Thursday, July 14, 2011

డాక్టర్ . చక్రవర్తి



చక్కటి అమ్మాయి . ఆ అమ్మాయికి పతియే ప్రత్యక్ష దైవం . ఇల్లే స్వర్గం . సాహిత్యమంటే అభిరుచి . కథలు వ్రాసి పత్రికలకు పంపుతూ వుంటుంది . రుచిగా వంట చేసి భర్తకు వడ్డిస్తుంది . అందమైన పేంటింగ్స్ వేసి ఇంటిని అలంకరిస్తుంది . సాహిత్యమే కాదు సంగీతమన్నా ప్రేమే . మధురంగా పాడగలదు . ఇన్ని మంచి అలవాట్లున్న అమ్మాయంటే భర్త కు ప్రాణం కావాటం సహజమే కదా ! చల్ల చల్ల గా సాగిపోతున్న వారి జీవితాలలోకి అబ్బాయి స్నేహితుడు డాక్టర్ వస్తాడు . ఆ డాక్టర్ చనిపోయిన తన ప్రాణపదమైన చెల్లెలిని ఈ అమ్మాయిలో చూసుకొని మురిసిపోతూ వుంటాడు . ఇంకేముంది ఆ డాక్టర్ భార్య కు అసూయ భగ్గుమంటుంది . అతని చెల్లెలి చివరి కోరిక మీదే తనను పెళ్ళి చేసుకున్నాడని మర్చిపోతుంది . అంతే కాంప్ కు వెళ్ళిన అబ్బాయికి అతని భార్య డాక్టర్ తో ప్రేమ కలాపాలతో మునిగిపోయింది అని వుత్తరం రాస్తుంది . అంతే కాదు ఆ అమ్మాయి భర్త కోసమని రాసుకున్న పాటను డాక్టర్ కోసమని రాసుకుందని ఆ కాగితమూ పంపుతుంది . అంతగా ప్రేమించిన భార్యను ఆ ఒక్క వుత్తరం తోనే అనుమానిస్తాడు ఆ అబ్బాయి . భార్యను పుట్టింటికి పంపేసి , తాగుతూ వుంటాడు . స్చప్ . . .


ఏమిటిది అంటే ఇది , ఈ రోజు నేను చూసిన డాక్టర్. చక్రవర్తి సినిమా కథ . సినిమా అంతా నాకు నచ్చింది కాని , అంతగా ప్రేమించిన భార్యను ఒకే ఒక వుత్తరం తో అనుమానించటం నాకు నచ్చలేదు . సరే చక్రవర్తి అర్ధరాత్రి , మాధవిని చూసేందుకు వాళ్ళ ఇంటికి రావటము కూడా ఒక కారణం అనుకోండి . పాట మాధవి చేతి రాతతో వుండటమూ ఇంకో కారణం . కాని ఎన్ని కారణాలు చెప్పినా అది మగవాడిని అనే అహంభావం , అతని మూర్ఖత్వం అనిపించింది . ఇంకేదైనా బలమైన కారణం చూపించాల్సింది .

దీనిలో చక్రవర్తి ని చాలా ఉదాత్తం గా చూపించే ప్రయత్నం చేసారు . చెల్లెలి మీద ప్రేమ తో నిర్మలను వివాహం చేసుకోలేక , ప్రేమించిన శ్రీదేవిని వదులుకోలేక తల్లడిల్లే సమయం లో సవితి చెల్లెలి మీద ప్రేమ చాలా బాగా వ్యక్తీకరించాడు . అన్నయ్య చదివించి , ఆ చదువు మధ్యలో ఆగకూడదని తనకు వచ్చిన లంగ్ కాన్సర్ గురించి అన్నకు చెప్ప కుండా దాచటము , అన్నయ్య కోసం ఎదురు చూడటము అన్నీ ఆ అన్నా చెల్లెళ్ళ ప్రేమను బాగా చూపిస్తాయి . అన్నా చెల్లెళ్ళు అంటే ఇలా వుండాలి అనిపించేట్లుగా వుంది . అదే చెల్లెలి ని మాధవి లో చూసుకుంటూ భార్య అసూయను గ్రహించలేక పోతాడు . అదే అన్నిటి కీ మూలమైంది .

కోడూరి కౌసల్యా దేవి వ్రాసిన " చక్రభ్రమణం " నవల ఆధారం గా అన్నపూర్ణా పిక్చర్స్ లో , డి మధుసూధన రావు , ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం లో 1964 లో నిర్మించిన అన్నపూర్ణావారి మరో ఆణిముత్యం లాంటి సినిమా " డాక్టర్ . చక్రవర్తి " . ఇది అక్కినేని నాగేశ్వరరావు , జగ్గయ్య , సావిత్రి ల టీం తో వచ్చిన చక్కటి కుటుంబకథా చిత్రం ఇది . దీనిలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం , భార్యా భర్తల అనురాగం చక్కగా చూపించారు . చెల్లెళ్ళ మీద ప్రేమ తో తనను భర్త నిర్లక్షం చేసాడని నిర్మల అసూయపడటము సహజం గా నే అనిపించింది .

నవలను సినిమా అనుకరణ చేసింది గొల్లపూడి మారుతీ రావు . మాటలు వ్రాసింది ఆచార్య ఆత్రేయ . పాటలు వరాసింది ఆత్రేయ, దాశరధి , శ్రీశ్రీ , ఆరుద్ర. పాడింది పి. సుశీల , ఘంటసాల , జానకి , పి.బి శ్రీనివాస్ , మాధవపెద్ది , వసంత .
ఇందులోని పాటలన్నీ జాదరణ పొందాయి . మరి విందామా/ చూద్దామా !!!!!

ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక



పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా , నేనే పరవశించి పాడనా



పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా కృష్ణా పదుగురెదుట పాడనా





మనసున మనసై , బ్రతుకున బ్రతుకై తోడొకరుండి నా అదే భాగ్యమూ , అదే స్వర్గమూ
వహవా ఏమి పాట . ఆల్ టైం హిట్ .




నీవులేక వీణా పలుకలేనన్నదీ నీవు రాక రాధా నిలువలేనన్నదీ . . .
మా ఫ్రెండ్ కు ఈ పాట చాలా ఇష్టం :)




నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళా నీ కెలాగుంది ఈ వేళా




ఉంగరాల గుగురున్న రాజా నీ హంగు చూసి పొంగిపోనురా

2 comments:

రవికిరణ్ పంచాగ్నుల said...

మంచి చిత్రాన్ని పరిచయం చేసారు. మా ఇంట్లో తరచుగా ప్రదర్శించబడే చిత్రం ఇది.

"నీవు లేక వీణా".. ఈ పాట అద్భుతం.

మీ ముందస్తు అనుమతిలేకుండా, మీ "తోడికోడళ్లు" చిత్రం టపా లింకుని నా బ్లాగులో వాడాను. క్షమించగలరు. అభ్యంతరమైతే తొలగించగలవాడనని మనవి.

మాలా కుమార్ said...

రవి కిరణ్ గారు ,
మీ కామెంట్ కు థాంక్స్ అండి .