Tuesday, July 5, 2011

చదువుకున్న అమ్మాయిలు



1963 లో అన్నపూర్ణా పిక్చర్స్ లో వచ్చిన ఆణిముత్యం లాంటి సినిమా " చదువుకున్న అమ్మాయిలు " . ఈ సినిమా నిర్మాత డి. మధుసూధనరావు . దర్శకుడు : ఆదుర్తి . సుబ్బారావు . డాక్టర్ శ్రీదేవి రచించిన నవల ( ఏ నవలో టైటిల్స్ లో ఇవ్వలేదు ) ఆధారం గా ఈ సినిమాను తీసారు . యద్దనపూడి సులోచనా రాణి , ఆదుర్తి . సుబ్బారావు , కే. విశ్వనాథ్ , డి . మధుసూధనరావు నవలను సినిమా అనుకరణ చేసారు . టి. గోపీచంద్ మాటలు వ్రాయగా , ఆరుద్ర, దాశరధి , కోసరాజు , సి. నారాయణ రెడ్డి పాటలు వాసారు. . ఘంటసాల , పి. సుశీల , ఆశాలత కులకర్ణి , పి. బి శ్రీనివాస్ , స్వర్ణలత , మాధవపెద్ది గానం చేసారు .
సుజాత ( సావిత్రి ) , గొప్పింటి అమ్మాయి . వసంత ( కృష్ణకుమారి ) సుజాత స్నేహితురాలు . ఒకరోజు సుజాత నేర్పిస్తుండగా వసంత కార్ నడుపుతుండగా, శేఖర్ ( నాగేశ్వర రావు ) నడుపుతున్న మోటర్ సైకిల్ కు కార్ తగిలి , శేఖర్ కింద పడుతాడు . అప్పుడు పోట్లాట నుంచి , ముగ్గురూ ఫ్రెండ్స్ అవుతారు . బాంక్ లో పని చేస్తున్న శేఖర్ బాకీ వసూలు కోసమని పల్లెటూరికి వెళ్ళగా , ఆ బాకీ చెల్లించవలిసింది వసంత తాతయ్యే నని తెలుసుకుంటాడు . వసంత చదువుకోసమే ఆ అప్పు చేసినట్లు తెలుసుకుంటాడు .
ఇష్టం లేని పెళ్ళి నుంచి తప్పించుకొని వచ్చిన తమ చిన్న నాటి స్నేహితురాలు లత ( ఈ. వీ . సరోజ ) కు సుజాత ఆశ్రయం ఇస్తుంది . బాంక్ వారు ఆస్తిని జప్తుచేయగా నిరాశ్రయులైన వసంత తాతయ్య , అమ్మమ్మలకు కూడా సుజాత ఆశ్ర్యం ఇస్తుంది . కాని పరిస్తితుల వల్ల వాళ్ళు సుజాత ఇంటిని వదిలేసి , తాతయ్య స్నేహితుడు నడుపుతున్న బ్రహ్మచారి మఠం కు చేరుకుంటారు , వసంత , తాతయ్య , అమ్మమ్మ . శేఖర్ ను వసంత , సుజాత ఇద్దరూ ప్రేమిస్తారు . కాని శేఖర్ వసంతను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని , సుజాత తండ్రి చూసిన పోలీస్ ఆఫీసర్ ను పెళ్ళి చేసుకుంటుంది . బ్రహ్మచారి మఠం లోనే వున్న , శేఖర్ స్నేహితుడు ఆనంద్ ( పద్మనాభం ) వసంత అమ్మమ్మను మంచి చేసుకుంటాడు . తాతయ్య ( గుమ్మడి ) ఆరోగ్యం సీరియస్ గా వుండటము తో శేఖర్ తన మోటర్ సైకిల్ అమ్మి ఆ డబ్బును వసంత కివ్వమని శేఖర్ , ఆనంద్ కు చెపుతాడు . తనకు బాంక్ లో ఇన్స్పెక్షన్ వున్నందువలన ఆ పని ఆనంద్ కు వప్పచెపుతాడు శేఖర్ . ఆనంద్ ఆ మోటర్ సైకిల్ అమ్మిన డబ్బును శేఖర్ కు ఇవ్వకుండా దాచి , సాయం కాలం ఇస్తానన్నాడని , శేఖర్ కు చెపుతాడు . అప్పుడు తప్పనిసరి పరిస్తితి లో శేఖర్ బాంక్ నుంచి 1000 రూపాయలు తీసి ఆనంద్ కు వసంత తాతయ్య వైద్యం నిమిత్తము ఇస్తాడు . ఆ డబ్బు కూడా తీసుకొని , లత తో కలిసి వూరువదివెళుతాడు ఆనంద్. సరైన సమయం లో వైద్యం అందక తాతయ్య చనిపోతాడు . ఆ తరువాత వచ్చిన ఆనంద్ వల్ల అందరూ శేఖర్ ను అపార్ధం చేసుకుంటారు . పోలీసులు శేఖర్ కోసం వెతుకుతూ వుంటారు . చివరకు అపార్ధాలు తొలిగిపోతాయనుకోండి . కథ సుఖాంతం :)

సినిమా గురించి అంటే ఇది కుటుంబకథా చిత్రం . చాలా నీట్ గా వుంది . ముఖ్యం గా ఆడపిల్లలకు కూడా చదువు ఎంత ముఖ్యమో చెపుతుంది ఈ సినిమా . నటీ నటులందరూ దిగ్గజాలే ! వారి గురించి ప్రత్యేకం గా చెప్పేందుకేముంటుంది ? ఇద్దరాడపిల్ల ల మద్య నాగేశ్వర రావు చిలిపిగా వున్నారు . అన్నట్లు ఇందులో సావిత్రి భర్త పోలీస్ ఆఫీసర్ గా శోభన్ బాబు నటించాడు ! సావిత్రి ముందు చాలా చిన్నగా వున్నాడు . వీలైనంతవరకు గంభీరం గా వుండేందుకు ప్రయతించాడు :) ( ఆ తరువాత కొన్ని సినిమాలల్లో సావిత్రి కొడుకుగా నటించాడు :)) సావిత్రి కి అప్పటికే కాస్త పెద్దరికం వచ్చేసినట్లుంది ,రెండుజడల కాలేజీ గర్ల్ మేకప్ అంత నప్పలేదు . కాని క్యూట్ గా వుందిలే !
భర్త ( రేలంగి ) వేరే అమ్మాయి ని ప్రేమిస్తున్నాడని అపోహ పడి న భార్య ( సూర్యకాంతం ) అతని మనసు దోచుకోవటానికి , పూల జడ తో సింగారము తో భలేగా వుంది . ఆ సీన్ చూస్తున్నంత సేపూ ఒకటే నవ్వు :)
ఇద్దరుమిత్రులు లో నాగేశ్వరరావు తో హీరోయిన్ గా వేసిన ఇ. వి సరోజ తరువాతి పిక్చర్ లోనే కామేడియన్ కం పద్మనాభాని కి జోడిగా రావటం సినిమా విచిత్రం !
బ్లాక్ అండ్ వైట్ సినిమా ఐనా చీరలు బ్రహ్మాండమైన డిజైన్లు వున్నాయి . చాలా బాగున్నాయి :) ఇంకో సంగతి , ఈ సినిమా లో సుజాత , వసంత మా 'రెడ్డీ వుమెన్స్ కాలేజ్ ' కాలేజీ లోనే చదువుకున్నారోచ్ :)
ఈ సినిమాను చూడాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు .
ఇందులోని కొన్ని పాటలు :-
వకటే హృదయం కోసం



వినిపించని రాగాలే , కనిపించని అందాలే



ఆడవాళ్ళ కోపం లో అందముంది అహ అందులోనే అంతులేని అర్ధమున్నది



ఏమిటీ ఈ అవతారం ఎందుకు ఈ సింగారం

No comments: