిచేసుకోమని సుగుణ ను వొప్పించి , ఇద్దరికీ పెళ్ళి జరిపించి , ఆదర్శ డాక్టర్లు గాను , ఆదర్శ దంపతులుగాను జీవించమని , దీవించి , మదనపల్లి సానిటోరియం లో చేరుతాడు . కాలక్రమేణ చంద్రం జబ్బు నయమై , ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తాడు . చంద్రం ను రిసీవ్ చేసు కునేందుకు వెళుతున్న రఘు కు ఆక్సిడెంటై చనిపోతాడు . సుగుణ పేదలకు వైద్యం చేస్తూ జీవించేందుకు నిశ్చయించుకుంటుంది . చంద్రం ను వొప్పించి వరలక్ష్మి తో వివాహం జరిపిస్తుంది . వారికి ఒక బాబు పుడతాడు . చంద్రం కు వెంకట్రామయ్య ప్రెస్ ను అప్పగిస్తాడు . చద్రం ప్రెస్ ను అభివృద్ధి లోకి తెస్తాడు . తల్లి భోధనల తో చంద్రం ను , సుగుణ ను అనుమానిస్తుంది .చంద్రం కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు . చివరకు వరలక్ష్మి నిజం తెలుసు కుంటుంది . అందరూ కలిసి హాపీగా వుంటారు .
నటీ నటులందరూ యధావిధిగా బాగా నటించారు . రఘు చనిపోయాడని తెలుసుకున్నప్పుడు " నిన్ను వెలుగు లోకి పంపుతున్నానని శాశ్వ్తంగా చీకటిలోకి పంపాను . ఈ నేరం నాది సుగుణా నాది " అంటూ చంద్రం నుదుటి మీద గుప్పిట పెట్టుకొని నాగేశ్వరరావు మార్క్ డైలాగ్ చెప్పుతాడు :) అమ్మో కనక దుర్గమ్మ నోరే నోరు . బాబోయ్ ఇలాంటి నొరున్నవాళ్ళను తట్టుకోవటం కష్టమే :) సినిమా చివరలో బుడ్డోడు , చిన్న రఘు ( చంద్రం , వరలక్ష్మి ల కొడుకు ) సుగుణ దగ్గరకు తన మూడు చక్రాల సైకిల్ వేసుకొని రయ్ రయ్ మని , బండి కిందనుంచి కార్ ల పక్కనుంచి భలే వెళుతాడు :) ఇందులో కమల్ హాసన్ చిన్నప్పుడు ఏదో వేషం వేసాడని ఎక్కడో చదివిన గుర్తు . ఎక్కడా అని వెతికాను కాని తెలుసుకోలేక పోయాను . మొత్తానికి సినిమా చూడవచ్చు .
పాటలలో " పాడవోయి భారతీయుడా " ఇప్పటికీ స్వాతంత్ర దినోత్సవం రోజున వినిపిస్తూనే వుంటుంది . ఈ పాటలో చెప్పిన ధరలు , నిరుద్యోగం , చీకటి బజారు లాంటి వాటికి ఇప్పుడూ మోక్షం కలుగలేదు .
" కలకానిది విలువైనది , బ్రతుకు కన్నీటి ధారలలో బలి చేయకు " ,
" హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి తారాలల్లే మందుజల్లి నవ్వాసాగే ,"
"పాడవోయి భారతీయుడా "
" శివ గోవింద గోవింద " ,
"చల్లని వెన్నెల సోనలు , తెల్లని మల్లేల మాలలు , మాపాపాయి బోసి నవ్వులే మంచి ముత్యముల మాలలూ " ,
" చిట్టీ పొట్టీ చిన్నారీ పుట్టిన రోజూ , చేరి మనం ఆడీ పాడే పండగ రోజు "
హిట్ సాంగ్స్ . వీటిని శ్రీశ్రీ , కొసరాజు రాసారు .
సంగీత దర్శకుడు ; పెండ్యాల .
గాయనీ గాయకులు ;
పి. సుశీల , ఘంటసాల , జిక్కీ , స్వర్ణలత , మాధవపెద్ది సత్యం .
పాటలు;

పాడవోయి బారతీయుడా , ఆడి పాడవోయి విజయగీతికా



కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు



చిట్టీ పొట్టీ చిన్నారి పుట్టిన రోజు చేరి మనం ఆడి పాడే పండుగ రోజు



చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు



హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో




శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద


ఓ రంగయ్యో పూల రంగయ్యో ఓర చూపు చాలించి సాగిపోవయ్యో

Tuesday, July 5, 2011

చదువుకున్న అమ్మాయిలు



1963 లో అన్నపూర్ణా పిక్చర్స్ లో వచ్చిన ఆణిముత్యం లాంటి సినిమా " చదువుకున్న అమ్మాయిలు " . ఈ సినిమా నిర్మాత డి. మధుసూధనరావు . దర్శకుడు : ఆదుర్తి . సుబ్బారావు . డాక్టర్ శ్రీదేవి రచించిన నవల ( ఏ నవలో టైటిల్స్ లో ఇవ్వలేదు ) ఆధారం గా ఈ సినిమాను తీసారు . యద్దనపూడి సులోచనా రాణి , ఆదుర్తి . సుబ్బారావు , కే. విశ్వనాథ్ , డి . మధుసూధనరావు నవలను సినిమా అనుకరణ చేసారు . టి. గోపీచంద్ మాటలు వ్రాయగా , ఆరుద్ర, దాశరధి , కోసరాజు , సి. నారాయణ రెడ్డి పాటలు వాసారు. . ఘంటసాల , పి. సుశీల , ఆశాలత కులకర్ణి , పి. బి శ్రీనివాస్ , స్వర్ణలత , మాధవపెద్ది గానం చేసారు .
సుజాత ( సావిత్రి ) , గొప్పింటి అమ్మాయి . వసంత ( కృష్ణకుమారి ) సుజాత స్నేహితురాలు . ఒకరోజు సుజాత నేర్పిస్తుండగా వసంత కార్ నడుపుతుండగా, శేఖర్ ( నాగేశ్వర రావు ) నడుపుతున్న మోటర్ సైకిల్ కు కార్ తగిలి , శేఖర్ కింద పడుతాడు . అప్పుడు పోట్లాట నుంచి , ముగ్గురూ ఫ్రెండ్స్ అవుతారు . బాంక్ లో పని చేస్తున్న శేఖర్ బాకీ వసూలు కోసమని పల్లెటూరికి వెళ్ళగా , ఆ బాకీ చెల్లించవలిసింది వసంత తాతయ్యే నని తెలుసుకుంటాడు . వసంత చదువుకోసమే ఆ అప్పు చేసినట్లు తెలుసుకుంటాడు .
ఇష్టం లేని పెళ్ళి నుంచి తప్పించుకొని వచ్చిన తమ చిన్న నాటి స్నేహితురాలు లత ( ఈ. వీ . సరోజ ) కు సుజాత ఆశ్రయం ఇస్తుంది . బాంక్ వారు ఆస్తిని జప్తుచేయగా నిరాశ్రయులైన వసంత తాతయ్య , అమ్మమ్మలకు కూడా సుజాత ఆశ్ర్యం ఇస్తుంది . కాని పరిస్తితుల వల్ల వాళ్ళు సుజాత ఇంటిని వదిలేసి , తాతయ్య స్నేహితుడు నడుపుతున్న బ్రహ్మచారి మఠం కు చేరుకుంటారు , వసంత , తాతయ్య , అమ్మమ్మ . శేఖర్ ను వసంత , సుజాత ఇద్దరూ ప్రేమిస్తారు . కాని శేఖర్ వసంతను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని , సుజాత తండ్రి చూసిన పోలీస్ ఆఫీసర్ ను పెళ్ళి చేసుకుంటుంది . బ్రహ్మచారి మఠం లోనే వున్న , శేఖర్ స్నేహితుడు ఆనంద్ ( పద్మనాభం ) వసంత అమ్మమ్మను మంచి చేసుకుంటాడు . తాతయ్య ( గుమ్మడి ) ఆరోగ్యం సీరియస్ గా వుండటము తో శేఖర్ తన మోటర్ సైకిల్ అమ్మి ఆ డబ్బును వసంత కివ్వమని శేఖర్ , ఆనంద్ కు చెపుతాడు . తనకు బాంక్ లో ఇన్స్పెక్షన్ వున్నందువలన ఆ పని ఆనంద్ కు వప్పచెపుతాడు శేఖర్ . ఆనంద్ ఆ మోటర్ సైకిల్ అమ్మిన డబ్బును శేఖర్ కు ఇవ్వకుండా దాచి , సాయం కాలం ఇస్తానన్నాడని , శేఖర్ కు చెపుతాడు . అప్పుడు తప్పనిసరి పరిస్తితి లో శేఖర్ బాంక్ నుంచి 1000 రూపాయలు తీసి ఆనంద్ కు వసంత తాతయ్య వైద్యం నిమిత్తము ఇస్తాడు . ఆ డబ్బు కూడా తీసుకొని , లత తో కలిసి వూరువదివెళుతాడు ఆనంద్. సరైన సమయం లో వైద్యం అందక తాతయ్య చనిపోతాడు . ఆ తరువాత వచ్చిన ఆనంద్ వల్ల అందరూ శేఖర్ ను అపార్ధం చేసుకుంటారు . పోలీసులు శేఖర్ కోసం వెతుకుతూ వుంటారు . చివరకు అపార్ధాలు తొలిగిపోతాయనుకోండి . కథ సుఖాంతం :)

సినిమా గురించి అంటే ఇది కుటుంబకథా చిత్రం . చాలా నీట్ గా వుంది . ముఖ్యం గా ఆడపిల్లలకు కూడా చదువు ఎంత ముఖ్యమో చెపుతుంది ఈ సినిమా . నటీ నటులందరూ దిగ్గజాలే ! వారి గురించి ప్రత్యేకం గా చెప్పేందుకేముంటుంది ? ఇద్దరాడపిల్ల ల మద్య నాగేశ్వర రావు చిలిపిగా వున్నారు . అన్నట్లు ఇందులో సావిత్రి భర్త పోలీస్ ఆఫీసర్ గా శోభన్ బాబు నటించాడు ! సావిత్రి ముందు చాలా చిన్నగా వున్నాడు . వీలైనంతవరకు గంభీరం గా వుండేందుకు ప్రయతించాడు :) ( ఆ తరువాత కొన్ని సినిమాలల్లో సావిత్రి కొడుకుగా నటించాడు :)) సావిత్రి కి అప్పటికే కాస్త పెద్దరికం వచ్చేసినట్లుంది ,రెండుజడల కాలేజీ గర్ల్ మేకప్ అంత నప్పలేదు . కాని క్యూట్ గా వుందిలే !
భర్త ( రేలంగి ) వేరే అమ్మాయి ని ప్రేమిస్తున్నాడని అపోహ పడి న భార్య ( సూర్యకాంతం ) అతని మనసు దోచుకోవటానికి , పూల జడ తో సింగారము తో భలేగా వుంది . ఆ సీన్ చూస్తున్నంత సేపూ ఒకటే నవ్వు :)
ఇద్దరుమిత్రులు లో నాగేశ్వరరావు తో హీరోయిన్ గా వేసిన ఇ. వి సరోజ తరువాతి పిక్చర్ లోనే కామేడియన్ కం పద్మనాభాని కి జోడిగా రావటం సినిమా విచిత్రం !
బ్లాక్ అండ్ వైట్ సినిమా ఐనా చీరలు బ్రహ్మాండమైన డిజైన్లు వున్నాయి . చాలా బాగున్నాయి :) ఇంకో సంగతి , ఈ సినిమా లో సుజాత , వసంత మా 'రెడ్డీ వుమెన్స్ కాలేజ్ ' కాలేజీ లోనే చదువుకున్నారోచ్ :)
ఈ సినిమాను చూడాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు .
ఇందులోని కొన్ని పాటలు :-
వకటే హృదయం కోసం



వినిపించని రాగాలే , కనిపించని అందాలే



ఆడవాళ్ళ కోపం లో అందముంది అహ అందులోనే అంతులేని అర్ధమున్నది



ఏమిటీ ఈ అవతారం ఎందుకు ఈ సింగారం

Friday, July 1, 2011

ఇద్దరు మిత్రులు




అజయ్ బాబు జమీందార్ పుత్రుడు . విదేశాలలో లో ఇంజనీరింగ్ చదువుతూ వుంటాడు . తండ్రి సీరియస్ గా వున్నాడని కేబుల్ వస్తే స్వదేశానికి వస్తాడు . వచ్చేసరికే తండ్రి మరణిస్తాడు . కళ్ళు లేని మేనత్త , మేనేజర్ భానోజీ రావు అతనిని ఓదారుస్తారు . వ్యాపారాల విషయాలన్నీ అల్ల కల్లోలం గా వుంటాయి . వాటిని తట్టుకోలేక , దుర్వ్యసనాలు అలవర్చుకుంటాడు . ఓరోజు రాత్రి తాగి కార్ డ్రైవ్ చేసుకొని వస్తుండగా ఒక యువకుడు అతని కార్ కింద పడతాడు . అతను అచ్చం తనలాగే వుండటము చూసి ఆశ్చర్యపోతాడు . అతనిని హోటల్ కు తీసుకెళ్ళి అతని పేరు విజయ్ అని , అతని చెల్లెలు మీనాకు ,పెళ్ళైనా , ఆమె కు పెళ్ళి లో పెట్టిన నగలు తల్లి ఆరోగ్యం కొరకు ఖర్చుపెట్టగా , ఆ నగలు తెస్తేనే తీసుకెళుతామని మీనా మామగారు , మీనా ను పుట్టింట్లోనే వుంచేసాడని , తండ్రి రామదాసు , రాముని సేవలో వుండి ఇంటిని పట్టించుకోవటము లేదని , ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక పోతున్నాడని తెలుసు కుంటాడు . డబ్బు వుంటే ఇబ్బందులు వుండవు అన్న విజయ్ అభిప్రాయము తప్పని తన ఇబ్బందులు చెపుతాడు . అది తెలుసుకునేందుకు విజయ్ ను తన ప్లేస్ లోకి మారమంటాడు . ఒక ఏడాది పాటు ఇద్దరూ ప్లేసులు మార్చుకునేందుకు ఒప్పందం చేసుకుంటారు .
అజయ్ ఇంటికి వచ్చిన విజయ్ ను , అతను అజయ్ కాడని గుర్తిస్తుంది , అజయ్ మేనత్త . అప్పుడు ఆమెకు విషయం ఇద్దరు కలిసి వివరిస్తారు . అజయ్ ఆర్ధిక అవకతవకలకు మేనేజర్ భానోజీ రావే కారణమని గుర్తిస్తాడు విజయ్ . తన తెలివి తేటల తో పరిస్తితులను చక్క దిద్దుతూ వుంటాడు . భానోజీ రావు కూతురు సరళను ప్రేమిస్తున్నట్లుగా నటిస్తుంటూ వుంటాడు . సరళ అమాయకురాలని , తండ్రి చేసే పనులు ఆమెకు తెలీవని తెలుసుకుంటాడు . ఇహ అజయ్ , విజయ్ ఇంట్లో కలిసిపోతాడు . ఆటో మొబైల్ లో మెకానిక్ గా పని చేసి కుటుంబాన్ని నడిపిస్తూ వుంటాడు . ఆటో మొబైల్ ఓనర్ ప్రకాశ్ చెల్లెలు పద్మను ప్రేమను ప్రేమిస్తాడు . బావ బుజ్జి ని ఇంటికి తీసుకొస్తాడు . విజయ్ కంపెనీ లో విజయ్ కు పర్సనల్ సెక్రెటరీ గా పద్మ కు వుద్యోగం వస్తుంది . మీనా మీద అపనిందలు వస్తున్నాయని , విజయ్ గా వున్న అజయ్ , అజయ్ గా బాంక్ కు వెళ్ళి 10, 000 రూపాయలు తెచ్చి , మీనా మామగారికి ఇచ్చి , మీనా ను అత్తవారింటికి పంపుతాడు . ఈ లోగా భానోజీ అజయ్ , విజయ్ ల ఒప్పందం గురించి తెలుసుకుంటాడు . అజయ్ ను దొంగా గా పోలీసులకు పట్టిస్తాడు . విజయ్ , సరళ తో ఎంగేజ్మెంట్ నాటకం ఆడి , ఆ నాటకం లో భానోజీ ని పోలీసులకు పట్టిస్తాడు . అజయ్ పద్మ , విజయ్ సరళ ల పెళ్ళి తో సినిమా ముగుస్తుంది .

ఈ సినిమా ను ,1961 లో అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించారు . ఈ సినిమా " తాషేర్ ఘర్ " అనే బెంగాలి నవల ఆధారం గా నిర్మించబడినది . ఆ నవలను , ఏ. సుబ్బారావు , కే , విశ్వనాథ్ , గోరాశాస్త్రి , డి. మధుసూధనరావు సినిమాకు అనుగుణం గా మార్చారు . ఆదుర్తి .సుబ్బారావు దర్శకత్వం వహించగా , డి . మధుసూదన రావు నిర్మించారు . ఇందులో అజయ్ , విజయ్ గా నాగేశ్వర రావు , సరళగా రాజసులోచన, పద్మగా ఇ.వి. సరోజ , భానోజీగా గుమ్మడి , మీనా గా శారద , బుజ్జిగా పద్మనాభం , బుజ్జి తల్లి తండ్రులుగా రేలంగి , సూర్యకాంతం , రామదాసుగా రమణా రెడ్డి , నటించారు . నాగేశ్వరరావు నటన గురించి నేను ప్రత్యేకం గా చెప్పేదేముంటుంది . పద్మ , సరళ గా ఇ.వి సరోజ , రాజసులోచన ముద్దుగా బొద్దుగా వున్నారు . ఇంతకు ముందు అన్నపూర్ణా వారి సినిమా మాంగల్యబలం లో హాస్య నటిగా వున్న రాజసులోచనకు ఇందులో నాయిక పాత్ర దక్కింది :) నేను మహానటిగా , నాయిక పాత్రలలో చూసిన శారద ఇందులో చెల్లెలి పాత్ర లో చూడటము గమ్మత్తుగా వుంది . అన్ని సినిమాలలో గయ్యాళి అత్తగారిగా వేసే సూర్యకాంతం మంచి అత్తగారు , మంచి తల్లి పాత్రలో కనిపించింది :) రేలంగి , రమణా రెడ్డిల హాస్యం బాగుంది .
శ్రీశ్రీ, ఆరుద్ర , దాశరధి , కోసరాజు వ్రాసిన చక్కటి పాటలను , ఘంటసాల , పి. సుశీల , శ్రీనివాస్ , మాధవపెద్ది సత్యం , యస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం లో మధురం గా ఆలపించారు . పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది . " ఓహో ఓహో నిన్నే కోరెదా , కుహూ కుహూ అనే కోయిలా " పాట లో చందమామ వెన్నెల వెలుగు లు చూసి తీరవలిసిందే ! అసలు అన్నపూర్ణా వారు అంత చక్కటి మేడను ఎక్కడ తీసుకున్నారో ! ఆ మేడ మీద మాలతీ లతల తో వున్న పందిరి , పైన వెన్నెల రేడు ఓహ్ చెప్పలేనంత అందముగా వున్నాయి . ఆ చిత్రీకరణ గొప్పదనము చాయాగ్రహ దర్శకుడు పి. యస్ సెల్వరాజ్ దే అంటే బాగుంటుందేమో ! "పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక " పాట కూడా ఏమీ తీసిపోలేదు . అసలు అన్ని పాటలూ చాలా చాలా బాగున్నాయి .

సినిమాలో కాలాపహాడ్ ను , నిండుగా వున్న గండిపేటను చూసి నలభై ఏళ్ళ వెనకకి వెళ్ళిపోయాను :) అంతేకాదు రిట్జ్ హోటల్ కూడా వుంది :)

నెట్ లో అన్ని పాటలు లేవు . వున్నవి ఇవే :)
ఓహో ఒహో నిన్నే కోరెదా




పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా





కుషీ కుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ





హల్లో హల్లో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి .


ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుస లాడినవి ఏమిటో
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి .