Friday, July 1, 2011
ఇద్దరు మిత్రులు
అజయ్ బాబు జమీందార్ పుత్రుడు . విదేశాలలో లో ఇంజనీరింగ్ చదువుతూ వుంటాడు . తండ్రి సీరియస్ గా వున్నాడని కేబుల్ వస్తే స్వదేశానికి వస్తాడు . వచ్చేసరికే తండ్రి మరణిస్తాడు . కళ్ళు లేని మేనత్త , మేనేజర్ భానోజీ రావు అతనిని ఓదారుస్తారు . వ్యాపారాల విషయాలన్నీ అల్ల కల్లోలం గా వుంటాయి . వాటిని తట్టుకోలేక , దుర్వ్యసనాలు అలవర్చుకుంటాడు . ఓరోజు రాత్రి తాగి కార్ డ్రైవ్ చేసుకొని వస్తుండగా ఒక యువకుడు అతని కార్ కింద పడతాడు . అతను అచ్చం తనలాగే వుండటము చూసి ఆశ్చర్యపోతాడు . అతనిని హోటల్ కు తీసుకెళ్ళి అతని పేరు విజయ్ అని , అతని చెల్లెలు మీనాకు ,పెళ్ళైనా , ఆమె కు పెళ్ళి లో పెట్టిన నగలు తల్లి ఆరోగ్యం కొరకు ఖర్చుపెట్టగా , ఆ నగలు తెస్తేనే తీసుకెళుతామని మీనా మామగారు , మీనా ను పుట్టింట్లోనే వుంచేసాడని , తండ్రి రామదాసు , రాముని సేవలో వుండి ఇంటిని పట్టించుకోవటము లేదని , ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక పోతున్నాడని తెలుసు కుంటాడు . డబ్బు వుంటే ఇబ్బందులు వుండవు అన్న విజయ్ అభిప్రాయము తప్పని తన ఇబ్బందులు చెపుతాడు . అది తెలుసుకునేందుకు విజయ్ ను తన ప్లేస్ లోకి మారమంటాడు . ఒక ఏడాది పాటు ఇద్దరూ ప్లేసులు మార్చుకునేందుకు ఒప్పందం చేసుకుంటారు .
అజయ్ ఇంటికి వచ్చిన విజయ్ ను , అతను అజయ్ కాడని గుర్తిస్తుంది , అజయ్ మేనత్త . అప్పుడు ఆమెకు విషయం ఇద్దరు కలిసి వివరిస్తారు . అజయ్ ఆర్ధిక అవకతవకలకు మేనేజర్ భానోజీ రావే కారణమని గుర్తిస్తాడు విజయ్ . తన తెలివి తేటల తో పరిస్తితులను చక్క దిద్దుతూ వుంటాడు . భానోజీ రావు కూతురు సరళను ప్రేమిస్తున్నట్లుగా నటిస్తుంటూ వుంటాడు . సరళ అమాయకురాలని , తండ్రి చేసే పనులు ఆమెకు తెలీవని తెలుసుకుంటాడు . ఇహ అజయ్ , విజయ్ ఇంట్లో కలిసిపోతాడు . ఆటో మొబైల్ లో మెకానిక్ గా పని చేసి కుటుంబాన్ని నడిపిస్తూ వుంటాడు . ఆటో మొబైల్ ఓనర్ ప్రకాశ్ చెల్లెలు పద్మను ప్రేమను ప్రేమిస్తాడు . బావ బుజ్జి ని ఇంటికి తీసుకొస్తాడు . విజయ్ కంపెనీ లో విజయ్ కు పర్సనల్ సెక్రెటరీ గా పద్మ కు వుద్యోగం వస్తుంది . మీనా మీద అపనిందలు వస్తున్నాయని , విజయ్ గా వున్న అజయ్ , అజయ్ గా బాంక్ కు వెళ్ళి 10, 000 రూపాయలు తెచ్చి , మీనా మామగారికి ఇచ్చి , మీనా ను అత్తవారింటికి పంపుతాడు . ఈ లోగా భానోజీ అజయ్ , విజయ్ ల ఒప్పందం గురించి తెలుసుకుంటాడు . అజయ్ ను దొంగా గా పోలీసులకు పట్టిస్తాడు . విజయ్ , సరళ తో ఎంగేజ్మెంట్ నాటకం ఆడి , ఆ నాటకం లో భానోజీ ని పోలీసులకు పట్టిస్తాడు . అజయ్ పద్మ , విజయ్ సరళ ల పెళ్ళి తో సినిమా ముగుస్తుంది .
ఈ సినిమా ను ,1961 లో అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించారు . ఈ సినిమా " తాషేర్ ఘర్ " అనే బెంగాలి నవల ఆధారం గా నిర్మించబడినది . ఆ నవలను , ఏ. సుబ్బారావు , కే , విశ్వనాథ్ , గోరాశాస్త్రి , డి. మధుసూధనరావు సినిమాకు అనుగుణం గా మార్చారు . ఆదుర్తి .సుబ్బారావు దర్శకత్వం వహించగా , డి . మధుసూదన రావు నిర్మించారు . ఇందులో అజయ్ , విజయ్ గా నాగేశ్వర రావు , సరళగా రాజసులోచన, పద్మగా ఇ.వి. సరోజ , భానోజీగా గుమ్మడి , మీనా గా శారద , బుజ్జిగా పద్మనాభం , బుజ్జి తల్లి తండ్రులుగా రేలంగి , సూర్యకాంతం , రామదాసుగా రమణా రెడ్డి , నటించారు . నాగేశ్వరరావు నటన గురించి నేను ప్రత్యేకం గా చెప్పేదేముంటుంది . పద్మ , సరళ గా ఇ.వి సరోజ , రాజసులోచన ముద్దుగా బొద్దుగా వున్నారు . ఇంతకు ముందు అన్నపూర్ణా వారి సినిమా మాంగల్యబలం లో హాస్య నటిగా వున్న రాజసులోచనకు ఇందులో నాయిక పాత్ర దక్కింది :) నేను మహానటిగా , నాయిక పాత్రలలో చూసిన శారద ఇందులో చెల్లెలి పాత్ర లో చూడటము గమ్మత్తుగా వుంది . అన్ని సినిమాలలో గయ్యాళి అత్తగారిగా వేసే సూర్యకాంతం మంచి అత్తగారు , మంచి తల్లి పాత్రలో కనిపించింది :) రేలంగి , రమణా రెడ్డిల హాస్యం బాగుంది .
శ్రీశ్రీ, ఆరుద్ర , దాశరధి , కోసరాజు వ్రాసిన చక్కటి పాటలను , ఘంటసాల , పి. సుశీల , శ్రీనివాస్ , మాధవపెద్ది సత్యం , యస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం లో మధురం గా ఆలపించారు . పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది . " ఓహో ఓహో నిన్నే కోరెదా , కుహూ కుహూ అనే కోయిలా " పాట లో చందమామ వెన్నెల వెలుగు లు చూసి తీరవలిసిందే ! అసలు అన్నపూర్ణా వారు అంత చక్కటి మేడను ఎక్కడ తీసుకున్నారో ! ఆ మేడ మీద మాలతీ లతల తో వున్న పందిరి , పైన వెన్నెల రేడు ఓహ్ చెప్పలేనంత అందముగా వున్నాయి . ఆ చిత్రీకరణ గొప్పదనము చాయాగ్రహ దర్శకుడు పి. యస్ సెల్వరాజ్ దే అంటే బాగుంటుందేమో ! "పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక " పాట కూడా ఏమీ తీసిపోలేదు . అసలు అన్ని పాటలూ చాలా చాలా బాగున్నాయి .
సినిమాలో కాలాపహాడ్ ను , నిండుగా వున్న గండిపేటను చూసి నలభై ఏళ్ళ వెనకకి వెళ్ళిపోయాను :) అంతేకాదు రిట్జ్ హోటల్ కూడా వుంది :)
నెట్ లో అన్ని పాటలు లేవు . వున్నవి ఇవే :)
ఓహో ఒహో నిన్నే కోరెదా
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
కుషీ కుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
హల్లో హల్లో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి .
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుస లాడినవి ఏమిటో
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment