Friday, September 23, 2011

విచిత్రబంధం



అన్నపూర్ణ వారు 1972 లో , యద్దనపూడి సులోచనారాణి నవల " విజేత " ఆధారం గా తీసిని సినిమా " విచిత్రబంధం" . నవల 1947 లో స్వాతంత్రం వచ్చిన తరువాత , జైల్ లో వున్న స్వాతంత్ర్యసమరయోధులను విడుదలచేయటము తో మొదలవుతుంది . విడుదలైన ఖైదీ , మాధవ్ తనవారిని కలుసుకోవాలని ఆత్రుతతో ఇంటికి జీపు లో వెళుతుండగా దారిలో ఓ కోచ్ బురదలో కూరుకుపోయి కనిపిస్తుంది . దానిని పైకి లేపేందుకు జీప్ డ్రైవర్ తో పాటు మాధవ్ కూడా కోచ్మాన్ కు సాయపడుతాడు . అప్పుడే ఆ కోచ్ లో ప్రయాణిస్తున్న అమ్మాయి తో అనుకోకుండా గొడవ అవుతుంది . ఆ తరువాత మాధవ్ ఇంటికి వెళ్ళటము , అక్కడ తల్లి మరణించింది అని తెలుసుకోవటం , తను ప్రేమించిన సుధ కు పెళ్ళైందని తెలవటం జరుగుతాయి . ఆ విచారం లో వస్తున్న మాధవ్ కు అనుకోని విధం గా ట్రేన్ లో కోచ్ అమ్మాయి కనిపిస్తుంది . ఆ అమ్మాయిని చిలిపిగా ఆటపట్టించటం లో తనమీద అత్యాచారం చేస్తాడు మాధవ్ . జేల్ లో కలిసిన రామగోపాలరావుగారు ఆస్తి మాధవ్ కు వ్రాయటం తో , ఆయనకు పల్లెటూరిలో వున్న ఇల్లు చూద్దామని వచ్చిన మాధవ్ కు ఆ అమ్మాయి , రజాకార్ మూమెంట్ లో తండ్రి చనిపోగా ఆర్ధికం గా చితికిపోయి , తమ్ముడు కుంటివాడై , ఆ పల్లెటూరిలో చిన్న తోటలో కాయగూరలు పండించుకుటూ కనిపిస్తుంది . తన పేరు సంద్య అని తెలుసుతుంది . సంద్య తమ్ముడు వాసు తో స్నేహంగా వుండి , వాసు కాలు బాగు చేయిస్తాడు మాధవ్ . అప్పుడే సంద్య కు బాబు పుట్టినట్లు తెలుస్తుంది . సంద్య కు తప్పని సరై మాధవ్ ఇంట్లో ఆశ్రయం పొందాల్సి వస్తుంది . మాధవ్ బాబు ను ఇంటికి తీసుకొని వస్టాడు . ఇంక ఏముంది , యద్దనపూడి స్టైల్ లో మాధవ్ సంద్య కు దగ్గర ఆయేందుకు ప్రయత్నిచటం , సంధ్య కు కోపం , అష్యం రావటం ఇలా బోలెడు మలుపులు తిరిగి , మాధవ్ సంద్యకు ఓ లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం , ఆ లెటర్ చూడకుండానే సంధ్య కు అసలు విషయం తెలిసి సంధ్య , మాధవ్ లు కలవటం తో నవల ముగుస్తుంది .

1947 తో మొదలు పెడితే ఎవరూ చూడరనుకున్నారో ఏమో , సినిమా కాలేజ్ లైఫ్ తో మొదలవుతుంది . రాజబాబు ( సినిమాలో పేరు ఇందాకే చూసాను కాని మర్చిపోయాను :)) , లవ్ లెటర్ ఇస్తే సంధ్య ( వాణిశ్రీ ) చెంపదెబ్బ కొట్టటమే కాకుండా , ప్రిన్స్ పాల్ కు రిపోర్ట్ చేస్తుంది . చెంపదెబ్బ కొట్టి మరీ సస్పెండ్ చేయించినందుకు మాధవ్( అక్కినేని ) సంధ్య తో రాజబాబు కు సారీ చెప్పిస్తాడు . అది మనసులో పెట్టుకొని మాధవ్ ను ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి తండ్రి తో చివాట్లు పెట్టిస్తుంది . అందుకని సంధ్య మీద కోపం తెచ్చుకొని , ఆమెకు బుద్ది చెప్పాలని మాయోపాయం తో ఆమెను గెస్ట్ హౌస్ కు తీసుకెళ్ళి అత్యాచారం చేస్తాడు మాధవ . కావాలని కాదు పాపం అనుకోని పరిస్తితులలో అనుకోకుండా జరిగిపోతుందన్నమాట ! ఆ తరువాత సంధ్య తండ్రికి ( యస్. వి రంగారావు ) వ్యాపారం లో మేనేజర్ ( గుమ్మడి ) నష్టం వస్తుంది . పైగా సంధ్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది . మానేజర్ , ఆత్మహత్య అనేట్లుగా ఆయనని హత్య చేయిస్తాడు . సంధ్య , తన అత్తయ్య తో , కుంటి తమ్ముడు వాసు తో పల్లెటూరి లో కూరగాయలు పండించుకుంటూ వుంటుంది . ఇక్కడి నుంచి ఇంచుమించు నవల లాగే వుంటుంది సినిమా.

నేను ఇప్పటి వరకు చూసిన అన్నపూర్ణా వారి చిత్రాలలో నాకు నచ్చనిది ఈ సినిమానే ! కాలేజ్ లో వాణిశ్రీ ది , అక్కినేనిది పాత్రల ప్రవర్తన చాలా ఓవర్ గా వుంటుంది . చాలా అతి అనిపించింది . లవ్ లెటర్ ఇవ్వటం తప్పుకాదన్నమాట . దండించటమే తప్పు అన్నట్లుగా మాధవ్ , సంధ్య తో క్షమార్పణ చెప్పించటమూ , దానికి ఆమె కక్షపెట్టుకొని మాధవ్ ను అవమానపరచటము బాగా అనిపించలేదు . అక్కినేని , వాణిశ్రీ ఇద్దరూ చాలా ఏజ్డ్ గా వున్నారు . కాలేజ్ స్టూడెంట్స్ గా అస్సలు బాగాలేరు . ఇహ సెకండ్ ఆఫ్ లో కొంచం పరవాలేదు . సినిమా కొంచం చూడవచ్చు . అదీ కష్టపడి . నాకైతే చాలా బోర్ కొట్టింది .
సెక్రెట్రీ , విచిత్రబంధం చూసాక అక్కినేని ని నవలానాయకుడు అని , వాణిశ్రీ ని నవలానాయిక అని ఎలా అన్నారో అర్ధం కాలేదు . యద్దనపూడి వర్ణనల కూ వాళ్ళకూ ఏమాత్రం పోలిక లేదు . రెండు సినిమాలూ నాకు నచ్చలేదు .
పాటలు పరవాలేదు . ఓమోస్తరుగా వినటానికి వీలుగానే వున్నాయి .
డి. మధుసూధనరావు నిర్మించిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు .
సంగీతం; కే. వి . మహదేవన్
సహాయకుడు ; పుహళేంది .
గాయకులు ;
పి. సుశీల ,
ఘంటసాల .
రామకృష్ణ .

వయసే వొక పూల తోట ,
వలపే వొక పూల బాట ,
ఆ తోటలో ఆ బాటలో ,
పాడాలి తీయని పాట.


చిక్కావు చేతిలో చిలకమ్మా ,
నీవు ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా !

చీకటి వెలుగుల రంగేళీ ,
జీవితమే ఒక దీపావళి ,
మన జీవితమే ఒక దీపావళి .
అందాలప్రమిదల ఆనందజ్యోతుల
ఆశల వెలిగించు దీపాలవెల్లి .

చీకటివెలుగు రంగేళి ,
జీవితమే ఒక దీపావళి ,
మన జీవితమే ఒక దీపావళి .
చీకటివెలుగుల రంగేళి ,
జీవితమే ఒక దీపావళి ,
ఈ జీవితమే ఒక దీపావళి ,
అందాల ప్రమదల ఆనంద జ్యోతుల ,
అణగార్చి తెలవారు అమవాసరేయి .

భాగ్యనగరం బుర్రకథ

చల్లని బాబూ నా అల్లరి బాబు
నా కంటిపాపవు నీవే మా ఇంటి దీపం నీవే

అమ్మా అమ్మా అని పిలిచావు
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేసావు .
ఏ తల్లి కన్న బాబువో
నా కాళ్ళకు బంధం అయ్యావు .

No comments: