అన్నపూర్ణా వారిసినిమాల లిస్ట్ లో చివరగా వుంది "అమెరికా అబ్బాయి ." దీని నిర్మాత డి . మధుసూధన రావు . డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు . రాధిక , అశ్విని , రాజశేఖర్ , చరణదాస్ మాస్టర్.శ్రావణ్ శంకర్ మొదలైన వారు నటీ నటులు . కథ. జీడిగుంట రామచంద్ర మూర్తి . ఇహ కథేమిటంటే జ్యోత్స్న ( అశ్విని ) అమెరికా లో డాక్టర్ . ప్రాణ స్నేహితురాలు శారద ( రాధిక ) కొడుకును పెంచుకుంటూ వుంటుంది . శారద పెళ్ళి కాగానే భర్త మరణిస్తాడు . కొడుకును అశ్విని కి ఇచ్చి , చరణదాస్ ను మళ్ళీ పెళ్ళాడుతుంది . శారద తండ్రి రాజారావు ( గుమ్మడి ) ఆస్తంతా మనవడు రాజా పేరు మీద రాస్తాడు . రాజారావు ట్రీట్మెంట్ కొరకు అమెరికా వస్తారు . ఆ తరువాత కథేమిటంటే నాకు తెలియదు . ఎందుకంటే నా సి . డి ఆ తరువాత ఇహ పనిచేయనని మొరాయించింది ! ఈ చిత్రము లోని పాటలు పి. సుశీల . యస్.పి బాలసుబ్రమణ్యం పాడారు . సంగీతం రాజేశ్వర రావు . ఇందులోని పాటలు కూడా నెట్ లో ఎక్కడా దొరకలేదు :) ఇదో ఈ పాట వక్కటే దొరికింది . విని , చూసి ఆనందించండి .
ఫ్రెండ్స్ తో కలిసి 'రాధాకృష్ణ ' సినిమా ను మొదటి సారిగా చూసాను . ఆ రోజు థియేటర్ లో అంతా స్టూడెంట్సే వున్నారు .సినిమా మొదలైన కొద్ది సేపటికే జయప్రద కనిపించగానే జాంపండూ అని , శోభన్ బాబు కనిపించగానే మొద్దబ్బాయ్ అని వకటే అరుపులు కేకలు . ఆపైన ఈలలు . సినిమా ఏమి చూసామో కాని ఈ అల్లరి అంతా ఎంజాయ్ చేసాము . మేమూ కాస్త అల్లరి చేసామనుకోండి :) ఏమిటో ఆ టైం అలాంటిది :) ఈ పరిచయం రాసేందుకు ఈ రోజు మళ్ళీ చూసాను . షావుకారు కోదండరామయ్య గారి ఏకైక ముద్దుల కూతురు రాధ ( జయప్రద ) . ఆయన పాలేరు రంగయ్య కొడుకు కృష్ణ ( శోభన్ బాబు ) . చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు . కృష్ణ కు చదువంటే ఇష్టం లేదు . బడి కి వెళ్ళేందుకు చాలా గొడవచేసేవాడు . రాధ పుట్టినరోజున రాధను ఉయ్యాల వూపుతూ కింద పడేస్తాడు . భయము తో ఇంట్లో నుంచి పారిపోతాడు . బి.య.సి పాసై వూరికి తిరిగి వస్తాడు . డాక్టర్ చదువుకొని తన వూరిలోనే హాస్పెటల్ కట్టించాలి అని ఆశిస్తాడు . కృష్ణ చదువుకు కావలసిన ధన సహాయము చేస్తుంది రాధ . పాలేరు కొడుకు కు ఇచ్చి పెళ్ళిచేయటానికి ఇష్టపడని తండ్రి బలవంతము తో శివం ను పెళ్ళి చేసుకుంటుంది రాధ . అత్తవారింట్లో కష్టాలు పడుతుంది . ఇల్లు గడిచేందుకు డాన్స్ చేసి సంపాదిస్తూవుంటుంది . బందువుల కుతంత్రము తో భర్తను కోల్పోతుంది . కృష్ణ ఆమె ఇబ్బందులు చూడలేక తన చదువు కు ఇచ్చిన డబ్బును తిరిగి ఇస్తాడు . పై చదువులకై విదేశానికి వెళుతాడు . తిరిగి వచ్చేసరికి రాధ భర్త ను కోల్పోయి ఎక్కడవుందో తెలీదు . వూరిలో ఆసుపత్రి కట్టించి అక్కడకు వెళ్ళగ అక్కడ నర్సు గా రాధ కనిపిస్తుంది . ఆమెను పెళ్ళి చేసుకుంటాడు . క్లుప్తము గా కథ ఇది . ఈ సినిమా అన్నపూర్ణావారు 1978 లో యద్దనపూడి నవల " రాధాకృష్ణ " అధారము గా నిర్మించారు . దీనికి దర్శకుడు కె. రాఘవేంద్రరావు . సినామా టైల్స్ వేసేటప్పుడు " వాతాపి గణపతిం భజే " అనే చక్కటి కీర్తనను బాక్ గ్రౌండ్ గా వినిపించారు . అది చాలా ఆహ్లాదముగా అనిపించింది . జయప్రద చాలా చక్కగా వుంది . డాన్స్ లు కూడా బాగా చేసింది . శోభన్ బాబు అందాల నటుడు . ఇక చెప్పేందుకు ఏముంది . కలవారి అమ్మాయికి కూడా కష్టాలు తప్పవా అనిపించింది . వంశ గౌరవమూ , ప్రతిష్ఠ అనే చక్రం లో బంధీలు పాపం . సినిమా అంతా చాలా నీట్ గా బాగుంది . కలర్ కాకుండా బ్లాక్ అండ్ వైట్ అవుతే ఇంకా బాగుండేదేమో ! ఇక సినిమా చూడండి ;
కొంతమంది ఆడపిల్లలు ఏవో అందలాలు ఎక్కుదామని వూహలల్లుకుంటారు . తమ అందం మీద నమ్మకం తో , గర్వం తో జీవితాన్ని ఆటగా భావిస్తారు .స్వేచ్చ పేరిట సంకెళ్ళు తెంచుకున్నాం అనుకుంటారే తప్ప జీవించటానికి విలువైన ఆధారం వదిలేసుకుంటున్నాం అనుకోరు .చివరికి వీళ్ళు కోరుకున్న సుఖమూ దక్కదు , ఎవరి సానుభూతీ వుండదు . అలా తన జీవితాన్ని తెగినగాలిపటం లా చేసుకొని , నాశనం చేసుకున్న అమ్మాయి ప్రేమలత. తండ్రి గారాబము తో , ఇచ్చిన స్వేచ్చను దుర్వినియోగం చేసుకుంది . మదన్ చేతి లో కీలుబొమ్మగా మారింది . మదన్ సుజాత మీద మోజు పడుతున్నాడని అతని కి , తన ప్రాణ మిత్రురాలైన సుజాతను పరిచయం చేస్తుంది . అతని మాయ మాటలకు మోసపోయి , అతనిని ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకుంటుంది సుజాత . పెళ్ళి కి రెండురోజులు ముందుగా మదన్ అసలు స్వరూపం తెలుసుకొని , పెళ్ళిని వద్దనుకొని ధైర్యంగా అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది . అక్క సహాయం తో రవి ని పెళ్ళి చేసుకొని , తన జీవితాన్ని చక్కదిద్దుకుంటుంది సుజాత . ఈ ఇద్దరు అమ్మాయిల కథే యద్దనపూడి సులోచనా రాణి వ్రాసిన నవల కథ " ప్రేమలేఖలు ." ఈ నవల ఆధారం గా అన్నపూర్ణా పిక్చర్స్ వారు 1977 అదేపేరు తో సినిమా తీసారు . ఇందులో సుజాత గా జయసుధ , ప్రేమలతగా దీప నటించారు . 'విచిత్రబంధం' . ' బంగారు కలలు ' సినిమాలని రంగులలో తీసినా ప్రేమలేఖలు బ్లాక్ అండ్ వైట్ లోనే తీసారు. నవల కథను , సంఘటనలను ఎక్కువగా మార్చలేదు . సెకండ్ ఆఫ్ లో కొద్దిగా మార్చారు . ఆ మార్చింది కూడా బాగుంది . ఇప్పటి వరకూ అన్నపూర్ణావారి సినిమాలలో హీరో గా నాగేశ్వరరావు వున్నా , ఇందులో మురళీమోహన్ హీరొ . హీరో , హీరోయిన్ గా మురళీమోహన్ , జయసుధ చక్కగా వున్నారు .అదికాదు విశేషం , మదన్ గా అనంతనాగ్ , ప్రేమలత గా దీప బాగా అమిరిపోయారు .సినిమా కూడా అన్నపూర్ణావారి స్టాండర్డ్ కు తగ్గట్లు నీట్ గా వుంది . ఈ సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు . ఈ సినిమా టైం కు హీరోయిన్ బొడ్డును చూపించటం ఇంకా మొదలుపెట్టనట్లున్నారు , అలాంటి సీనులేవీ లేవు :) ఈ సినిమా పాటలు కూడా బాగున్నాయి . గీత రచయితలు , శ్రీశ్రీ , కొసరాజు , ఆరుద్ర , దాశరధి , గోపి . సంగీతం - సత్యం , సహాయకులు శ్యాం . గాయనీ గాయకులు ; పి. సుశీల , వాణీజయరాం , యస్. పి బాలసుబ్రమణ్యం వి. రామకృష్ణ . ఇది తీయని వెన్నెలరేయి , మది వెన్నెలకన్నా హాయి నా వూహలు జాబిలి కురిపించెను ప్రేమలేఖలు .
విన్నానులే పొంచి విన్నానులే , ఏమని ? ఒక అమ్మాయి అమ్మ అవుతుందని ఈ అబ్బాయి నాన్న అవుతాడని .
ఈ రోజు మంచి రోజు , మరుపురానిది , మధురమైనది మంచి తనం వుదయించిన రోజు ఈ రోజు మంచి రోజు , మరుపురానిది , మధురమైనది , ప్రేమ సుమం వికసించిన రోజు .
ఈ అందం , ఈ పరువం , నాలో దాచుకో , కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో .
ఆ కాలపు బొమ్మను కాను , ఈ కాలపు పిల్లను నేను , అన్యాయాన్ని ఎదిరిస్తాను . అనుకున్నది సాదిస్తాను .
ఈ నాటి విడరాని బంధం ,మనకేనాడో వేసాడు దైవం ఈ నాటి విడరాని బంధం నేనాడో చేసిన పుణ్యం .
యద్దనపూడి నవల " బంగారు కలలు " అధారం గా అన్నపూర్ణావారు 1974 లో నిర్మించిన చిత్రం " బంగారు కలలు " . ఇందులో రవి ( ఏ. నాగేశ్వరరావు ) , సరోజ ( వహీదరెహ్మాన్ ) వీరిద్దరె ముఖ్య పాత్రదారులు . యవ్వనం లో వున్న ఓ అమ్మాయి , ఓ అబ్బాయిని నమ్మి , అతని గురించి పూర్తిగా తెలుసుకోక , అతని తో వెళ్ళిపోతే ఆమె కన్న బంగారుకలలు ఎలా నాశనమవు తాయో చూపటమే ఇందులోని ంఖ్యాంసం . ఎంత చదువుకున్నా , తెలివి కలదైనా అమ్మాయికి నా అనే వారి అండ చాలా ముఖ్యం ! సరోజ పురుషొత్తమ్రావు గారి అండలో పెరుగుతూ వుంటుంది . శేషు మాటలు నమ్మి అతనితో లేచిపోతుంది . కొన్ని రోజుల తరువాత అతని నిజ స్వరూపం తెలుసుకొని ఇంటిలో నుంచి వెళ్ళిపోతుంది . సేవాసదన్ లో చేరి నాట్యం నేర్చుకుంటుంది . హోటల్ లో ప్రదర్షనలు ఇస్తూవుంటుంది . అలా హోటల్ లోనే రవి ఆమెను చూస్తాడు . ఆమె కథ తెలుసుకొని ఆదరిస్తాడు . ఆమె కూతురి కి తండ్రిని అని చెప్పి స్కూల్ లో చేరుస్తాడు . సరోజ ప్రసాద్ దగ్గర నర్స్ గా చేరుతుంది . ఇదంతా రవి ప్రేమించిన జ్యోతి అపార్ధం చేసుకుంటుంది . దుర్వ్యసనాల తో జేల్ కు వెళ్ళిన శేషు , జే నుంచి తిరిగి వచ్చి , సరోజ గురించి తెలుసు కుంటాడు . సరోజను వేదిస్తూ వుండగా చూసిన పురుషోతం అతనిని చంపేస్తాడు . తండ్రి నేరం తన మీద వేసుకొని జేల్ కు వెళుతాడు రవి . కోర్ట్ కు వచ్చి , సరోజ తన కూతురని , ఆ సంగతి లోకం నుంచి దాచానని , రవి కి మాత్రం చెప్పానని , సరోజను శేషు చంప బోతుండగా తనే హత్య చేసానని చెప్పి చనిపోతాడు . రవి , జ్యోతి పెళ్ళి చేసుకుంటారు . సరోజ నర్స్ గానే కొనసాగాలని నిర్ణయించుకుంటుంది . ఈ సినిమా నిర్మాత డి . మధుసూధన రావు . దర్శ్కుడు ; ఆదుర్తి . సుబ్బారావు .
సంగీత దర్శ్కుడు ; యస్. వి రాజేస్వర రావు . గాయనీ గాయకులు ; పి. సుశీల , ఘంటసాల, రామకృష్ణ , పిఠాపురం , మాధవపెద్ది , రఘురాం .
చెక్కిలిమీద కెంపులు మెరిసే చిలకమ్మా
పుట్టిన రోజు జేజేలు చిట్టిపాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి . ఈ పాట చాలా పాపులర్ ఐంది . ఎవరి పుట్టిన రోజన్నా ఈ పాట ముందు గుర్తొస్తుంది .
సిగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా , ఇది టైటిల్ సాంగ్ . ఈ పాట్ కూడా బాగుంటుంది . వహీదా డాన్స్ కూడా బాగా చేసింది . కాని వహీదా డ్రెస్ , మేకపే అంత నచ్చలేదు నాకు ! అసలు ఈ సినిమా లో వహీదా కొంచ ఏజ్డ్ గా అనిపించింది .
నాలోనా వలపుంది నీ లోనా వయసుంది . నవల చదివి , సినిమా చూస్తుంటే , సినిమా వూహించినట్లు వుండకుండా నిరాశ కలుగు తోంది . అందుకే ఈ సారి నవల చదవకుండా నే సినిమా చూసాను . రంగులు కొంచం డార్క్ గా వున్నాయి . నాగేశ్వరరావు , వహీదా కొంచం ఏజ్డ్ గా అనిపించారు . అన్నట్లు కాంతారావు ఇందులో నాగేశ్వర రావు మామగారు :) కాని సినిమా పరవాలేదు . ఓకే చూడవచ్చు :)
అన్నపూర్ణ వారు 1972 లో , యద్దనపూడి సులోచనారాణి నవల " విజేత " ఆధారం గా తీసిని సినిమా " విచిత్రబంధం" . నవల 1947 లో స్వాతంత్రం వచ్చిన తరువాత , జైల్ లో వున్న స్వాతంత్ర్యసమరయోధులను విడుదలచేయటము తో మొదలవుతుంది . విడుదలైన ఖైదీ , మాధవ్ తనవారిని కలుసుకోవాలని ఆత్రుతతో ఇంటికి జీపు లో వెళుతుండగా దారిలో ఓ కోచ్ బురదలో కూరుకుపోయి కనిపిస్తుంది . దానిని పైకి లేపేందుకు జీప్ డ్రైవర్ తో పాటు మాధవ్ కూడా కోచ్మాన్ కు సాయపడుతాడు . అప్పుడే ఆ కోచ్ లో ప్రయాణిస్తున్న అమ్మాయి తో అనుకోకుండా గొడవ అవుతుంది . ఆ తరువాత మాధవ్ ఇంటికి వెళ్ళటము , అక్కడ తల్లి మరణించింది అని తెలుసుకోవటం , తను ప్రేమించిన సుధ కు పెళ్ళైందని తెలవటం జరుగుతాయి . ఆ విచారం లో వస్తున్న మాధవ్ కు అనుకోని విధం గా ట్రేన్ లో కోచ్ అమ్మాయి కనిపిస్తుంది . ఆ అమ్మాయిని చిలిపిగా ఆటపట్టించటం లో తనమీద అత్యాచారం చేస్తాడు మాధవ్ . జేల్ లో కలిసిన రామగోపాలరావుగారు ఆస్తి మాధవ్ కు వ్రాయటం తో , ఆయనకు పల్లెటూరిలో వున్న ఇల్లు చూద్దామని వచ్చిన మాధవ్ కు ఆ అమ్మాయి , రజాకార్ మూమెంట్ లో తండ్రి చనిపోగా ఆర్ధికం గా చితికిపోయి , తమ్ముడు కుంటివాడై , ఆ పల్లెటూరిలో చిన్న తోటలో కాయగూరలు పండించుకుటూ కనిపిస్తుంది . తన పేరు సంద్య అని తెలుసుతుంది . సంద్య తమ్ముడు వాసు తో స్నేహంగా వుండి , వాసు కాలు బాగు చేయిస్తాడు మాధవ్ . అప్పుడే సంద్య కు బాబు పుట్టినట్లు తెలుస్తుంది . సంద్య కు తప్పని సరై మాధవ్ ఇంట్లో ఆశ్రయం పొందాల్సి వస్తుంది . మాధవ్ బాబు ను ఇంటికి తీసుకొని వస్టాడు . ఇంక ఏముంది , యద్దనపూడి స్టైల్ లో మాధవ్ సంద్య కు దగ్గర ఆయేందుకు ప్రయత్నిచటం , సంధ్య కు కోపం , అష్యం రావటం ఇలా బోలెడు మలుపులు తిరిగి , మాధవ్ సంద్యకు ఓ లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం , ఆ లెటర్ చూడకుండానే సంధ్య కు అసలు విషయం తెలిసి సంధ్య , మాధవ్ లు కలవటం తో నవల ముగుస్తుంది .
1947 తో మొదలు పెడితే ఎవరూ చూడరనుకున్నారో ఏమో , సినిమా కాలేజ్ లైఫ్ తో మొదలవుతుంది . రాజబాబు ( సినిమాలో పేరు ఇందాకే చూసాను కాని మర్చిపోయాను :)) , లవ్ లెటర్ ఇస్తే సంధ్య ( వాణిశ్రీ ) చెంపదెబ్బ కొట్టటమే కాకుండా , ప్రిన్స్ పాల్ కు రిపోర్ట్ చేస్తుంది . చెంపదెబ్బ కొట్టి మరీ సస్పెండ్ చేయించినందుకు మాధవ్( అక్కినేని ) సంధ్య తో రాజబాబు కు సారీ చెప్పిస్తాడు . అది మనసులో పెట్టుకొని మాధవ్ ను ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి తండ్రి తో చివాట్లు పెట్టిస్తుంది . అందుకని సంధ్య మీద కోపం తెచ్చుకొని , ఆమెకు బుద్ది చెప్పాలని మాయోపాయం తో ఆమెను గెస్ట్ హౌస్ కు తీసుకెళ్ళి అత్యాచారం చేస్తాడు మాధవ . కావాలని కాదు పాపం అనుకోని పరిస్తితులలో అనుకోకుండా జరిగిపోతుందన్నమాట ! ఆ తరువాత సంధ్య తండ్రికి ( యస్. వి రంగారావు ) వ్యాపారం లో మేనేజర్ ( గుమ్మడి ) నష్టం వస్తుంది . పైగా సంధ్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది . మానేజర్ , ఆత్మహత్య అనేట్లుగా ఆయనని హత్య చేయిస్తాడు . సంధ్య , తన అత్తయ్య తో , కుంటి తమ్ముడు వాసు తో పల్లెటూరి లో కూరగాయలు పండించుకుంటూ వుంటుంది . ఇక్కడి నుంచి ఇంచుమించు నవల లాగే వుంటుంది సినిమా.
నేను ఇప్పటి వరకు చూసిన అన్నపూర్ణా వారి చిత్రాలలో నాకు నచ్చనిది ఈ సినిమానే ! కాలేజ్ లో వాణిశ్రీ ది , అక్కినేనిది పాత్రల ప్రవర్తన చాలా ఓవర్ గా వుంటుంది . చాలా అతి అనిపించింది . లవ్ లెటర్ ఇవ్వటం తప్పుకాదన్నమాట . దండించటమే తప్పు అన్నట్లుగా మాధవ్ , సంధ్య తో క్షమార్పణ చెప్పించటమూ , దానికి ఆమె కక్షపెట్టుకొని మాధవ్ ను అవమానపరచటము బాగా అనిపించలేదు . అక్కినేని , వాణిశ్రీ ఇద్దరూ చాలా ఏజ్డ్ గా వున్నారు . కాలేజ్ స్టూడెంట్స్ గా అస్సలు బాగాలేరు . ఇహ సెకండ్ ఆఫ్ లో కొంచం పరవాలేదు . సినిమా కొంచం చూడవచ్చు . అదీ కష్టపడి . నాకైతే చాలా బోర్ కొట్టింది . సెక్రెట్రీ , విచిత్రబంధం చూసాక అక్కినేని ని నవలానాయకుడు అని , వాణిశ్రీ ని నవలానాయిక అని ఎలా అన్నారో అర్ధం కాలేదు . యద్దనపూడి వర్ణనల కూ వాళ్ళకూ ఏమాత్రం పోలిక లేదు . రెండు సినిమాలూ నాకు నచ్చలేదు . పాటలు పరవాలేదు . ఓమోస్తరుగా వినటానికి వీలుగానే వున్నాయి . డి. మధుసూధనరావు నిర్మించిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు . సంగీతం; కే. వి . మహదేవన్ సహాయకుడు ; పుహళేంది . గాయకులు ; పి. సుశీల , ఘంటసాల . రామకృష్ణ .
వయసే వొక పూల తోట , వలపే వొక పూల బాట , ఆ తోటలో ఆ బాటలో , పాడాలి తీయని పాట.
" అమ్మోవాళ్ళా , , , వాళ్ళముందుమనమెంత ?మనముచాలాఅమాయకులం , అంతతెలివిమనకెక్కడేడ్చింది ." ఇలాఅప్పుడప్పుడుకొంతమందినోటవింటూవుంటాము . నేనైతేఆమాటలువినినవ్వుకుంటాను . ఎవరికివాళ్ళుతాముచాలాఅమాయకులమని , ఎదుటివాళ్ళుగుండెలుతీసినబంట్లనిఅభిప్రాయపడుతూవుంటారు :) ఎవరూఅంతఅమాయకులేమీకాదుకదూ ! కాని 1971 లోఅన్నపూర్ణాపిక్చర్స్వారుతీసినసినిమాలోరాధమటుకుచాలాఅమాయకంగామోహన్చేతిలోరెండు సార్లు మోసపోతుంది . అమాయకురాలుసినిమాచూసినప్పుడురాధపాత్రమీదజాలివేసింది . జమీందారుభూషయ్యగారాలకూతురురాధ . మేనళ్ళుడికిఇచ్చిపెళ్ళిచేయాలనివున్నా , భార్యమాటకాదనలేకవేరేసంబందంచూస్తాడుభూషయ్య. కోర్ట్పనిమీదహైదరాబాద్వెళుతున్నభూషయ్యతోపాటువెళుతుందిరాధ . అక్కడేవున్నమోహన్నుకలుస్తుంది . కోర్ట్కేస్లోభూషయ్యఓడిపోయాడనితెలిసిఆసంబంధంవదులుకుంటారుమోహన్వాళ్ళుఅప్పటికేగర్భవతిఐనరాధనుభూసయ్యమేనల్లుడుప్రసాద్పెళ్ళిచేసుకునేందుకుముందుకువస్తాడుకానిప్రసాద్ప్రేమకథతెలిసిఇంటినుంచివెళ్ళిపోతుంది . లారీకిందపడినఆరాధనుఆలారీడ్రైవర్రక్షించితనఇంట్లోవుంచుకొనికన్నకూతురిలాచూసుకుంటూవుంటాడు . రాధకుపాపపుడుతుంది . తనమీదఅత్యాచారముచేయబోయినరౌడీనిహత్యచేసిజైలుకువెళుతుందిరాధ . రాధజాడతెలుసుకున్నప్రసాద్ , రాధపాపనుతనస్నేహితురాలికూతురనిచెప్పితీసుకొచ్చిపెంచుకుంటాడు . ఆక్రమములోప్రసాద్భార్యశోభప్రసాడ్నురాధనుఅనుమానించటము , లండన్నుంచితిరిగివచ్చినమోహన్మళ్ళీరాధనునమ్మించిచంపేయటమూ , సంగతితెలిసిశోభనిజంతెలుసుకొనిపాపనుపెంచిపెద్దచేయటముజరుగుతుంది . ఈ సినిమా నిర్మాత ; డి. మధుసూధనరావు డైరక్టర్ ; వి. మధుసూధన రావు కథ ; పిని శెట్టి శ్రీరామమూర్తి సింపుల్ గా నడి చే చక్కని కుటుంబ కథా చిత్రం ఈ సినిమా .ఇందులోని పాటలు కూడా బాగున్నాయి . నాగేశ్వరరావు , కాంచన , శారద ఇందులోని ముఖ్య నటీ నటులు . సంగీతం ; యస్. రాజేశ్వర రావు , నేపద్య గాయనీ గాయకులు ; పి. సుశీల , ఘంటసాల , బాలసుబ్రమణ్యం ఎల్ ఆర్ ఈశ్వరి , పిఠాపురం . పాడెద నీ నామమే గోపాలా , ఈ పాట రాధ పెళ్ళిచూపుల్లో పాడుతుంది . నాకు చాలా నచ్చింది .
సన్నజాజిపూవులు చందమామ కాంతులు చిన్నారి పాప నవ్వులు ఈ పాట ను మా మనవరాళ్ళు , మనవళ్ళ చిన్నప్పుడు , ఎవరికి పాడుతే వాళ్ళ పేరు పెట్టి పాడే దానిని . పిల్లలు ఈ పాటను చాలా ఎంజాయ్ చేసేవారు .
అనగనగా ఒక వూరిలో ఒక స్వాతంత్ర్య సమర యోధుడు వుంటాడు . ఆయన కొడుకు రవీంద్ర మిలిటరీ లో చేరి దేశమాత కు సేవ చేస్తూవుంటాడు . ఇంతలో చైనా తో యుద్ధం వస్తుంది . ఆ యుద్ధం లో చనిపోయిన , లేదా కంబడ కుండా పోయిన వారి లో కాప్టెన్ . రవీంద్ర పేరు కూడా వుంటుంది . తండ్రి చెల్లెలు కృఇంగిపోతారు . అక్కడ యుద్దరంగం లో నర్స్ సుశీల ప్రాణాలకు తెగించి కాప్టెన్ . రవీంద్ర ను కాపాడుతుంది . ఇద్దరూ ప్రేమించుకుంటారు . ఇంటి కి తిరిగి వచ్చిన రవీంద్ర వారి పెళ్ళి కొరకు తండ్రి అనుమతి కూడా పొందుతాడు . రవీంద్ర మేనత్త భర్త కు తన కూతురు లక్ష్మిని ఇచ్చి వివాహం చేయాలని వుంటుంది .కాని రవీంద్ర సుశీల ల పెళ్ళికి ముహూర్తము కూడా నిర్ణయింపబడటము తో వారిపై కక్ష పెంచుకుంటాడు . పెళ్ళి షాపింగ్ కని వెళ్ళి తిరిగి వస్తుండగా రవీంద్ర , సుశీల ల కార్ కు ఆక్సిడెంట్ అవుతుంది . సుశీల మరణిస్తుంది . భారతి తను ప్రేమించిన డాక్టర్ రఘు అవిటివాడని తెలుస్తుంది . ఐనా అతనినే పెళ్ళిచేసుకుంటుంది . సుశీల మరణం తో దిగులుగా వున్న రవిని దేశాటనకు తీసుకెళుతారు , రఘు , బారతి . రవి కొంత స్వాంతన చెందుతాడు . వారు బెంగుళూరు లో వుండగా సుశీల లా వున్న అమ్మాయిని టూరిస్ట్ గైడ్ గా చూస్తాడు రవీంద్ర. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించగా , ఆమె సుశీల కవల చెల్లెలు సుజాత అని తెలుస్తుంది . ఆమె తో చనువుగా తిరుగుతాడు . సుజాతను వివాహము చేసుకుంటాననగా సుజాత ఒప్పుకోదు . ఎందుకా అని మధనపడి , విషయము తెలుసుకుందామని సుజాత ఇంటికి వెళుతాడు . అక్కడ సుశీల , సుజాత లను పెంచిన వారిని కలుసుకుంటాడు . వారి అబ్బాయి రఘు తో సుజాత వివాహము , సుజాత తండ్రి చివరి దశలో నిర్ణయిము అవుతుంది . కాని రఘు చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోతాడు . కొన్ని రోజుల తరువాత సుజాత కు ఉత్తరాలు రాస్తూ వుండేవాడు . హఠాత్తుగా ఆ వుత్తరాలూ ఆగిపోతాయి . అతనేమైపోయాడో తెలీదు . కాని సుజాత అతని కొరకే ఎదురుచూస్తూవుంటుంది . రఘు తల్లి తండ్రులు , సుజాత ను రవీంద్ర తో పెళ్ళి కొరకు వొప్పిస్తారు . వారి వివాహం జరిగిపోతుంది . కాని పాకిస్తాన్ తో యుద్దము రావటము వలన వెంటనే రవీంద్ర యుద్దానికి వెళ్ళిపోతాడు . . అప్పుడే భారతి భర్త డాక్టర్ రఘు సుజాత ఇంటికి వస్తాడు . అతను సుజాతను పెంచిన వారి కొడుకని తెలుస్తుంది . రఘుకు ఆక్సిడెంట్ లో కాలు , కన్ను పోయి అవిటివాడు కాగా , మొహం చెల్లక ఇంటికి తిరిగిరాలేదని చెపుతాడు . ఇప్పుడు రవీంద్రతో సుజాత పెళ్ళి జరిగి నందుకు సంతోషించి , ఇంటికి తిరిగి వచ్చానని చెప్పాడు . యుద్దం ముగిసి రవీంద్రా తిరిగి వస్తాడు .
సినిమా దేశ భక్తి తోనూ , ప్రేమ , కొంచం సస్పెన్స్ తో వుంది . ఎక్కడా అతిగా లేకుండా నీట్ గా వుంది . కథ కూడా సాఫీగా సాగిపోతుంది . కాకపోతే రెండు విషయాలు నాకు అర్ధం కాలేదు . ఎలాగూ సుజాతకు రవీంద్ర తో పెళ్ళి జరుగుతోంది . తన పెళ్ళి భారతి తో ఐపోయింది . అలాంటప్పుడు పెళ్ళికే రావచ్చుకదా డాక్టర్ రఘు . పెళ్ళైపోయాక వచ్చి తన కాలూ , కన్నూ తీసి అమ్మ చేతిలో పెట్టే బదులు పెళ్ళికే వస్తే అంతా సంతోషించేవారుగా :)
అలాగే తండ్రి దేశద్రోహులతో కలిసి బ్రిడ్జ్ కూలగొట్టేందుకు ప్రయతిన్స్తున్నాడని లక్ష్మి కి తెలుస్తుంది . రవీంద్ర తండ్రి , లక్ష్మి పరిగెత్తుకుంటూ ఆ బ్రిడ్జ్ దగ్గరకు వస్తారు . లక్ష్మికి దెబ్బ తగులుతుంది . ఆ బ్రిడ్జ్ ను కాపేడేందుకు కాప్టెన్ రవీంద్ర కూడా వచ్చి , బాగా ఫైటింగులు చేసి కాపాడుతాడు . ఇంతకీ ఆ బ్రిడ్జ్ సరిహద్దుల్లో వుందా ? ఆంధ్రప్రదేశ్ లో వుందా ? దేశ సరిహద్దుల్లో వుంటే లక్ష్మి వాళ్ళు అక్కడికి వచ్చారా ? ఆంధ్రప్రదేశ్ లో రవీంద్ర సరిహద్దులు నుంచి అక్కడికి వచ్చాడా ? ఏమో మరి :)
యద్దనపూడి నవల " జై జవాన్ " నవల ఆధారం గా 1970 లో డి . మధుసూధనరావు నిర్మించిన అన్నపూర్ణావారి చిత్రం ఇది . నాగేశ్వర రావు , భారతి , చంద్రకళ , గుమ్మడి , జి . వరలక్ష్మి , నాగభూషణం , సూర్యకాంతం మొదలైనవారు నటించారు .
దర్శ్కత్వం ; డి . యోగానంద్ .
పాటల రచన; కొసరాజు ,దాశరధి , శ్రీశ్రీ , డా . సి నారాయణ రెడ్డి .
కొడుకు ప్రేమించిన అమ్మాయి పేదదైనా , కొడుకు ఇష్టపడ్డాడని పెళ్ళి చేస్తుంది డాక్టర్ ప్రసాద్ తల్లి . హాయిగా చిలకా గొరింకలలా కొడుకు కోడలు వుంటే ముచ్చటపడిపోతుంది . రోజులు అలా అలా హాపీగా గడిచిపోతే కథేముంది ? అందుకే , ఆ అమ్మాయి తన భర్తను చంపిన హంతకుడి కూతురని తెలిసిపోతుంది . ఇంకేముంది కోడలిని పుట్టినిటికి వెళ్ళగొట్టేదాక వూరుకోదు ఆ తల్లి . తల్లి మాట జవదాటనివాడు కొడుకు . మరి ఆ అమ్మాయి అన్న , అతను వూరుకున్నాడా ? ఎందుకు వూరుకుంటాడు ? చిన్నప్పటి నుంచి ప్రాణ పదం గా పెంచుకున్న చెల్లెలి కాపురం సరిదిద్దకుండా వూరుకోవటమే ! అందులోనూ తండ్రి నిర్దోషి అని తెలిసాక ! ఎత్తులు వేసి దోషిని పట్టించి , చెల్లెలి కాపురం సరి దిద్దాడు అన్న . ఈ కథ , అన్నపూర్ణా వారి పూలరంగడుది . ఆ చిత్రాన్నిఇక్కడ చూసి ఆనందించండి .
ఈ చిత్ర నిర్మాత డి . మధుసూధన రావు . దర్శకుడు ఆదుర్తి .సుబ్బారావు . అన్నా చెల్లెళ్ళుగా నాగేశ్వరరావు , విజయనిర్మల నటించారు . నాగేశ్వరరావు కు జోడీగా జమున నటించింది . అందాల నటుడు శోభన్ బాబు డాక్టర్ ప్రసాద్ గా ముచ్చటగా వున్నాడు . పాటల లో , చిగురులు వేసిన కలలన్ని , నీ అడుగులోన అడుగువేసి నడవనీ, నాకు నచ్చాయి .చిగురులు వేసిన కలలన్నీ పాట లో విజయనిర్మల పెట్టుకున్న ముడి పూవు అప్పుడు చాలా ఫాషనైంది . ఎక్జిబిషన్ లో కటక్ స్టాల్ లో అలాంటివి వెండిపువ్వులు అమ్మేవారు :) ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకతలు కూడా వున్నయి . అవి ఏమిటో నేను చెప్పటమెందుకు మీరే వినండి ,చూడండి .
1967లో అన్నపూర్ణా పిక్చర్స్ వారు నిర్మించిన సినిమా " సుడిగుండాలు " . ఇది పిల్లల మనస్తత్వం మీద తీసిన సినిమా . జడ్జీ చంద్రశేఖర్ రావు ( ఏ. నాగేశ్వర రావు ) భార్య పురిటిలో బాబును ప్రసవించి చనిపోతుంది . బాబును చాలా గారాబంగా క్రమశిక్షణ తో పెంచుతుంటాడు చంద్రశేఖర రావు . చంద్రశేఖర రావు చాలా దయార్ధహృదయుడు . తన వలన శిక్ష పడిన వారి కుటుంబాలను ఆదుకుంటూ వుంటాడు . రాజా స్కూల్ లో స్వాతంత్ర్యదినోత్సవం రోజున నృత్య నాటిక వేస్తారు . అందులో రాజా మహాత్మా గాంధీ వేషం వేసి మొదటి బహుమతి గెలుచుకుంటాడు .
రాజా పుట్టిన రోజున స్కూల్ పిల్లలందరినీ పార్టీ కి పిలుస్తారు . పిల్లలంతా వస్తారుకాని రాజా రాలేదు . రాత్రంతా వెతుకుతారు దొరకడు . పోలీస్ రిపోర్ట్ ఇస్తారు . ఐనా దొరకలేదు . మరి రాజా ఏమైనట్లు ? పొద్దున్నే హాస్పిటల్ లో వున్న ఆక్సిడెంట్ ఐన పిల్లవాడి ని చూడమని చంద్రశేఖర్ ను పిలుస్తారు . అతను వెళ్ళి , మా రాజా కాకూడదు అనుకుంటూ చూస్తాడు . కాని అది రాజానే ! పైగా రాజా ది ఆక్సిడెంట్ కాదని ఎవరో హత్య చేసారని చెపుతాడు ఇన్స్ పెక్టర్ . రాజా పసివాడు . అంత పసివాడిని ఎవరు హత్య చేసారు ? ఎందుకు చేసారు ? ఏమో ఇదో సినిమా పెడుతున్నాను చూసి తెలుసుకోండి . ఈ సినిమా నిర్మాత డి. మధుసూధనరావు , డైరెక్టర్స్ : ఆదుర్తి సుబ్బారావు , కె విశ్వనాథ్ , మ్యూజిక్ ; కె వి . మహదేవన్ , గాయనీ గాయకులు ; ఘంటసాల , పి. సుశీల ఈ సినిమా నంది అవార్డ్ కూడా గెలుచుకుంది . ఇంకో విశేషం , దీనిలో అక్కినేని నాగార్జున కూడా నటించాడు . ఎక్కడో సినిమా చూసి కనిపెట్టండి :
అన్నపూర్ణా వారు 1965 లో కె .విశ్వనాథ్ దర్శకత్వం లో నిర్మించిన చిత్రం " ఆత్మ గౌరవం " . అప్పటి వరకు అన్నపూర్ణా వారి సినిమాలలో అసిస్టెంట్ డైరక్టర్ గా కనిపంచిన కె.విశ్వనాథ్ పేరు ఈ సినిమాలో డైరెక్టర్ గా కనిపించింది .మరి ఆయన డరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇదేనేమో నాకు తెలియదు :)ఈ సినిమా నిర్మాత డి . మధుసూధన రావు . హీరో ఇంకెవరు ? నాగేశ్వర రావే ! హీరోయిన్ మటుకు కాంచన . ఇంకో హీరోయిన్ రాజశ్రీ . సరే రేలంగి , రమణారెడ్డి , సూర్యకాంతం , అల్లురామలింగయ్య వుండనే వున్నారు . అన్నట్లు చలం కూడా వున్నాడు . మ్య్యుజిక్ డైరెక్టర్ సాళ్ళూరి రాజేశ్వర రావు . పాడింది , ఘంటసాల , పి. సుశీల , వసంత . కథ విషయానికోస్తే :- జమీందార్ గారికి పిల్లలు లేరు . అందుకని వారి సతీమణి సంతాన లక్ష్మి తన చెల్లెలి కొడుకు వేణు ను పెంచుకుందామనుకుంటుంది . కాని జమీందార్ గారికి ఇష్టం వుండదు . వూరిలోని పొలాలు చూసుకోవటానికి వెళ్ళిన జమీందారు గారికి , ఆ పొలం కౌలుదారు రామయ్య తమ్ముడు శ్రీనివాస రావు చురుకుదనం చూసి ముచ్చటపడి దత్తత తీసుకుంటాడు . వాసు కు తోడుగా వేణు ను కూడా తెచ్చుకుంటారు . ఇద్దరినీ పట్నం లో వుంచి చదివిస్తారు . అక్కడ భజగోవిందం ( జమీందారు గారి ఫ్రెండ్ ) ఆయన కూతురు గీతను , వాసు కు ఇచ్చి పెళ్ళి జరిపిద్దామనుకుంటాడు . దానికి జమీందరు , సంతాన లక్ష్మి కూడా ఇష్టపడుతారు . వాసు మేనకోడలు సావిత్రి ని వాసుకు ఇచ్చి పెళ్ళి జరిపించాలని రామయ్య , అతని తల్లి పిల్లల చిన్నప్పటి నుంచే అనుకుంటారు . ఆ మాట వాసు ను దత్తుకు ఇచ్చే ముందే చెపుతారు . కాని జమీందారు భార్య వత్తిడి వల్లనూ , వాసు గీత ను ప్రేమిస్తున్నాడని పొరబడటం వల్లనూ సావిత్రి ని కోడలిగా చేసుకునేందుకు ఇష్టపడడు . రామయ్య భార్య పురిటిలో పిల్ల తో సహా చనిపోతుంది . ఎలాగు వాసు పెళ్ళి జరిగిపోతోంది కాబట్టి సావిత్రి కి వేరే సంబంధం ఖాయపరిచి ,ఆ సంభంధం కుదరాలంటే వారి పిచ్చి అమ్మాయిని రామయ్య పెళ్ళి చేసుకోవాలని షరుతు మీద ఆ పిచ్చి పిల్లను పెళ్ళి చేసుకుంటాడు . కాని అతని త్యాగాన్ని వేస్ట్ చేస్తు సావిత్రి చచ్చిపోతున్నానని ఉత్తరం రాసిపెట్టి , ఇంట్లోనుంచి వెళ్ళిపోతుంది . హూం . . . ఆ తరువాత సావిత్రి , గీత కార్ కింద పడటం , గీత ఆమెను రక్షించి సేవాసదనం లో చేర్చటం , గీత ఇంట్లో సావిత్రి ని చూసిన వాసు ఆమెను ప్రేమించటం , గీత సరళను అదేనండి సావిత్రి ని అపార్ధం చేసుకోవటం , వాసుకు నిజం చెప్పటం , మాయ మాట ల తో సావిత్రి ని వాసు ఇంట్లో చేర్చటం , జమీందార్ అండ్ కో ఆమెను గీత అని పొరబడటం , పెళ్ళి ఏర్పాట్లు చేయటం , ఆపైన నిజం తెలుసుకొని సావిత్రి ఇంట్లో నుంచి వెళ్ళ గొట్టటం అబ్బో ఇంకా చాలా కథ జరుగుతుంది .
సినిమా లో పాటలు పరవాలేదు బాగానే వున్నాయి . నటీ నటులూ బాగానే వున్నారు . కాని . . . . కథే మరీ . . . సాగతీతగా అనిపించింది . ఎంతసేపటికీ అవదు :) సావిత్రి రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం , సంతానలక్ష్మి చివరలో ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం పాపం . . . ప్రేక్షకుల అదృష్టం వల్ల వాళ్ళు బతికిపోయారు :) " బీదవారికి ధనం లేకపోయినా ఆత్మ గౌరవం వుంటుంది " అని రామయ్య తో ఓసారి , వాసుతో రెండు సార్లు అనిపించి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు :) ఇంకా సినిమా గురించి ఏమి చెప్తాను కాని పాటలు వినేస్తే సరి ;
చక్కటి అమ్మాయి . ఆ అమ్మాయికి పతియే ప్రత్యక్ష దైవం . ఇల్లే స్వర్గం . సాహిత్యమంటే అభిరుచి . కథలు వ్రాసి పత్రికలకు పంపుతూ వుంటుంది . రుచిగా వంట చేసి భర్తకు వడ్డిస్తుంది . అందమైన పేంటింగ్స్ వేసి ఇంటిని అలంకరిస్తుంది . సాహిత్యమే కాదు సంగీతమన్నా ప్రేమే . మధురంగా పాడగలదు . ఇన్ని మంచి అలవాట్లున్న అమ్మాయంటే భర్త కు ప్రాణం కావాటం సహజమే కదా ! చల్ల చల్ల గా సాగిపోతున్న వారి జీవితాలలోకి అబ్బాయి స్నేహితుడు డాక్టర్ వస్తాడు . ఆ డాక్టర్ చనిపోయిన తన ప్రాణపదమైన చెల్లెలిని ఈ అమ్మాయిలో చూసుకొని మురిసిపోతూ వుంటాడు . ఇంకేముంది ఆ డాక్టర్ భార్య కు అసూయ భగ్గుమంటుంది . అతని చెల్లెలి చివరి కోరిక మీదే తనను పెళ్ళి చేసుకున్నాడని మర్చిపోతుంది . అంతే కాంప్ కు వెళ్ళిన అబ్బాయికి అతని భార్య డాక్టర్ తో ప్రేమ కలాపాలతో మునిగిపోయింది అని వుత్తరం రాస్తుంది . అంతే కాదు ఆ అమ్మాయి భర్త కోసమని రాసుకున్న పాటను డాక్టర్ కోసమని రాసుకుందని ఆ కాగితమూ పంపుతుంది . అంతగా ప్రేమించిన భార్యను ఆ ఒక్క వుత్తరం తోనే అనుమానిస్తాడు ఆ అబ్బాయి . భార్యను పుట్టింటికి పంపేసి , తాగుతూ వుంటాడు . స్చప్ . . .
ఏమిటిది అంటే ఇది , ఈ రోజు నేను చూసిన డాక్టర్. చక్రవర్తి సినిమా కథ . సినిమా అంతా నాకు నచ్చింది కాని , అంతగా ప్రేమించిన భార్యను ఒకే ఒక వుత్తరం తో అనుమానించటం నాకు నచ్చలేదు . సరే చక్రవర్తి అర్ధరాత్రి , మాధవిని చూసేందుకు వాళ్ళ ఇంటికి రావటము కూడా ఒక కారణం అనుకోండి . పాట మాధవి చేతి రాతతో వుండటమూ ఇంకో కారణం . కాని ఎన్ని కారణాలు చెప్పినా అది మగవాడిని అనే అహంభావం , అతని మూర్ఖత్వం అనిపించింది . ఇంకేదైనా బలమైన కారణం చూపించాల్సింది .
దీనిలో చక్రవర్తి ని చాలా ఉదాత్తం గా చూపించే ప్రయత్నం చేసారు . చెల్లెలి మీద ప్రేమ తో నిర్మలను వివాహం చేసుకోలేక , ప్రేమించిన శ్రీదేవిని వదులుకోలేక తల్లడిల్లే సమయం లో సవితి చెల్లెలి మీద ప్రేమ చాలా బాగా వ్యక్తీకరించాడు . అన్నయ్య చదివించి , ఆ చదువు మధ్యలో ఆగకూడదని తనకు వచ్చిన లంగ్ కాన్సర్ గురించి అన్నకు చెప్ప కుండా దాచటము , అన్నయ్య కోసం ఎదురు చూడటము అన్నీ ఆ అన్నా చెల్లెళ్ళ ప్రేమను బాగా చూపిస్తాయి . అన్నా చెల్లెళ్ళు అంటే ఇలా వుండాలి అనిపించేట్లుగా వుంది . అదే చెల్లెలి ని మాధవి లో చూసుకుంటూ భార్య అసూయను గ్రహించలేక పోతాడు . అదే అన్నిటి కీ మూలమైంది .
కోడూరి కౌసల్యా దేవి వ్రాసిన " చక్రభ్రమణం " నవల ఆధారం గా అన్నపూర్ణా పిక్చర్స్ లో , డి మధుసూధన రావు , ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం లో 1964 లో నిర్మించిన అన్నపూర్ణావారి మరో ఆణిముత్యం లాంటి సినిమా " డాక్టర్ . చక్రవర్తి " . ఇది అక్కినేని నాగేశ్వరరావు , జగ్గయ్య , సావిత్రి ల టీం తో వచ్చిన చక్కటి కుటుంబకథా చిత్రం ఇది . దీనిలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం , భార్యా భర్తల అనురాగం చక్కగా చూపించారు . చెల్లెళ్ళ మీద ప్రేమ తో తనను భర్త నిర్లక్షం చేసాడని నిర్మల అసూయపడటము సహజం గా నే అనిపించింది .
నవలను సినిమా అనుకరణ చేసింది గొల్లపూడి మారుతీ రావు . మాటలు వ్రాసింది ఆచార్య ఆత్రేయ . పాటలు వరాసింది ఆత్రేయ, దాశరధి , శ్రీశ్రీ , ఆరుద్ర. పాడింది పి. సుశీల , ఘంటసాల , జానకి , పి.బి శ్రీనివాస్ , మాధవపెద్ది , వసంత . ఇందులోని పాటలన్నీ జాదరణ పొందాయి . మరి విందామా/ చూద్దామా !!!!!
" వెలుగు నీడలు " అన్నపూర్ణా వారి ఆణి ముత్యములలో వక ముత్యం . ఈ సినిమా నేను కాలేజీ లో వుండగా మారింగ్ షోలో వస్తే మా ఫ్రెండ్స్ అందరూ వళ్ళారు . నాకెందుకో ఈ సినిమా ఏడుగొట్టు సినిమా అన్న భావన వుండటం వల్ల నేను వెళ్ళ లేదు . నేను సినిమా చూసినా , నవల చదివినా చాలా లైట్ , కామిడీ వే చూస్తాను/ చదువుతాను . జీవితమన్నాక కష్టాలూ , కన్నీళ్ళూ తప్పవు అని తెలుసు . అవి సినిమాల్లో కూడా ఎందుకు చూడాలి అని నా ఫీలింగ్ :) సరే అన్నపూర్ణా వారి సినిమాలు చూసి వ్రాయటం మొదలుపెట్టాక ఆ, సీరీస్ లో వెలుగు నీడలు ఏం పాపం చేసుకుంది , దాన్నెందుకు వదిలేయాలి అని , అంతగా ఐతే కళ్ళు మూసుకొని చూద్దాములే అనుకొని ధైర్యం చేసి సి.డి పెట్టాను . కళ్ళు మూసుకునే అవసరం రాలేదు :)) అన్నపూర్ణా వారివి నేను ఇంతకు ముందు చూసిన సినిమ్మాలాగానే బాగుంది . కొంచం ఏడుపు వుందనుకోండి . ఐనా పరవాలేదు చూడవచ్చు . రావుబహుద్దూర్ వెంకట్రామయ్య ( యస్.వి . రంగారావు ) , కనకదుర్గ ( సూర్యకాంతం ) ల కు పిల్లలు లేకపోతే సుగుణ ( చిన్నప్పుడు , బేబీ శశికళ , పెద్దయ్యాక సావిత్రి ) ని పెంచుకుంటారు . చాలా గారాబం గా చూసుకుంటూ వుంటారు . వెంకట్రామయ్య ప్రెస్ ను నడుపుతుంటాడు . అందులో మేనేజర్ వెంగళప్ప ( రేలంగి ) . ఇంతలో వాళ్ళ కో పాప పుడుతుంది . దాని తో అప్పటివరకు గారాబంగా చూసుకుంటున్న సుగుణ అంటే కనక దుర్గ కు సుగుణ మీద ఆపేక్ష పోయి , ఇంటి నుంచి వెళ్ళ గొడుదామనుకుంటుంది . అందుకని వెంకట్రామయ్య సుగుణను వెంగళ్ళప్పకు అప్పగిస్తాడు . సుగుణ పెద్దదై డాక్టర్ అవుతుంది . చదువుకునే రోజులలో పరిచయమైన చంద్రం ను ప్రేమిస్తుంది . కనకదుర్గ కూతురు వరలక్ష్మి ( గిరిజ ) కు చదువు అబ్బదు . సుగుణ ట్యూషన్ చెబుతున్న అబ్బాయి మేనమామ డాక్టర్ . రఘు ( జగ్గయ్య ) సుగుణ ను పెళ్ళి చేసుకుందామనుకుంటాడు . చంద్రం కు టి. బి అని తెలుస్తుంది . రఘు ను పెళ్ళిచేసుకోమని సుగుణ ను వొప్పించి , ఇద్దరికీ పెళ్ళి జరిపించి , ఆదర్శ డాక్టర్లు గాను , ఆదర్శ దంపతులుగాను జీవించమని , దీవించి , మదనపల్లి సానిటోరియం లో చేరుతాడు . కాలక్రమేణ చంద్రం జబ్బు నయమై , ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తాడు . చంద్రం ను రిసీవ్ చేసు కునేందుకు వెళుతున్న రఘు కు ఆక్సిడెంటై చనిపోతాడు . సుగుణ పేదలకు వైద్యం చేస్తూ జీవించేందుకు నిశ్చయించుకుంటుంది . చంద్రం ను వొప్పించి వరలక్ష్మి తో వివాహం జరిపిస్తుంది . వారికి ఒక బాబు పుడతాడు . చంద్రం కు వెంకట్రామయ్య ప్రెస్ ను అప్పగిస్తాడు . చద్రం ప్రెస్ ను అభివృద్ధి లోకి తెస్తాడు . తల్లి భోధనల తో చంద్రం ను , సుగుణ ను అనుమానిస్తుంది .చంద్రం కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు . చివరకు వరలక్ష్మి నిజం తెలుసు కుంటుంది . అందరూ కలిసి హాపీగా వుంటారు . నటీ నటులందరూ యధావిధిగా బాగా నటించారు . రఘు చనిపోయాడని తెలుసుకున్నప్పుడు " నిన్ను వెలుగు లోకి పంపుతున్నానని శాశ్వ్తంగా చీకటిలోకి పంపాను . ఈ నేరం నాది సుగుణా నాది " అంటూ చంద్రం నుదుటి మీద గుప్పిట పెట్టుకొని నాగేశ్వరరావు మార్క్ డైలాగ్ చెప్పుతాడు :) అమ్మో కనక దుర్గమ్మ నోరే నోరు . బాబోయ్ ఇలాంటి నొరున్నవాళ్ళను తట్టుకోవటం కష్టమే :) సినిమా చివరలో బుడ్డోడు , చిన్న రఘు ( చంద్రం , వరలక్ష్మి ల కొడుకు ) సుగుణ దగ్గరకు తన మూడు చక్రాల సైకిల్ వేసుకొని రయ్ రయ్ మని , బండి కిందనుంచి కార్ ల పక్కనుంచి భలే వెళుతాడు :) ఇందులో కమల్ హాసన్ చిన్నప్పుడు ఏదో వేషం వేసాడని ఎక్కడో చదివిన గుర్తు . ఎక్కడా అని వెతికాను కాని తెలుసుకోలేక పోయాను . మొత్తానికి సినిమా చూడవచ్చు . పాటలలో " పాడవోయి భారతీయుడా " ఇప్పటికీ స్వాతంత్ర దినోత్సవం రోజున వినిపిస్తూనే వుంటుంది . ఈ పాటలో చెప్పిన ధరలు , నిరుద్యోగం , చీకటి బజారు లాంటి వాటికి ఇప్పుడూ మోక్షం కలుగలేదు . " కలకానిది విలువైనది , బ్రతుకు కన్నీటి ధారలలో బలి చేయకు " , " హాయిహాయిగాజాబిల్లితొలిరేయి వెండి తారాలల్లే మందుజల్లి నవ్వాసాగే ," "పాడవోయి భారతీయుడా " " శివ గోవింద గోవింద " , "చల్లని వెన్నెల సోనలు , తెల్లని మల్లేల మాలలు , మాపాపాయి బోసి నవ్వులే మంచి ముత్యముల మాలలూ " , " చిట్టీ పొట్టీ చిన్నారీ పుట్టిన రోజూ , చేరి మనం ఆడీ పాడే పండగ రోజు " హిట్ సాంగ్స్ . వీటిని శ్రీశ్రీ , కొసరాజు రాసారు . సంగీత దర్శకుడు ; పెండ్యాల . గాయనీ గాయకులు ; పి. సుశీల , ఘంటసాల , జిక్కీ , స్వర్ణలత , మాధవపెద్ది సత్యం . పాటలు;
పాడవోయి బారతీయుడా , ఆడి పాడవోయి విజయగీతికా
కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
చిట్టీ పొట్టీ చిన్నారి పుట్టిన రోజు చేరి మనం ఆడి పాడే పండుగ రోజు
చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో
1963 లో అన్నపూర్ణా పిక్చర్స్ లో వచ్చిన ఆణిముత్యం లాంటి సినిమా " చదువుకున్న అమ్మాయిలు " . ఈ సినిమా నిర్మాత డి. మధుసూధనరావు . దర్శకుడు : ఆదుర్తి . సుబ్బారావు . డాక్టర్ శ్రీదేవి రచించిన నవల ( ఏ నవలో టైటిల్స్ లో ఇవ్వలేదు ) ఆధారం గా ఈ సినిమాను తీసారు . యద్దనపూడి సులోచనా రాణి , ఆదుర్తి . సుబ్బారావు , కే. విశ్వనాథ్ , డి . మధుసూధనరావు నవలను సినిమా అనుకరణ చేసారు . టి. గోపీచంద్ మాటలు వ్రాయగా , ఆరుద్ర, దాశరధి , కోసరాజు , సి. నారాయణ రెడ్డి పాటలు వాసారు. . ఘంటసాల , పి. సుశీల , ఆశాలత కులకర్ణి , పి. బి శ్రీనివాస్ , స్వర్ణలత , మాధవపెద్ది గానం చేసారు . సుజాత ( సావిత్రి ) , గొప్పింటి అమ్మాయి . వసంత ( కృష్ణకుమారి ) సుజాత స్నేహితురాలు . ఒకరోజు సుజాత నేర్పిస్తుండగా వసంత కార్ నడుపుతుండగా, శేఖర్ ( నాగేశ్వర రావు ) నడుపుతున్న మోటర్ సైకిల్ కు కార్ తగిలి , శేఖర్ కింద పడుతాడు . అప్పుడు పోట్లాట నుంచి , ముగ్గురూ ఫ్రెండ్స్ అవుతారు . బాంక్ లో పని చేస్తున్న శేఖర్ బాకీ వసూలు కోసమని పల్లెటూరికి వెళ్ళగా , ఆ బాకీ చెల్లించవలిసింది వసంత తాతయ్యే నని తెలుసుకుంటాడు . వసంత చదువుకోసమే ఆ అప్పు చేసినట్లు తెలుసుకుంటాడు . ఇష్టం లేని పెళ్ళి నుంచి తప్పించుకొని వచ్చిన తమ చిన్న నాటి స్నేహితురాలు లత ( ఈ. వీ . సరోజ ) కు సుజాత ఆశ్రయం ఇస్తుంది . బాంక్ వారు ఆస్తిని జప్తుచేయగా నిరాశ్రయులైన వసంత తాతయ్య , అమ్మమ్మలకు కూడా సుజాత ఆశ్ర్యం ఇస్తుంది . కాని పరిస్తితుల వల్ల వాళ్ళు సుజాత ఇంటిని వదిలేసి , తాతయ్య స్నేహితుడు నడుపుతున్న బ్రహ్మచారి మఠం కు చేరుకుంటారు , వసంత , తాతయ్య , అమ్మమ్మ . శేఖర్ ను వసంత , సుజాత ఇద్దరూ ప్రేమిస్తారు . కాని శేఖర్ వసంతను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని , సుజాత తండ్రి చూసిన పోలీస్ ఆఫీసర్ ను పెళ్ళి చేసుకుంటుంది . బ్రహ్మచారి మఠం లోనే వున్న , శేఖర్ స్నేహితుడు ఆనంద్ ( పద్మనాభం ) వసంత అమ్మమ్మను మంచి చేసుకుంటాడు . తాతయ్య ( గుమ్మడి ) ఆరోగ్యం సీరియస్ గా వుండటము తో శేఖర్ తన మోటర్ సైకిల్ అమ్మి ఆ డబ్బును వసంత కివ్వమని శేఖర్ , ఆనంద్ కు చెపుతాడు . తనకు బాంక్ లో ఇన్స్పెక్షన్ వున్నందువలన ఆ పని ఆనంద్ కు వప్పచెపుతాడు శేఖర్ . ఆనంద్ ఆ మోటర్ సైకిల్ అమ్మిన డబ్బును శేఖర్ కు ఇవ్వకుండా దాచి , సాయం కాలం ఇస్తానన్నాడని , శేఖర్ కు చెపుతాడు . అప్పుడు తప్పనిసరి పరిస్తితి లో శేఖర్ బాంక్ నుంచి 1000 రూపాయలు తీసి ఆనంద్ కు వసంత తాతయ్య వైద్యం నిమిత్తము ఇస్తాడు . ఆ డబ్బు కూడా తీసుకొని , లత తో కలిసి వూరువదివెళుతాడు ఆనంద్. సరైన సమయం లో వైద్యం అందక తాతయ్య చనిపోతాడు . ఆ తరువాత వచ్చిన ఆనంద్ వల్ల అందరూ శేఖర్ ను అపార్ధం చేసుకుంటారు . పోలీసులు శేఖర్ కోసం వెతుకుతూ వుంటారు . చివరకు అపార్ధాలు తొలిగిపోతాయనుకోండి . కథ సుఖాంతం :)
సినిమా గురించి అంటే ఇది కుటుంబకథా చిత్రం . చాలా నీట్ గా వుంది . ముఖ్యం గా ఆడపిల్లలకు కూడా చదువు ఎంత ముఖ్యమో చెపుతుంది ఈ సినిమా . నటీ నటులందరూ దిగ్గజాలే ! వారి గురించి ప్రత్యేకం గా చెప్పేందుకేముంటుంది ? ఇద్దరాడపిల్ల ల మద్య నాగేశ్వర రావు చిలిపిగా వున్నారు . అన్నట్లు ఇందులో సావిత్రి భర్త పోలీస్ ఆఫీసర్ గా శోభన్ బాబు నటించాడు ! సావిత్రి ముందు చాలా చిన్నగా వున్నాడు . వీలైనంతవరకు గంభీరం గా వుండేందుకు ప్రయతించాడు :) ( ఆ తరువాత కొన్ని సినిమాలల్లో సావిత్రి కొడుకుగా నటించాడు :)) సావిత్రి కి అప్పటికే కాస్త పెద్దరికం వచ్చేసినట్లుంది ,రెండుజడల కాలేజీ గర్ల్ మేకప్ అంత నప్పలేదు . కాని క్యూట్ గా వుందిలే ! భర్త ( రేలంగి ) వేరే అమ్మాయి ని ప్రేమిస్తున్నాడని అపోహ పడి న భార్య ( సూర్యకాంతం ) అతని మనసు దోచుకోవటానికి , పూల జడ తో సింగారము తో భలేగా వుంది . ఆ సీన్ చూస్తున్నంత సేపూ ఒకటే నవ్వు :) ఇద్దరుమిత్రులు లో నాగేశ్వరరావు తో హీరోయిన్ గా వేసిన ఇ. వి సరోజ తరువాతి పిక్చర్ లోనే కామేడియన్ కం పద్మనాభాని కి జోడిగా రావటం సినిమా విచిత్రం ! బ్లాక్ అండ్ వైట్ సినిమా ఐనా చీరలు బ్రహ్మాండమైన డిజైన్లు వున్నాయి . చాలా బాగున్నాయి :) ఇంకో సంగతి , ఈ సినిమా లో సుజాత , వసంత మా 'రెడ్డీ వుమెన్స్ కాలేజ్ ' కాలేజీ లోనే చదువుకున్నారోచ్ :) ఈ సినిమాను చూడాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు . ఇందులోని కొన్ని పాటలు :- వకటే హృదయం కోసం
వినిపించని రాగాలే , కనిపించని అందాలే
ఆడవాళ్ళ కోపం లో అందముంది అహ అందులోనే అంతులేని అర్ధమున్నది
అజయ్ బాబు జమీందార్ పుత్రుడు . విదేశాలలో లో ఇంజనీరింగ్ చదువుతూ వుంటాడు . తండ్రి సీరియస్ గా వున్నాడని కేబుల్ వస్తే స్వదేశానికి వస్తాడు . వచ్చేసరికే తండ్రి మరణిస్తాడు . కళ్ళు లేని మేనత్త , మేనేజర్ భానోజీ రావు అతనిని ఓదారుస్తారు . వ్యాపారాల విషయాలన్నీ అల్ల కల్లోలం గా వుంటాయి . వాటిని తట్టుకోలేక , దుర్వ్యసనాలు అలవర్చుకుంటాడు . ఓరోజు రాత్రి తాగి కార్ డ్రైవ్ చేసుకొని వస్తుండగా ఒక యువకుడు అతని కార్ కింద పడతాడు . అతను అచ్చం తనలాగే వుండటము చూసి ఆశ్చర్యపోతాడు . అతనిని హోటల్ కు తీసుకెళ్ళి అతని పేరు విజయ్ అని , అతని చెల్లెలు మీనాకు ,పెళ్ళైనా , ఆమె కు పెళ్ళి లో పెట్టిన నగలు తల్లి ఆరోగ్యం కొరకు ఖర్చుపెట్టగా , ఆ నగలు తెస్తేనే తీసుకెళుతామని మీనా మామగారు , మీనా ను పుట్టింట్లోనే వుంచేసాడని , తండ్రి రామదాసు , రాముని సేవలో వుండి ఇంటిని పట్టించుకోవటము లేదని , ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక పోతున్నాడని తెలుసు కుంటాడు . డబ్బు వుంటే ఇబ్బందులు వుండవు అన్న విజయ్ అభిప్రాయము తప్పని తన ఇబ్బందులు చెపుతాడు . అది తెలుసుకునేందుకు విజయ్ ను తన ప్లేస్ లోకి మారమంటాడు . ఒక ఏడాది పాటు ఇద్దరూ ప్లేసులు మార్చుకునేందుకు ఒప్పందం చేసుకుంటారు . అజయ్ ఇంటికి వచ్చిన విజయ్ ను , అతను అజయ్ కాడని గుర్తిస్తుంది , అజయ్ మేనత్త . అప్పుడు ఆమెకు విషయం ఇద్దరు కలిసి వివరిస్తారు . అజయ్ ఆర్ధిక అవకతవకలకు మేనేజర్ భానోజీ రావే కారణమని గుర్తిస్తాడు విజయ్ . తన తెలివి తేటల తో పరిస్తితులను చక్క దిద్దుతూ వుంటాడు . భానోజీ రావు కూతురు సరళను ప్రేమిస్తున్నట్లుగా నటిస్తుంటూ వుంటాడు . సరళ అమాయకురాలని , తండ్రి చేసే పనులు ఆమెకు తెలీవని తెలుసుకుంటాడు . ఇహ అజయ్ , విజయ్ ఇంట్లో కలిసిపోతాడు . ఆటో మొబైల్ లో మెకానిక్ గా పని చేసి కుటుంబాన్ని నడిపిస్తూ వుంటాడు . ఆటో మొబైల్ ఓనర్ ప్రకాశ్ చెల్లెలు పద్మను ప్రేమను ప్రేమిస్తాడు . బావ బుజ్జి ని ఇంటికి తీసుకొస్తాడు . విజయ్ కంపెనీ లో విజయ్ కు పర్సనల్ సెక్రెటరీ గా పద్మ కు వుద్యోగం వస్తుంది . మీనా మీద అపనిందలు వస్తున్నాయని , విజయ్ గా వున్న అజయ్ , అజయ్ గా బాంక్ కు వెళ్ళి 10, 000 రూపాయలు తెచ్చి , మీనా మామగారికి ఇచ్చి , మీనా ను అత్తవారింటికి పంపుతాడు . ఈ లోగా భానోజీ అజయ్ , విజయ్ ల ఒప్పందం గురించి తెలుసుకుంటాడు . అజయ్ ను దొంగా గా పోలీసులకు పట్టిస్తాడు . విజయ్ , సరళ తో ఎంగేజ్మెంట్ నాటకం ఆడి , ఆ నాటకం లో భానోజీ ని పోలీసులకు పట్టిస్తాడు . అజయ్ పద్మ , విజయ్ సరళ ల పెళ్ళి తో సినిమా ముగుస్తుంది .
ఈ సినిమా ను ,1961 లో అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించారు . ఈ సినిమా " తాషేర్ ఘర్ " అనే బెంగాలి నవల ఆధారం గా నిర్మించబడినది . ఆ నవలను , ఏ. సుబ్బారావు , కే , విశ్వనాథ్ , గోరాశాస్త్రి , డి. మధుసూధనరావు సినిమాకు అనుగుణం గా మార్చారు . ఆదుర్తి .సుబ్బారావు దర్శకత్వం వహించగా , డి . మధుసూదన రావు నిర్మించారు . ఇందులో అజయ్ , విజయ్ గా నాగేశ్వర రావు , సరళగా రాజసులోచన, పద్మగా ఇ.వి. సరోజ , భానోజీగా గుమ్మడి , మీనా గా శారద , బుజ్జిగా పద్మనాభం , బుజ్జి తల్లి తండ్రులుగా రేలంగి , సూర్యకాంతం , రామదాసుగా రమణా రెడ్డి , నటించారు . నాగేశ్వరరావు నటన గురించి నేను ప్రత్యేకం గా చెప్పేదేముంటుంది . పద్మ , సరళ గా ఇ.వి సరోజ , రాజసులోచన ముద్దుగా బొద్దుగా వున్నారు . ఇంతకు ముందు అన్నపూర్ణా వారి సినిమా మాంగల్యబలం లో హాస్య నటిగా వున్న రాజసులోచనకు ఇందులో నాయిక పాత్ర దక్కింది :) నేను మహానటిగా , నాయిక పాత్రలలో చూసిన శారద ఇందులో చెల్లెలి పాత్ర లో చూడటము గమ్మత్తుగా వుంది . అన్ని సినిమాలలో గయ్యాళి అత్తగారిగా వేసే సూర్యకాంతం మంచి అత్తగారు , మంచి తల్లి పాత్రలో కనిపించింది :) రేలంగి , రమణా రెడ్డిల హాస్యం బాగుంది . శ్రీశ్రీ, ఆరుద్ర , దాశరధి , కోసరాజు వ్రాసిన చక్కటి పాటలను , ఘంటసాల , పి. సుశీల , శ్రీనివాస్ , మాధవపెద్ది సత్యం , యస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం లో మధురం గా ఆలపించారు . పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది . " ఓహో ఓహో నిన్నే కోరెదా , కుహూ కుహూ అనే కోయిలా " పాట లో చందమామ వెన్నెల వెలుగు లు చూసి తీరవలిసిందే ! అసలు అన్నపూర్ణా వారు అంత చక్కటి మేడను ఎక్కడ తీసుకున్నారో ! ఆ మేడ మీద మాలతీ లతల తో వున్న పందిరి , పైన వెన్నెల రేడు ఓహ్ చెప్పలేనంత అందముగా వున్నాయి . ఆ చిత్రీకరణ గొప్పదనము చాయాగ్రహ దర్శకుడు పి. యస్ సెల్వరాజ్ దే అంటే బాగుంటుందేమో ! "పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక " పాట కూడా ఏమీ తీసిపోలేదు . అసలు అన్ని పాటలూ చాలా చాలా బాగున్నాయి .
సినిమాలో కాలాపహాడ్ ను , నిండుగా వున్న గండిపేటను చూసి నలభై ఏళ్ళ వెనకకి వెళ్ళిపోయాను :) అంతేకాదు రిట్జ్ హోటల్ కూడా వుంది :)
నెట్ లో అన్ని పాటలు లేవు . వున్నవి ఇవే :) ఓహో ఒహో నిన్నే కోరెదా
1958 లో అన్నపూర్ణా పిక్చర్స్ వారు నిర్మించిన కుటుంబ కథా చిత్రం " మాంగల్య బలం " . ఈ సినిమా నిర్మాత డి. మధుసూధనరావు . దర్శకత్వం వహించింది ఆదూర్తి . సుబ్బారావు . ఇందులో నాయిక నాయకులు గా ఏ. నాగేశ్వరరావు . సావిత్రి నటించారు . ఇంకా యస్. వి రంగారావు , సూర్యకాంతం , కన్నాంబ , రేలంగి , రాజసులోచన , రమణా రెడ్డి మొదలైన వారు నటించారు .
పాపారావు కు ఒక కొడుకు సూర్యం , కూతురు సరోజ . భార్య కాంతం మహా గయ్యాళిది . ఎప్పుడూ అత్తగారిని ఝాడించటమే పని . ఆమె నోటికి అంతా భయపడతారు . ఆడపడుచు సీత ఏమీ లేని పేదవాడిని ప్రేమించిపెళ్ళి చేసుకున్నదని ఆమె అంటే చులకన . ఏమైనా అంటే మీరూ మీరూ ఒకటి నేనేగా పరాయిదానిని అంటూవుంటుంది .
వూరి నుంచి పంతులు శిస్తు వసూలుచేసుకొని వస్తాడు . అతని ద్వారా సీతకు గుండెజబ్బు వచ్చిందని తెలుస్తుంది . ఆమె ను చూసేందుకు పార్వతమ్మ , సూర్య , సరోజలను వెంటపెట్టు కొని వూరు వెళుతుంది . అక్కడ చావు బతుకుల మద్య వున్న సీత కడసారి కోరిక తీర్చేందుకు సరోజకు , సీత కొడుకు చంద్రాని కి పెళ్ళి జరిపిస్తుంది . పెళ్ళి జరిగిన తరువాత వచ్చిన పాపారావు విషయము తెలుసుకొని తల్లిపై మండిపడి పిల్లలను తీసుకెళ్ళి పోతాడు . కాంతం జరిగిన సంగతి తెలుసుకొని సరోజ మెడలో నుంచి మాంగల్యం తెంపేస్తుంది . సూర్యం అది తీసి దాచిపెడతాడు . కాంతం కోర్టులో కేసువేసి వివాహ బంధం తెపేస్తుంది . జరిగింది తెలుసుకున్న పార్వతమ్మ పల్లెటూరిలోనే వుండిపోయి భరణం కోసం కొడుకు మీదా దావా వేసి , 10 ఎకరాలు పొందుతుంది . చంద్రం కు పెళ్ళి సంబంధాలు చూడాలని తండ్రి అనుకున్నప్పుడు ,అమ్మమ్మ పార్వతమ్మ చిన్న తనములో సరోజ తో పెళ్ళైన సంగతి చెప్పి ఎలాగైనా సరోజ మనసు గెలుచుకొని మాంగల్య బంధాన్ని నిలపమని చెపుతుంది . చంద్రం తిరుపతి లో సరోజ ను కలుస్తాడు .ఆమె ప్రేమ నుపొందుతాడు . సరోజకు , తనకు చిన్న వయసులో పెళ్ళైన సంగతి అన్నయ్య ద్వారా తెలుస్తుంది . మాంగల్యాన్ని కాదనలేక , ప్రేమించిన వాడిని వదులుకోలేక విచారిస్తున్న సరోజకు పార్వతమ్మ ద్వారా ప్రేమించి శేఖరే తన భర్త చంద్రం అని తెలుస్తుంది . కొన్ని మలుపుల తరువాత సినిమా సుఖామంతమవుతుంది . అన్నీ సినిమాల్లో లాగే ఇందులోనూ యస్. వి . రంగారావు చివరలో సూర్యకాంతానికి గన్ చూపించి , మనమూ మనమూ ఒకటే అనిపిస్తాడు :) పాటలన్నీ చాలా బాగున్నాయి . చిన్న పిల్లలు బొమ్మలపెళ్ళిలో పాడిన పాట " హాయిగా హాయిగా ఆలూమగలై కాలం గడపాలి " పాట , యాభై ఏళ్ళ క్రితమే కాదు ఈ కాలం లో నూ భార్యా భర్తలు ఇలాగా వుండాలి అని అనిపిస్తుంది . " ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి , సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి , శరీరాలు వేరే కాని మనసొకటై మసలాలి , సుఖ మైనా కష్టమైనా సగపాలుగా మెలగాలి . " ఇవి ఎంత నిజం . " తెలియని ఆనందం నాలో విరిసినదీ వుదయం " పాటలో తిరుపతి అందాలు కనువిందు చేసాయి . నిజం తిరుపతి లో తెల్లవారుఝామున సుప్రభాత సేవకు వెళ్ళేటప్పుడు ఆ ప్రకృతి అలాగే వుంటుంది . " ఆకాశ వీధిలో అందాల జాబిలి " పాటలో విజయావారి చందమామ తో పోటీపడ్డాడు . ఆ మేడ , ఆ జాబిల్లి ఎంత బాగున్నాయో ! " పెనుచీకటాయే లోకం " పాటలో మాంగల్యాన్ని కాదనలేక , ప్రేమించినవాడిని మరిచిపోలేక నలిగిపోయిన అమ్మాయిగా సావిత్రి హావభావాలు వర్ణిచలేనివి . అందుకే సావిత్రి ని "మహానటి" అన్నారు . సినిమా పెళ్ళి విందు తో ముగుస్తుంది . మనకు సినిమా విందు :-
పోల్కంపల్లి శాంతాదేవి వ్రాసిన నవల " చండీ ప్రియ " ఆధారముగా " చండీప్రియ " సినిమాను అంజలీ పిక్చర్స్ వారు 1980 లో నిర్మించారు . పూర్తి రివ్యూ ను చిత్రమాలిక లో చదవండి .
నారాయణ మూర్తి కి కళలంటే మహా ప్రీతి . అందుకని తన కూతుళ్ళిద్దరు , రూప , తార కు భరతనాట్యము నేర్పిస్తుంటాడు . లలిత కళలను పోషించేందుకోసం థియేటర్ కూడా నిర్మించి , అందులో రూప , తార ల తో నృత్య ప్రదర్షన ఇప్పిస్తాడు . నారాయణ మూర్తి దగ్గర మేనేజర్ గా పని చేసే నాగభూషణానికి రాము , గోపి ఇద్దరు కొడుకులు .రాము కొంచము దుడుకు వాడు . రూప నాట్యప్రదర్షన రోజున చెరువు లోనుంచి తామర పూవులు తెచ్చి రూపకు ఇచ్చి , తండ్రి తో చివాట్లు తింటాడు . ఇంకోరోజు తన చేతిమీద " రాము " అని పచ్చ బొట్టు పొడిపించుకొని , అటుగా వస్తున్న రూపను కూడా పచ్చబొట్టు పొడిపించుకోమని చెపుతాడు . అందుకు రూప కోపగించి , ఇంటికి వెళ్ళి , నాగభూషణానికి రాము మీద కంప్లేయింట్ చేస్తుంది . నాగభూషణము రామూ ను కొడతాడు . అది చూసి రూప రామూ ను వెక్కిరిస్తే రాము , రూపను తోసేస్తాడు . రూప మెట్లమీద నుంచి పడిపోతుంది . రూప కాలు విరుగుతుంది . డాక్టర్ రూపకు కాలు రావటము కష్టము అని చెపుతాడు . దానితో నారాయణమూర్తి రామూ పై కోపము తెచ్చుకొని పిస్టోల్ తో కాలుస్తానని వెంట పడగా రామూ పరిగెత్తుతాడు . రామూను ఆగమని అర్స్తుండగా నారాయణ మూర్తి చేతిలోని పిస్తోలు పొరపాటున పేలుతుంది . రాము వంతెన మీది నుంచి నది లో పడిపోతాడు . నా కొడుకును చంపేసావు , నిన్ను పోలీసులకు పట్టిస్తాను అని నాగభూషణము కోపముగా వెళుతాడు . నారాయణ మూర్తి ని పోలీసులు పట్టుకొని వెళ్ళారా ? నది లో పడిపోయిన రాము ఏమైనాడు ? రూప , తార ఏమయ్యారు ? ఈ ప్రశ్నలన్నింటి కి జవాబు . . . .
ఆ ((((( భలే ఆశే !!!!! నేను చెప్పను . ఆ కథ వెండితెరపై చూడుడు :))))) ఆవెండితెర పేరు " భలేరాముడు " . దానిని నిర్మించినది ; వి. యల్ . నరసు . దర్షకత్వము : వేదాంతము రాఘవయ్య . కథా రచయిత ; వెంపటి సదాశివ బ్రహ్మం . సంగీత దర్షకత్వం ; సాళూరి రాజేశ్వరరావు . విడుదల తేదీ ; ఏప్రిల్ 6, 1956 . నటీనటులు , గాయనీ గాయకులు ఎవరంటారా ??? అబ్బా * * * ఇంక నాకు చెప్పే వోపిక లేదు మీరే సినిమా చూసి తెలుసుకోండి . . .
స్చప్ . . . అదేమిటో ఈ రోజు చూసే సరికి యుట్యూబ్ వాడి విడిఓలు తీసెసాడు . ఈ మద్య వాళ్ళ టైం ఐపెయింది అని తీసెస్తున్నారు :) ఈ స్నిప్స్ వాడు కూడా తీసేసాడు . మళ్ళీ అన్నీ మార్చుకోవాలి .
నా ముందు తరం తెలుగింటి ఆడపడుచులు శరత్ నవలల ను బాగా ఆదరించారు . ఆ రోజులలో శరట్ నవలలు చదవటము , ఆ బెంగాలీ పేర్లను పిల్లలకు పెట్టుకోవటము ఫాషన్ గా వుండేది . అందుకు కారణం , బహుషా శరత్ నాయికలందరూ మధ్యతరగతి వారే . స్త్రీని అన్ని కోణాలనుంచీ చిత్రిస్తూ , శక్తిస్వరూపిణి గానూ , దయార్ద హృదయిని గానూ , సేవాతత్పరురాలుగానూ , ప్రేమామృతవర్షిణిగానూ , ఉద్యమశీలిగా నిలిపిన ఘనత శరత్ ది . 19వ శతాబ్ధం మద్య నుండి 20 శతాబ్ధం మద్య వరకూ శరత్ వర్ణించిన స్త్రీ జీవించిన సాంసారిక , సామాజిక పరిస్తితులే కొంచం అటూ ఇటూగా తెలుగునాట కూడా వున్నాయి . స్త్రీలోని బహుముఖీన స్వభావాలు తెలుగు పాఠకులనూ , ప్రధానం గా స్త్రీలనూ ఆకర్షించాయి . అందుకే తెలుగు పాఠకులకు శరత్ అత్యంత ఆదరణీయ రచయత కాగలిగాడు . ఆ రోజులలో శరత్ నవల ల ఆధారము గా సినిమాలు కూడా చాలా వచ్చాయి . అవి జనాదరణ కూడా పొందాయి . 1957 లో అన్నపూర్ణ వారు శరత్ నవల " నిష్కృతి " ఆధారము గా " తోడికోడళ్ళు " నిర్మించారు . అన్నపూర్ణ వారి ఆణిముత్యములలో తోడికోడళ్ళు కూడా ఒకటి . ఇందులోని పాటలు కూడా ప్రజాదరణ పొందాయి . ఇది చక్కటి ఉమ్మడి కుటుంబ కథా చిత్రము . ఇదిగో ఆ సినిమా :-
సినిమా తరువాత చూస్తారా ? ఇప్పుడు పాటలు చూస్తారా వాకే గాలిపటం గాలిపటం
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ దానా
ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ . . . ఇది బాగా హిట్టైన పాట . నాకూ ఇష్టమైన పాట :)
విజయా వారి చిత్ర్తాల గురించి వ్రాయాలని ఓ సంవత్సరం గా ప్రయత్నం . ఎక్కడా మహా బద్దకం :) అనుకోవటము లోనే అలా అలా గడిచిపోయింది :) ఇదో ఇన్నాళ్ళకు చిత్రమాలికకోసం "గుండమ్మ కథ " రాశాను . ఇంకేం కథ అక్కడ చదవండి . సినిమా ఇక్కడ చూడండి . హాయిగా నవ్వుకోండి . అక్కడక్కడ కనువిందు చేసే విజయావారి చంద్రుని చూసి ఆనందించండి . అన్నట్లు కమ్మటి పాటలు , వాటి చిత్రీకరణ చూసి ఆనందించిండి . పదండి మరి . . . . .
శ్రీవారికి ప్రేమలేఖ పొత్తూరి విజలక్ష్మి రాసిన " ప్రేమలేఖ " ఆధారం గా తీసారు . ఈ నవల గురించి సాహితిలో చదవండి . సినిమా గురించి నేను చెప్పటమెందుకు మీరే చూడండి :)
"దొంగరాముడు " సినిమాను 1955 లో "అన్నపూర్ణ పిక్చర్స్ " బానర్ లో డి . మధుసూధనరావు నిర్మించారు . అన్నపూర్ణా పిక్చర్స్ వారి మొదటి సినిమా ఇది . దీని తరువాత వారు చాలా మంచి సినిమాలు తీసారు . ఈ సినిమా డైరెక్టర్ కదిరి వెంకట రెడ్డి . నాగేశ్వర రావు , జగ్గయ్య , సావిత్రి , జమున , రేలంగి , సూర్యకాంతం మొదలైన వారు నటించారు . కథా రచయతలు ; డి. వి నరసరాజు , డి మధుసూధన రావు . సంగీతం ;పెండ్యాల నాగేశ్వర రావు , సినిమటొగ్రఫీ ; అడి .. యం ఇరానీ . గాయనీ గాయకులు ; ఘంటశాల , మల్లాది రామకృష్ణ శాస్త్రి , జిక్కి & పి. సుశీల . రాము చాలా అల్లరి పిల్లవాడు . స్కూల్ కు వెళ్ళ కుండా అల్లరి చేస్తూ వుంటాడు . తల్లి కి జబ్బు చేస్తే మందు తెచ్చేందుకు టౌన్ కు వెళుతాడు . రాము తీసుకెళ్ళిన డబ్బులు మందుకు సరిపోవు . ఎవరిని బతిమిలాడినా తక్కువైన రెండురూపాయలు ఇవ్వరు . తల్లిని బతికించుకునేందుకు ఆ మందు సీసా దుకాణం నుంచి దొంగతనము చేసి పారిపోతుండగా పోలీసులు పట్టుకొని బాలనేరస్తుల స్కూల్ లో చేరుస్తారు . ఆ సంగతి తెలిసి తల్లి చనిపోతుంది . చెల్లెలు లక్ష్మిని మాస్టర్ గారు అనాధాశ్రమంలో చేరుస్తారు . రాము పెద్దవాడైనాక జైల్ నుంచి విడుదలై చెల్లెలిని కలుసుకుంటాడా ? లక్ష్మి అనాధాశ్రమం లో ఎలా పెరుగుతుంది ? చివరకు ఏమవుతుంది ? వీటన్నిటి కీ సమాధానం గా ఇదో "దొంగరాముడు " సినిమా చూడండి . పాత సినిమా అని ముక్కు విరవకండి . చాలా బాగుంటుంది . ఎంచక్కా కొన్ని స్నాక్స్ , టీ తెచ్చుకొని ఆరాముగా కూర్చొని చూడండి . తప్పక నచ్చుతుంది . ఊ ఇంకెందుకు ఆలీసం ? కానివ్వండి . Donga Ramudu - Full Length Telugu Movie ; దొంగరాముడు , పూర్తి సినిమా ఇది . అక్కడక్కడ తప్ప అంతా క్లియర్ గా వుంది . హాయిగా చుడవచ్చు .
ఒక శతాబ్ధం కిందట సమాజం లో , ముఖ్యం గా బ్రాహ్మణ కుటుంబాలలో వున్న , 'కన్యాశుల్కం' అనే దురాచారం గురించి రాసిన నాటకం కన్యాశుల్కం . ఇది గురజాడ అప్పారావు గారు 1892 వ ప్రాంతం లో రచించారు . ఆనాటి స్తితిగతులను ఇందులో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు . ఆడపిల్లలను పసితనం లోనే డబ్బు కక్కుర్తికి ముసలివారికి ఇచ్చి వివాహం జరిపించేవారు . ఆ ముసలి వారికి చాకిరీ చేసేందుకోసం వీరు నియమించబడేవారు . ఆ అమ్మాయికి వూహతెలిసే సమయానికే విధవైపోయేది పాపం . అప్పటి నుంచి ఓపిక వున్నన్ని సంవత్సరాలు అత్తింటనో , పుట్టింటనో చాకిరీ చేయటమే సరిపోయేది . వారి జీవితం ధుర్భరం గా గడి చేది . కన్యాశుల్కం రూపుమాసిపోయినా , ఆడపిల్లలకు చిన్నతనములోనే వివాహం జరిపించటము మటుకు తగ్గలేదు . ఆ తరువాతి కాలం లో తురష్కులు గ్రామాల మీద పడి దోచుకునేటప్పుడు , ఆడపిల్లలని కూడా ఎత్తుకుపోయే వారట . కాకపోతే పెళ్ళైన అమ్మాయిలను ఎత్తుకెళ్ళేవారు కారుట . అందుకని అమ్మాయిలకు 8 సంవత్సరములు నిండ కుండానే వివాహం చేసేవారట .( ఈ సంగతి నాకు మా తాతగారు చెప్పారు .) అప్పుడూ యుక్తవయస్సు వచ్చేసరికే విధవలై పోవటము తప్పలేదు ! కాల క్రమేణ ' శారదా ఆక్ట్ ' అంటే వ్యక్తురాలు కాని అమ్మాయి కి పెళ్ళి చేయకూడదు అనే రూల్ వచ్చినా అలాగే దొంగతనం గా చేసేవారు . ప్రస్తుతమైతే 18 సంవత్సరాలు నిడకుండా అమ్మాయి పెళ్ళి చేయకూడదు అని రూల్ వుందనుకోండి . ఐతే వరకట్న బాధ వచ్చిందిగా ! ఏరాయైతేనేమి పళ్ళూడ గొట్టు కోవటానికి ? అప్పుడూ , ఇప్పుడూ , ఎప్పుడూ అమ్మాయికి ఏదోవిధం గా కష్టాలు తప్పటం లేదు !!!
కన్యాశుల్కం నాటకం ఆధారం గా 1955 లో డి.యల్ గారు పి. పుల్లయ్య దర్శకత్వం లో సినిమా తీసారు ఆ విశేషాలని చిత్రమాలిక లో చదవండి . అది నేనే రాశాను లెండి . ఆ చిత్రం పాటలు కమ్మటి కలలు లో వినండి :)
అన్నట్లు ఈ కింద చిత్రం లో వున్న ఫొటోలు , కన్యాశుల్కం లో గురజాడ వారు వర్ణించిన , అప్పటి విజయనగర వీధులు :_
ఇంక పాటలలో యంటి ఆర్ నూ , సావిత్రి నీ , జానకీ వగైరాలను చూడండి .
యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన "నల్లంచు తెల్ల చీర " నవల ఆధారముగా , మహేశ్వరీ ఫిలంస్ వారు తీసిన సినిమా " దొంగ మొగుడు " . ఇందులో నాయకుడుగా చిరంజీవి ద్విపాత్రాభినయనంచేయగా , మాధవి , రాధిక , భానుప్రియ నాయికలుగా నటించారు . నిర్మాత ; వెంకన్నబాబు , దర్శకత్వం ; కోదండరామి రెడ్డి . పాటల రచయతలు : కోసరాజు , సీతారామ శాస్త్రి , రాజశ్రీ . గాయనీ గాయకులు ; యస్.పి బాలసుబ్రమణ్యం , పి. సుశీల యస్ . జానకి , యస్.పి శైలజ . సంగీత దర్శకత్వం ; చక్రవర్తి , సహాయకులు ; కృష్ణ , చక్రి . ఈ సినిమా గురించిఅక్కడ చదవండి . కొన్ని పాటలు ఇక్కడ చూడండి :)
1981 లో కె. విశ్వనాథ్ దర్షకత్వం లో వచ్చిన చిత్రము " సప్తపది ". ఈ చిత్రానికి కథ వ్రాసింది కూడా కె. విశ్వనాథ్ నే . మాటలు : జంధ్యాల , నిర్మాత : భీమవరపు బుచ్చిరెడ్డి . " ఆచార వ్యవహారాలన్నవి మనసును సక్రమమైన మార్గం లో పెట్టటానికి తప్ప కులమన్న పేరు తో మనుషులను విడదీయటానికి కాదు ." అన్న సూక్తి మీద తీసినదీ చిత్రము . ఇందులో సోమయాజులు , అల్లు రామలింగయ్య , రమణారావు , కొత్త నటీ నటులు , సబిత , రవికాంత్ , గిరీష్ మొదలైనవారు నటించారు . శంకారభరణం నుంచి సోమయాజులు , అల్లు రామలింగయ్య ల కు ఒకే రకమైన పాత్రలు ఇచ్చినట్లున్నారు కె. విశ్వనాథ్ :) గోదావరిని అందముగా విశ్వనాథ్ చూపించినట్లుగా ఇంకెవరూ చూపించలేరేమో అన్నంత అందం గా వున్నాయి దృష్యాలన్నీనూ . కథ బాగుంది . అన్నీ బాగున్నాయి కాని చిత్రీకరణ నే నాకు అంతగా నచ్చలేదు ! పాటలైతే చాలా చాలా బాగున్నాయి . మరి ఆ పాటలను చూద్దామా :) సంగీతం : కె.వి . మహదేవన్ పాడిన గాయనీ గాయకులు , పి. సుశీల యస్. జానకి , యస్.పి బాలసుబ్రమణ్యం .